యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- September 04, 2026
దుబాయ్: యూఏఈలో నకిలీ, కల్తీ లేదా పాడైన వస్తువుల విక్రయంపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త వాణిజ్య మోసాల నిరోధక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం నకిలీ వస్తువులుగా గుర్తించిన ఉత్పత్తులను సరఫరాదారులు 24 గంటల్లో మార్కెట్లు, దుకాణాలు, గోదాముల నుంచి తొలగించాల్సి ఉంటుంది. మంత్రిత్వ శాఖ లేదా సంబంధిత అధికార సంస్థ నుంచి నోటీసు అందిన వెంటనే కల్తీ, పాడైన లేదా నకిలీ వస్తువుల విక్రయం, ప్రదర్శనను నిలిపివేయాలి. అదే సమయంలో ఆ ఉత్పత్తులను మార్కెట్లు, గోదాముల నుంచి వెనక్కి తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
సంబంధిత వస్తువులను అందుకున్న అన్ని విక్రయ కేంద్రాలు, సంస్థలకు కూడా సరఫరాదారు సమాచారం ఇవ్వాలి. వారి వద్ద ఉన్న నకిలీ వస్తువులను కూడా 24 గంటల గడువులోనే షెల్ఫ్‌ల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలి. అనంతరం ఉత్పత్తుల ఉపసంహరణ పూర్తయినట్లు ఆధారాలను మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.
48 గంటల్లో చర్యలు
సరఫరాదారు నిర్ణీత 24 గంటల గడువులో నకిలీ వస్తువులను ఉపసంహరించుకోకపోతే, అధికారులు నేరుగా జోక్యం చేసుకుంటారు. తదుపరి 48 గంటల్లో, సంబంధిత మార్కెట్లు, గోదాముల నుంచి వస్తువులను అధికారులు తొలగిస్తారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చును సరఫరాదారుడి నుంచే వసూలు చేస్తారు. సరఫరాదారుడిని సంప్రదించడం సాధ్యం కాకపోయినా అధికారులు స్వయంగా వస్తువులను ఉపసంహరించుకుని, తర్వాత సరఫరాదారుడిని సంప్రదించినప్పుడు ఖర్చును తిరిగి వసూలు చేస్తారు.
ప్రజలకు ప్రకటన తప్పనిసరి
మోసపూరిత లేదా నకిలీ వస్తువుల ఉపసంహరణపై ప్రజలకు కూడా సమాచారం ఇవ్వడం కొత్త నిబంధనల్లో తప్పనిసరి చేశారు. నోటీసు అందిన 48 గంటల్లోపు, మంత్రిత్వ శాఖ లేదా సంబంధిత అధికారం నిర్దేశించిన మీడియా ద్వారా ప్రకటన విడుదల చేయాలి. ప్రకటనలో సంబంధిత వస్తువుల పూర్తి వివరాలను స్పష్టంగా పేర్కొనడంతో పాటు, దానిని అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో ప్రచురించాలి. అయితే, ఆ వస్తువులు మానవ లేదా జంతు ఆరోగ్యం, భద్రత లేదా పర్యావరణానికి ముప్పుగా ఉంటే ఈ గడువును మరింత తగ్గించే అవకాశం ఉంది.
ఇతర కీలక అంశాలు
కొత్త కార్యనిర్వాహక నిబంధనల ప్రకారం మార్కెట్లపై ముందస్తు పర్యవేక్షణ, క్రమబద్ధమైన తనిఖీ విధానాలను అమలు చేయనున్నారు. నకిలీ వస్తువులను గుర్తించడం, స్వాధీనం చేసుకోవడం, వాటిపై చర్యలు తీసుకోవడానికి స్పష్టమైన విధివిధానాలను రూపొందించారు.
కోర్టు తీర్పు లేదా సుప్రీం కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత 15 పని దినాల్లోపు నకిలీ వస్తువులను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. వాణిజ్య మోసాలను అరికట్టేందుకు మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత అధికార సంస్థల మధ్య సమాచార మార్పిడి, సమన్వయాన్ని కూడా మరింత బలోపేతం చేయనున్నారు.
తొలి త్రైమాసికంలో 10 వేలకుపైగా తనిఖీలు
2026 తొలి త్రైమాసికంలో యూఏఈ వ్యాప్తంగా వాణిజ్య మోసాలకు సంబంధించి అధికారులు 10,023 తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 189 ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆర్థిక, పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్థానిక ఆర్థిక, పర్యవేక్షణ సంస్థలతో కలిసి నకిలీ, కల్తీ, నకిలీ బ్రాండ్ ఉత్పత్తులపై జాతీయ స్థాయిలో చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాణిజ్య నియంత్రణ, పాలన విభాగం అసిస్టెంట్ అండర్‌సెక్రటరీ సఫేయా అల్ సఫీ మాట్లాడుతూ.. మార్కెట్లలో వాణిజ్య మోసాలు, నకిలీ వస్తువుల విక్రయంపై యూఏఈ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని స్పష్టం చేశారు.
మార్కెట్ పర్యవేక్షణకు ఏఐ
మార్కెట్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, ఉల్లంఘనలను గుర్తించేందుకు అధికారులు ఇప్పుడు ఏఐ సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ వాణిజ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ సోర్స్‌లు, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లను ఇంటెలిజెన్స్ వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో కూడా యూఏఈ అధికారులు సమన్వయాన్ని బలోపేతం చేశారు. ఆన్లైన్లో నకిలీ లేదా నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తులు గుర్తిస్తే వాటిని ఉపసంహరించడంతో పాటు వినియోగదారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసే చర్యలు తీసుకుంటున్నారు.
రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి అవకాశం
కొత్త చట్టం ప్రకారం కొన్ని ఉల్లంఘనలకు సంబంధించి పూర్తి శిక్షా ప్రక్రియకు వెళ్లకుండా రాజీ (Conciliation) ద్వారా పరిష్కారం పొందే అవకాశాన్ని కూడా వ్యాపారులకు కల్పించారు. ఉల్లంఘన, జరిమానా వివరాలు అందిన తర్వాత లేదా తమ అభ్యంతరం తిరస్కరించబడిన తర్వాత 10 పని దినాల్లోపు వ్యాపారి లేదా అతని ప్రతినిధి రాజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుపై మంత్రిత్వ శాఖ లేదా స్థానిక అధికారం 15 పని దినాల్లో నిర్ణయం తీసుకోవాలి. ఈ గడువులో స్పందన రాకపోతే దరఖాస్తు తిరస్కరించబడినట్లుగా పరిగణిస్తారు.
రాజీకి అర్హత పొందేందుకు గత 12 నెలల్లో వాణిజ్య మోసాల నిరోధక చట్టం కింద శిక్ష పొందకుండా ఉండటం, ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటు లేదా నిర్లక్ష్యం వల్ల ఉల్లంఘన జరగడం, లోపాన్ని సరిదిద్దడం వంటి నిబంధనలను పాటించాలి.
రాజీ ద్వారా వ్యవహారం పరిష్కరించుకున్నప్పటికీ, అది ఉల్లంఘనగా నమోదవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, నకిలీ వస్తువుల వల్ల నష్టం జరిగితే బాధితులు నష్టపరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు కొనసాగుతుందని తెలిపారు.
వినియోగదారుల రక్షణ, మార్కెట్‌పై నమ్మకం పెంపు, పారదర్శక వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడమే కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యమని యూఏఈ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







