బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!

- August 27, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!

మనామా: బహ్రెయిన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) తాజా గణాంకాల ప్రకారం.. 2025లో నివాస, వాణిజ్య విభాగాలకు చెందిన మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్లు 26,23,834కు చేరాయి. 2024లో ఉన్న 26,15,778 కనెక్షన్లతో పోలిస్తే 8,056 కనెక్షన్లు, అంటే 0.3 శాతం పెరిగాయి. 2015 నుంచి 2025 వరకు TRA నమోదు చేసిన గణాంకాల్లో ఇదే అత్యధిక సంఖ్యగా నిలిచింది.

2025లో బిజినెస్ ఇంటర్నెట్ కనెక్షన్లు గణనీయంగా పెరిగాయి. 2024లో 12,288గా ఉన్న వ్యాపార కనెక్షన్లు గత ఏడాది 14,969కు చేరాయి. అంటే 2,681 కనెక్షన్లు పెరిగి 21.8 శాతం వృద్ధి నమోదైంది. 11 ఏళ్ల గణాంకాల్లో ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక సంఖ్యా పెరుగుదల ఇదే కావడం విశేషం. 2022లో నమోదైన 22.5 శాతం వృద్ధి తర్వాత గత ఏడాది వృద్ధి రెండో అత్యధికంగా నిలిచిందని గణంకాలు తెలిపాయి. అయితే మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్లలో వ్యాపార విభాగం వాటా కేవలం 0.6 శాతం మాత్రమే. నివాస కనెక్షన్ల వాటా 99.4 శాతంగా ఉంది. అయినప్పటికీ 2025లో నమోదైన మొత్తం కొత్త కనెక్షన్ల పెరుగుదలలో దాదాపు మూడో వంతు వ్యాపార కనెక్షన్ల నుంచే వచ్చిందని పేర్కొన్నారు.  

ఇక రెసిడెన్షియల్ ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య మాత్రం పెద్దగా పెరగలేదు. 2024లో 26,03,490గా ఉన్న గృహ కనెక్షన్లు 2025లో 26,08,865కు చేరాయి. 5,375 కనెక్షన్లు మాత్రమే పెరగడంతో వృద్ధి రేటు 0.2 శాతానికే పరిమితమైంది. 2024లో గృహ కనెక్షన్లు 3.8 శాతం పెరిగింది.  2015లో 19,65,926గా ఉన్న రెసిడెన్షియల్ కనెక్షన్లు 2025 నాటికి 26,08,865కు చేరాయి. దశాబ్ద కాలంలో ఇవి 6,42,939 పెరిగి 32.7 శాతం వృద్ధి సాధించాయి.

క్లౌడ్ సేవలు, ఆన్‌లైన్ వాణిజ్యం, డిజిటల్ చెల్లింపులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కనెక్టెడ్ డివైజ్‌ల వినియోగం పెరుగుతుండటంతో సంస్థలకు వేగవంతమైన, అధిక సామర్థ్యం కలిగిన ఇంటర్నెట్ అవసరం పెరుగుతోంది.  TRA రెండో త్రైమాసికం 2025 గణాంకాల ప్రకారం.. బహ్రెయిన్‌లో బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్లు 25,94,712గా ఉన్నాయి. బ్రాడ్‌బ్యాండ్ పెనిట్రేషన్ రేటు 163 శాతంగా నమోదైంది. డెడికేటెడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు సుమారు 5.24 లక్షలు ఉండగా, ఫైబర్ కనెక్షన్లు దాదాపు 1.82 లక్షలకు చేరాయి.  2024లో బహ్రెయిన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా వచ్చిన ఆదాయం 66 మిలియన్ బహ్రెయిన్ దినార్లుగా ఉంది.    

బహ్రెయిన్ ప్రస్తుతం తన ఆరవ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ప్లాన్ అమలుపై దృష్టి సారించింది. దేశాన్ని ‘స్మార్ట్ కింగ్‌డమ్’గా తీర్చిదిద్దుతూ విస్తృతంగా 1 గిగాబిట్‌కు పైగా ఇంటర్నెట్ వేగాలను అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రణాళికలో ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com