ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా: హీరో నాని

- September 11, 2026 , by Maagulf
ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా: హీరో నాని

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీ అందరినీ కలిసి చాలా రోజులవుతుంది. ఎప్పుడూ నా కెరీర్‌లో ఒక సినిమాకి మరో సినిమాకి ఇంత గ్యాప్ రాలేదు. ఈ ప్రెస్ మీట్‌కి వస్తూ ఉంటే నా ఫస్ట్ సినిమాకి ఎంత నెర్వస్‌గా ఉన్నానో అంతే నెర్వస్‌గా ఉన్నానని అనిపించింది. మైక్‌లో మాట్లాడడం అలవాటు తప్పింది. ఫైనల్‌గా సెప్టెంబర్ 24న వస్తున్నాం. మొదటి సినిమాకి చాలా గొప్ప సపోర్ట్ ఉంది. ఇదే సపోర్ట్ కొనసాగుతుందని నమ్ముతున్నాను. ఆయా షేర్, ఏష నాగుల కట్ట, గ్లింప్స్, టీజర్.. సినిమా నుంచి ఏ కంటెంట్ ఇచ్చినా సరే అన్నిటికీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మీరు సినిమాని అంతగా సొంతం చేసుకున్నట్టు చూస్తుంటే మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఈ సినిమాకి ఒక డెస్టినీ ఉంది అనే బలమైన నమ్మకం వచ్చింది. సెప్టెంబర్ 24న ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నాం. మా టార్గెట్ ఒకటే. మీరందరూ చాలా అంచనాలతో థియేటర్‌కి వస్తారని తెలుసు. మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక అడ్రినలిన్ పంపింగ్, హై ఇచ్చి ఇంటికి పంపించాలనేది మా తపన. మేమందరం దానికోసం కష్టపడుతున్నాం.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా మొదలైనప్పటి నుంచి మీడియా వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సినిమా నుంచి ఏది వచ్చినా సరే ఆడియన్స్‌లో బ్లాస్ట్ అవుతుంది. సాంగ్స్, టీజర్‌ను చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. నా ‘సినిమా’ అనేకంటే ‘జనం సినిమా’ అనడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అంతలా ఈ కంటెంట్‌ను ఆదరించారు. ఇది రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం. ఒక తల్లి, కొడుకుల కథ. ఒక సవారీ జాతి కథ. “పుట్టుక మనది, చావు మనది, బతుకంతా దేశానిది” అని కాళోజీ గారి మాట ఉంటుంది. ఆ దేశం కోసం కొట్లాడిన వారిని ఆ దేశంతోనే సంబంధం లేదు అంటే.. వాళ్లందరూ ఏం చేయాలో తెలియక, మరుగునపడ్డ జాతి కథ. ‘ది ప్యారడైజ్’ కథ ఏమిటో అవగాహన కోసం ఇది చెప్తున్నాను. ఇంత సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్యూ.

అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాని & టీమ్ సమాధానాలు ఇచ్చారు.

శ్రీకాంత్ .. ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ పదాలు ఉన్నాయి కదా.. సెన్సార్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు?
ఇందులో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ చూపిస్తే అందరూ కన్విన్స్ అవుతారు.

నాని..మీ జడల బరువు గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దాని గురించి చెప్పండి?
సోషల్ మీడియాలో సినిమా గురించి రకరకాల వార్తలు ఉన్నాయి. ఇందులో అండర్ వాటర్ సీక్వెన్స్ లేదు. అలాగే వెయ్యి మందితో ఫైట్ కూడా లేదు. ఇది ఒక జెన్యూన్ కథ. చాలా యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. మంచి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి. వైలెన్స్‌లో ఉన్న ఎమోషన్‌ని ఆడియన్స్ ఫీల్ అవుతారు.

-జడల గురించి చెప్పాలంటే మా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఏదో ఫ్లోలో చెప్పినట్టుగా ఉన్నారు. జడలతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ హెయిర్‌కి అటాచ్ చేస్తాం. అప్పుడు సహజంగానే బరువు ఉంటుంది. అది యాక్షన్ సన్నివేశాల్లో రోప్‌కి తాకి అందులో ఇరుక్కుపోయేవి. అవన్నీ మా టీమ్ వాళ్లకి చెప్పినట్టుగా ఉన్నారు. వాళ్లు ఏదో ఫ్లోలో ఆ మాట చెప్పారు. ఈ సినిమాలో జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.

నాని..ఈ సినిమాలో మీరు ఎప్పుడూ లేనంతగా డ్యాన్స్ వేశారు కదా? దాని గురించి చెప్పండి?
‘ఆయా షేర్’లో ఫ్లోర్ మూమెంట్ కోసం చాలా కష్టపడ్డాను. ఇంతకుముందు నేను ఎప్పుడూ డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. నా సినిమాల్లో డాన్సింగ్ సాంగ్స్ ఎక్కువ ఉండవు. అన్నీ సిచువేషన్ సాంగ్స్. ఇందులో రెండు డాన్స్ నంబర్స్‌కి ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.

పాటల విషయంలో శ్రీకాంత్‌కి చాలా మంచి టేస్ట్ ఉంది. సెలబ్రేట్ చేసుకునే పాటలు తీసుకోవడంలో తనది చాలా మంచి అభిరుచి ఉంది. ఈ రెండు పాటలు కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని చేయించాడు.

సుధాకర్ గారు.. ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువైందని విన్నాము?
ఎక్కువైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. (నవ్వుతూ)

నాని.. సినిమాకి చాలా అద్భుతమైన బజ్ ఉంది కదా.. మిగతా భాషల్లో ‘ప్యారడైజ్’ టార్గెట్ ఏమిటి? ఈ సినిమాకి ట్రైలర్ ఉండదని విన్నాము?
‘ప్యారడైజ్’ తెలుగు సినిమా. ఇంతకుముందు చేసినట్టుగా అన్ని భాషల్లో సినిమాని అవైలబుల్‌గా పెట్టాలి. అలాగే ‘ప్యారడైజ్’ తెలుగు ఆడియన్స్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందో, మిగతా ఆడియన్స్‌కి కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా చేశాం. ‘ప్యారడైజ్’ శ్రీకాంత్ విజన్‌తో పెద్ద స్కేల్‌లో థియేటర్‌లోకి వస్తుంది.

సినిమాకి చాలా బజ్ ఉంది కదా అని ట్రైలర్ లేకపోవడం కాదు. సినిమా గురించి చాలా టీమ్స్ పనిచేస్తున్నాయి.ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. అలాంటి ట్రైలర్ కావాలంటే నాలుగు రోజులు అన్ని పనులు పక్కనపెట్టి శ్రీకాంత్, అనిరుధ్, అందరూ ట్రైలర్ మీద పనిచేయాలి. తప్పనిసరి పరిస్థితిలో టీమ్ అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ‘ప్యారడైజ్’కి ట్రైలర్ ఉండదు.

సుధాకర్.. టికెట్స్ హైక్స్, ప్రీమియర్స్ ఉంటాయా?
ప్రీమియర్స్ ఉంటాయండి. హైక్స్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాలి.

నాని.. శ్రీకాంత్ మొండితనం వల్లే ఈ సినిమా ఆలస్యం అయిందని భావిస్తున్నారా?
కచ్చితంగా. అతను మొండివాడు. కాకపోతే తన మొండితనానికి కూడా ఒక పర్పస్ ఉంది. తనకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజన్‌ని స్క్రీన్‌పైకి తీసుకురావడానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. తన మొండితనం మంచికే.

ఈ సినిమాలో చాలా హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. సహజంగానే ఇలాంటివి చేస్తున్నప్పుడు గాయాలు అవుతాయి. ఈ సినిమాలో నాకే కాదు, మా గ్యాంగ్‌లో చేసిన అందరికీ కూడా దెబ్బలు తగిలాయి. ఈ సినిమా మీరు థియేటర్‌లో చూస్తున్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అందరూ ప్రాణం పెట్టి చేశారు.

నాని.. యూఎస్ కాన్సర్ట్‌లో ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపించింది?
ఆ యుఫోరియా అనిరుధ్ వల్ల సాధ్యపడింది. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ‘ఆయా షేర్’ పాటకి వచ్చిన ఎనర్జీ అన్‌బిలీవబుల్.

నాని.. మోహన్ బాబుతో పని చేయడం ఎలా అనిపించింది?
మోహన్ బాబు గారు అద్భుతమైన వ్యక్తి. మా మీద ఎంతో ప్రేమ చూపించారు. మోహన్ బాబు గారితో కలిసి పనిచేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం.

నాని.. ఈ సినిమాలో మీరు డబ్బింగ్ కోసం చాలా కష్టపడినట్టుగా అనిపించింది? ట్రైలర్‌లో డైలాగ్స్ చాలా అగ్రెసివ్‌గా చెప్పారు కదా?
ఈ క్యారెక్టర్‌కి అలానే మాట్లాడాలి. గొంతు చించుకుని అరుస్తున్న ఒక సీన్ ఉంటుంది. అందరికీ ఆ మాటలు అర్థం కావాలని లెక్కలేసుకుంటే ఆ పాత్ర కనిపించదు. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీరు ఇంకొకసారి వినాల్సిన అవసరం లేదు. తన ఎమోషన్‌లో ఉన్న ప్రతి పదం మీకు కనెక్ట్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆ డబ్బింగ్ చెప్పిన తర్వాత నా గొంతు పోయింది. నా కెరీర్‌లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ‘ప్యారడైజ్’. చాలా మనసుపెట్టి చేశాను.

శ్రీకాంత్.. రన్ టైమ్ ఎంత?
రెండు గంటల 49 నిమిషాలు. అదే ఫైనల్ కట్.
నాని.. సినిమాలో కాకులకు సంబంధించిన ఒక ఎపిసోడ్ చాలా హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు?
ఒక్క ఎపిసోడ్ కాదు. సినిమా మొత్తం హైలెట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్ విషయంలో ప్రతి విషయంలో శ్రీకాంత్ పేరు తీసుకున్నాడు. తనకు ఏం కావాలో పర్ఫెక్ట్‌గా తీసుకున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com