ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం

- August 30, 2026 , by Maagulf
ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతి ఇవటూరికు ఘన సత్కారం

డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ వంటి సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు మరియు అనేక ఇతర సామాజిక సేవా కార్యక్రమాలలో తన విలువైన సేవలతో అవసరమైన వారందరికీ వ్యక్తిగతంగాను, వివిధ సంస్థల ద్వారాను అండగా నిలిచిన డా. భానుమతి ఇవటూరిని ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర; షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి మరియు పూర్వాధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా.నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె;అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, తానా బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్ ప్రసాద్, రావు కల్వల, డా.జగదీశ్వరన్ పుడూర్ లు జీవిత సాఫల్య పురస్కారంతో భానుమతిని ఘనంగా సన్మానించారు. 

సభాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “సమస్యకు-పరిష్కారానికి మధ్య, వివాదానికి-అవగాహనకు మధ్య, గందరగోళానికి-స్పష్టతకు మధ్య, నిరాశకు-ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు తమ మాతృభూమి విలువలను, సంప్రదాయాలను, ఆశలను, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సార్లు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు - అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థంచేసుకున్న భానుమతి – ‘తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదు’ అంటారు.  జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు మనవల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే సరైన విజయం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ భానుమతి ఇవటూరి జీవితం అంటూ ప్రసాద్  ప్రశంసించారు. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భావి జీవితం గడపాలనుకోవడం హర్షనీయమని, సుఖ సంతోషాలతో డా. భానుమతి జీవితం గడవాలని అందరి తరపున డా. ప్రసాద్ తోటకూర ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.”
వివిధ సంధర్భాలలో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్ ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి ప్రబృతులు భానుమతి సేవలను కొనియాడారు. 

డా.భానుమతి ఇవటూరి మాట్లాడుతూ– “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్ లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్ లో దాదాపు వందమందికి పైగా ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసిన వారందిరికీ, ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది, తన ఈ సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్నారు”.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com