యూఏఈ స్కూళ్లలో స్కాలర్‌షిప్‌లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- September 09, 2026
దుబాయ్: యూఏఈలో పెరుగుతున్న స్కూల్ ఫీజుల భారాన్ని తగ్గించుకునేందుకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాఠశాలలు విద్యార్థుల ట్యూషన్ ఫీజులో 50 శాతం వరకు రాయితీ అందిస్తున్నాయి. అయితే స్కాలర్‌షిప్ పొందాలంటే అత్యధిక మార్కులు సాధించడం ఒక్కటే ప్రమాణం కాదని పాఠశాలలు స్పష్టం చేస్తున్నాయి.
2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో.. విద్యార్థులు ఒక తరగతి నుంచి మరో కీలక దశకు మారే సమయంలో స్కాలర్‌షిప్ అవకాశాలను పాఠశాలలు అందిస్తున్నాయి. విద్యతో పాటు స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
25 నుంచి 50 శాతం వరకు ఫీజు రాయితీ
ఆర్కాడియా బ్రిటిష్ స్కూల్ లో 7, 10, 12లో చేరే విద్యార్థులకు ప్రధానంగా పాక్షిక ఫీజు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. ఆ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ గేయిల్స్ ప్రూట్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారికి మరింత అభివృద్ధి చెందే అవకాశాలు కల్పించడమే స్కాలర్‌షిప్‌ల ఉద్దేశమని తెలిపారు.
అకడమిక్ ఎక్సలెన్స్, స్పోర్టింగ్ ఎక్సలెన్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎక్సలెన్స్ వంటి విభాగాల్లో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. కేవలం అత్యధిక పరీక్ష మార్కులు సాధించిన విద్యార్థులకే స్కాలర్‌షిప్‌లు పరిమితం కావని స్పష్టం చేశారు. 7, 10 ఇయర్ విద్యార్థులకు 25 శాతం వరకు, ఎంపిక చేసిన అత్యుత్తమ 12 ఇయర్ విద్యార్థులకు 50 శాతం వరకు ఫీజు రాయితీ లభించవచ్చు.
క్రీడల విభాగంలో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వివిధ స్థాయిల్లో ప్రతినిధిగా పాల్గొన్న అనుభవం, బహుళ క్రీడల్లో ప్రతిభను చూపాల్సి ఉంటుంది. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ విభాగంలో సంగీతం, నృత్యం, డ్రామాలో ప్రతిభను అంచనా వేస్తారు.
మార్కులతో పాటు వ్యక్తిత్వానికీ ప్రాధాన్యం
యూఏఈ స్కూళ్లలో స్కాలర్‌షిప్ ఎంపిక ప్రక్రియ క్రమంగా మారుతోంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా.. పాఠశాల సమాజానికి విద్యార్థి చేసే సానుకూల సహకారం, నాయకత్వ లక్షణాలు, దయ, నిజాయితీ, పట్టుదల, లక్ష్యసాధన వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
రెజెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఎంపిక చేసిన తరగతుల్లో మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. విద్య, స్పోర్ట్స్, మ్యూజిక్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నాయకత్వం వంటి విభాగాల్లో ప్రతిభను గుర్తిస్తున్నట్లు స్కూల్ ప్రిన్సిపల్ డేవిడ్ విలియమ్స్ తెలిపారు.
ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులతో పాటు కొత్తగా స్కూల్‌లో చేరాలనుకునే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్కాలర్‌షిప్ మొత్తం సాధారణంగా ట్యూషన్ ఫీజుకే వర్తిస్తుందన్నారు. రవాణా, యూనిఫాం, పరీక్ష ఫీజులు, అదనపు కార్యకలాపాల ఖర్చులు సాధారణంగా ఇందులో ఉండవని పేర్కొన్నారు.
GEMS స్కూళ్లలోనూ స్కాలర్‌షిప్‌లు
GEMS ఎడ్యుకేషన్ లో ప్రస్తుత విద్యార్థులతో పాటు కొత్తగా చేరాలనుకునే విద్యార్థులకు కూడా వివిధ స్కాలర్‌షిప్ కార్యక్రమాలు ఉన్నాయి. GEMS గ్రూప్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లిసా క్రాస్బీ ఒబే మాట్లాడుతూ.. వివిధ జాతీయతలకు చెందిన విద్యార్థులకు అందుబాటులో ఉండే కార్యక్రమాలతో పాటు ఎమిరాటీ విద్యార్థులు, ప్రత్యేక పాఠశాలలకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు కూడా ఉన్నాయని తెలిపారు.
కాగా, GEMS జీనియస్ స్కాలర్షిప్ అన్ని జాతీయతలకు చెందిన అర్హత ఉన్న విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. 2027 విద్యా సంవత్సరానికి ఇయర్ 10/Grade 9, 12/Grade 11లో చేరే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. దరఖాస్తులు అక్టోబర్ 2026లో ప్రారంభం కానున్నాయి. ఎంపికైన వారికి రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్ అందుతుంది.
రగ్బీ స్కూల్ దుబాయ్ లో 10 శాతం వరకు
రగ్బీ స్కూల్ దుబాయ్ లో 2027 ఆగస్టులో 7, 8, 9, 10, 12 ఇయర్స్ లో చేరే విద్యార్థులకు సాధారణంగా వార్షిక ట్యూషన్ ఫీజులో 10 శాతం వరకు స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులకు మెంటరింగ్, అదనపు అభ్యాస కార్యక్రమాలు, నాయకత్వ అవకాశాలు, స్కూల్ తరఫున వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తారు. ఎమిరాతీ విద్యార్థులకు ప్రత్యేకంగా రువాద్ అల్ ఎమారత్ స్కాలర్షిప్ కూడా ఉంది. ఇది 4 నుంచి 13 ఇయర్స్ వరకు 50 శాతం ఫీజును కవర్ చేస్తుంది.
కొత్త స్కూళ్లలోనూ అవకాశాలు
దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఇటీవల ప్రారంభమైన క్వీన్ ఎలిజబెత్ స్కూల్ లో స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ కూడా కేవలం విద్యా ప్రతిభకే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వం, సామర్థ్యాలు, పాఠశాల అభివృద్ధికి వారు అందించే సహకారం వంటి అంశాలను పరిశీలించనున్నారు. స్కూల్ అధికారులు 5 నుంచి 9 ఇయర్స్ వరకు స్కాలర్‌షిప్‌లను అందించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 9వ తరగతి 2027 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది.
మొత్తంగా.. యూఏఈలో స్కాలర్‌షిప్ కోసం అత్యధిక మార్కులు మాత్రమే కాకుండా స్పోర్ట్స్, ఆర్ట్స్, నాయకత్వం, వ్యక్తిత్వం వంటి విభాగాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయని విద్యారంగా నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్‌షిప్‌లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







