ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్‌లో ఒమన్‌ సాంస్కృతిక వైభవం..!!

- September 09, 2026 , by Maagulf
ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్‌లో ఒమన్‌ సాంస్కృతిక వైభవం..!!

ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో జరుగుతున్న ఎంబసీ ఫెస్టివల్‌లో ఒమన్ తన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా ప్రదర్శించింది. నెదర్లాండ్స్‌లోని ఒమన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఒమన్‌, నెదర్లాండ్స్‌ మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఫెస్టివల్‌ ప్రారంభంలో ఒమన్‌ రాయబార కార్యాలయం మిషన్‌ అధిపతి నివాసంలో ప్రత్యేక సాంస్కృతిక సాయంత్రాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు రాయబారులు, ప్రభుత్వ అధికారులు, డచ్‌ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

నెదర్లాండ్స్‌లో ఒమన్‌ రాయబారి షేక్ డాక్టర్ అబ్దుల్లా బిన్ సలీమ్ అల్ హార్తీ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఒమన్‌, నెదర్లాండ్స్‌ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను ఆయన ప్రస్తావించారు. శాంతి, పరస్పర సంబంధాలు, స్నేహం వంటి విలువలను ప్రోత్సహించడమే ఈ సమావేశం లక్ష్యమని తెలిపారు.

ఒమన్‌ పోయెంట్రీ, జానపద కళల ప్రదర్శన

ఫెస్టివల్‌లో భాగంగా ఒమనీ కవిత్వం, జానపద సంగీతం, సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు. ఒమన్‌ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక పెవిలియన్‌ సందర్శకులను ఆకట్టుకుంది. ఈ పెవిలియన్‌ను సుమారు70,000 మంది సందర్శించినట్లు అధికారులు తెలిపారు.

ఇకఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ది హేగ్‌ మేయర్‌ జాన్ వాన్ జానెన్, ఒమన్‌ పెవిలియన్‌ను సందర్శించారు. ఫెస్టివల్‌లో ఒమన్‌ పాల్గొనడాన్ని ఆయన ప్రశంసించారు. గొప్ప చరిత్ర, ప్రత్యేకమైన విలువలు కలిగిన ఒమన్‌ సంస్కృతి ఈ వార్షిక వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని పేర్కొన్నారు.

ది హేగ్‌ మున్సిపల్‌ థియేటర్‌లో కూడా సంప్రదాయ ఒమనీ కళలు, జానపద ప్రదర్శనలు నిర్వహించారు. వీటిని వేలాది మంది సందర్శకులు వీక్షించారు. అనంతరం ఒమన్‌ రాయబార కార్యాలయం ఆమ్‌స్టర్‌డామ్‌లోని డ్యామ్‌ స్క్వేర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ ఒమనీ బృందం జానపద సంగీత ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు ఆధునిక కళా చిత్రాలను ప్రదర్శించింది.

ఈ కార్యక్రమాల ద్వారా ఒమన్‌ తన సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపై పరిచయం చేయడంతో పాటు నెదర్లాండ్స్‌తో సాంస్కృతిక, స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com