చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- November 02, 2026
బీజింగ్: ఒమన్, చైనా దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమక్షంలో ఒక కీలక ఒప్పందం, 14 అవగాహన ఒప్పందాలు (MoUs), ఒక సహకార ప్రోటోకాల్‌పై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. చైనాలో సుల్తాన్ హైతమ్ అధికారిక పర్యటన సందర్భంగా బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందం స్థానిక కరెన్సీ మార్పిడికి (కరెన్సీ స్వాప్) సంబంధించినది. ఒమన్ సెంట్రల్ బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఆర్థిక సహకారం, ఆర్థిక స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఏఐ, డిజిటల్ ఎకానమీ, అంతరిక్ష రంగాల్లో సహకారం
14 అవగాహన ఒప్పందాల్లో ప్రధానంగా గ్రీన్ డెవలప్మెంట్, పెట్టుబడులు, మీడియా, వార్తా సమాచార మార్పిడి, సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలు, డేటా, డిజిటల్ ఎకానమీ, కృత్రిమ మేధస్సు (AI), అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ సాంకేతికత వంటి అంశాలు ఉన్నాయి. చైనాకు చెందిన బీడౌ (BeiDou) ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ వినియోగం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలు (CBDC), పారిశ్రామిక పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు, మార్కెట్లో పోటీ పరిరక్షణ, గుత్తాధిపత్య వ్యతిరేక చర్యలు, అటవీ విస్తరణ, సహజ రక్షిత ప్రాంతాల నిర్వహణ, చారిత్రక పత్రాల భద్రత, ఆర్కైవ్స్ నిర్వహణ వంటి రంగాల్లోనూ పరస్పర సహకారానికి అంగీకరించాయి. ఇక చైనాకు ఎగుమతి చేసే ఎండిన ఖర్జూరాల (Dates) నాణ్యత తనిఖీ, క్వారంటైన్, ఆరోగ్య ప్రమాణాలకు సంబంధించి ప్రత్యేక సహకార ప్రోటోకాల్‌పై కూడా సంతకాలు జరిగాయి.
డిజిటల్ రంగంలో ఒమన్‌కు కొత్త అవకాశాలు
ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఇంజినీర్ సయీద్ బిన్ హమూద్ అల్ మావాలి మాట్లాడుతూ.. చైనాతో కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక రంగాల్లో నాలుగు అవగాహన ఒప్పందాలు కుదరడం కీలక పరిణామమని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష సాంకేతికత, బీడౌ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ, డేటా, డిజిటల్ ఎకానమీ రంగాల్లో ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయని చెప్పారు. చైనాలో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒమన్‌కు తీసుకురావడంతో పాటు స్థానిక నిపుణులకు శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, స్టార్టప్ సంస్థలకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు. చైనా కంపెనీలు మధ్యప్రాచ్య, ఆఫ్రికా మార్కెట్లలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఒమన్‌ను ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకోవాలని ఆయన ఆహ్వానించారు.
2025లో RO9.6 బిలియన్ల వాణిజ్యం
ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ మంత్రి అన్వర్ బిన్ హిలాల్ అల్ జబ్రీ మాట్లాడుతూ.. చైనాతో వాణిజ్య సంబంధాలు మరింత విస్తరిస్తున్నాయని తెలిపారు. 2025లో ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీల విలువ సుమారు RO9.6 బిలియన్లకు చేరిందని వెల్లడించారు. ఇందులో చైనాకు ఒమన్ చేసిన ఎగుమతులు RO7.7 బిలియన్లు కాగా, చైనా నుంచి దిగుమతులు RO1.9 బిలియన్లుగా నమోదయ్యాయి. ఒమన్ మొత్తం విదేశీ వాణిజ్యంలో చైనా వాటా 23.8 శాతంగా ఉందని, తద్వారా చైనా ఒమన్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిందని తెలిపారు. పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు, సరఫరా వ్యవస్థల అభివృద్ధి, ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా ఒమన్ ఆర్థిక మండళ్లు, ఫ్రీజోన్లు, ఓడరేవులను మరింత సమర్థంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. చైనా పెట్టుబడులతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు పెరుగుతాయని వివరించారు.
కరెన్సీ స్వాప్, డిజిటల్ కరెన్సీపై ప్రత్యేక దృష్టి
ఒమన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అహ్మద్ బిన్ జాఫర్ అల్ ముసలామీ మాట్లాడుతూ.. చైనాతో స్థానిక కరెన్సీ స్వాప్ ఒప్పందం ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తుందని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల (CBDC) రంగంలో చైనాకు విస్తృత అనుభవం ఉందని, ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పర్యావరణం, చారిత్రక పత్రాల పరిరక్షణకు సహకారం
ఒమన్ రాయబారి అన్వర్ బిన్ అహ్మద్ ముకాబిల్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల అభివృద్ధిలోనూ చైనాతో సహకారం పెరుగుతుందని తెలిపారు. అటవీ విస్తరణ, ఇసుక దిబ్బల స్థిరీకరణ, భూముల పునరుద్ధరణ, సహజ రక్షిత ప్రాంతాల నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ వంటి అంశాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు. అలాగే ఒమన్, చైనా జాతీయ ఆర్కైవ్స్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా చారిత్రక పత్రాల మార్పిడి, డిజిటల్ భద్రత, దీర్ఘకాలిక రికార్డుల నిర్వహణ, పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కలుగుతుందని వివరించారు.
ఈ ఒప్పందాలు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వైవిధ్యీకరణ, సాంకేతిక అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని ఇరు దేశాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- హార్ముజ్ జలసంధి తెరవడం పై ఇరాన్ కీలక ప్రకటన
- మస్కట్‌లో దీపావళి సందడి..!
- డిసెంబర్ చమురు ఉత్పత్తి కోటా పై OPEC+ కీలక నిర్ణయం..!!
- ఎల్ఎన్జీ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







