దోహా ఎయిర్‌పోర్టులో ‘ఫాస్ట్ పాస్’.. అర్హత? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- September 15, 2026
దోహా: దోహా నుంచి విమాన ప్రయాణం చేసే ప్రయాణికులకు హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (HIA)లో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ‘ఫాస్ట్ పాస్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫేషియల్ రికగ్నిషన్ సేవ ద్వారా అర్హత కలిగిన ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులు విమానాశ్రయంలోని కొన్ని ప్రాంతాల్లో పదేపదే పాస్‌పోర్ట్, ఇతర ప్రయాణ పత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండా ఫేస్ రికగ్నిషన్ తో ముందుకు వెళ్లవచ్చు. ఖతార్ ఎయిర్వేస్ సమన్వయంతో ఈ ఐచ్ఛిక సేవను ప్రారంభించారు. ప్రయాణికుడి ఫేస్ రికగ్నిషన్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా గుర్తించి సేవలను అందిస్తారు.
ఫాస్ట్ పాస్ అంటే ఏమిటి?
ఫాస్ట్ పాస్ అనేది ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత బయోమెట్రిక్ సేవ. రిజిస్టర్ అయిన ప్రయాణికుడి ముఖాన్ని గుర్తించడం ద్వారా ఎంపిక చేసిన ఎయిర్పోర్ట్ టచ్పాయింట్ల వద్ద ప్రతిసారీ ప్రయాణ పత్రాలు చూపించాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
ఎవరెవరు ఉపయోగించవచ్చు?
ప్రస్తుతం ఈ సేవ అర్హత కలిగిన విమానాల్లో ప్రయాణించే ఖతార్ ఎయిర్వేస్ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంది.ప్రయాణికుడి వయసు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ ఉండాలి. ప్రయాణం దోహా నుంచి ప్రారంభం కావాలి. ఫాస్ట్ పాస్‌లో రిజిస్టర్ కావడం తప్పనిసరి కాదు. సేవను ఉపయోగించకూడదనుకునే వారు సాధారణ ఎయిర్పోర్ట్ ప్రక్రియను కొనసాగించవచ్చు. ప్రస్తుతం వైకల్యం ఉన్న ప్రయాణికులకు ఈ సేవ అందుబాటులో లేదు. భవిష్యత్తులో వారికి కూడా ఈ సౌకర్యాన్ని అందించే ప్రణాళికలు ఉన్నాయని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
ప్రయాణికులు రెండు విధాలుగా ఫాస్ట్ పాస్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఖతార్ ఎయిర్వేస్ యాప్ ద్వారా లేదా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ల ద్వారా చేసుకోవచ్చు. కియోస్క్ ద్వారా రిజిస్టర్ చేసుకునే వారు రో 3 సమీపంలోని కియోస్క్‌లో ప్రతి ప్రయాణానికి విడిగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
ఖతార్ ఎయిర్వేస్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే మాత్రం ఇది ఒక్కసారి చేసే ప్రక్రియ. భవిష్యత్తులో అర్హత ఉన్న ప్రయాణాల్లో ప్రతిసారీ మళ్లీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిగత, బయోమెట్రిక్ డేటాను ఎలా ఉపయోగిస్తారో వివరించే ప్రైవసీ నోటీసు ప్రయాణికులకు చూపిస్తారు. వివరాలను సమర్పించే ముందు దాన్ని చదివి అంగీకరించాలని అధికారులు సూచించారు.
ఫాస్ట్ పాస్ ఎక్కడ ఉపయోగించవచ్చు?
ఫాస్ట్ పాస్ విజయవంతంగా యాక్టివేట్ అయిన ప్రయాణికులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీన్ని ఉపయోగించవచ్చు. రో 3లోని సెల్ఫ్ సర్వీస్ బ్యాగ్ డ్రాప్‌లు, సెక్యూరిటీ గేట్లు 9, 10, కాన్కోర్స్ A, B, C, D, Eలోని బోర్డింగ్ గేట్ల వద్ద ఉపయోగిచుకోవచ్చు.
పాస్‌పోర్ట్ వెంట తీసుకెళ్లాలా?
అవును. పాస్‌పోర్ట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఫాస్ట్ పాస్ యాక్టివేట్ చేసినప్పటికీ ఇమిగ్రేషన్, ఈ-గేట్ల వద్ద పాస్‌పోర్ట్ అవసరం కావచ్చు. అలాగే బయోమెట్రిక్ కెమెరా ప్రయాణికుడిని గుర్తించలేకపోయినా పాస్‌పోర్ట్ లేదా బోర్డింగ్ పాస్ అవసరం కావచ్చు. ఫేషియల్ రికగ్నిషన్ విఫలమైతే మాస్క్, కళ్లద్దాలు వంటి వస్తువులను కొద్దిసేపు తొలగించమని అడగవచ్చు. అయినప్పటికీ గుర్తింపు సాధ్యం కాకపోతే బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి సాధారణ ప్రక్రియలో కొనసాగాల్సి ఉంటుంది.
ఇతరుల ముఖ డేటా కూడా కెమెరాల్లో రికార్డ్ అవుతుందా?
HIA ప్రకారం, ఫాస్ట్ పాస్ కోసం నిర్దేశించిన చెక్పాయింట్లలోని బయోమెట్రిక్ కెమెరాలు ఫాస్ట్ పాస్‌కు రిజిస్టర్ అయిన ప్రయాణికులను మాత్రమే గుర్తించేలా పనిచేస్తాయి. రిజిస్టర్ కాని వ్యక్తులను గుర్తించదు. అనుకోకుండా వారి బయోమెట్రిక్ సమాచారం కెమెరాలో నమోదైనా.. అది వెంటనే తొలగించబడుతుంది.
ప్రయాణికుల డేటా ఎంతకాలం ఉంటుంది?
ఎయిర్పోర్ట్ కియోస్క్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న ప్రయాణికుల వ్యక్తిగత, బయోమెట్రిక్ డేటాను ఆ ఒక్క ప్రయాణానికి మాత్రమే ఉపయోగిస్తారు. విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత ఆ డేటాను తొలగిస్తారు. ఖతార్ ఎయిర్వేస్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకునే వారి వ్యక్తిగత డేటా ప్రయాణికుడి పరికరంలోనే నిల్వ ఉంటుంది. ఫాస్ట్ పాస్‌ను ఆ ప్రయాణానికి యాక్టివేట్ చేసినప్పుడు అవసరమైన డేటాను ఎయిర్‌పోర్ట్‌తో పంచుకుంటారు.
యాప్‌లో భద్రంగా అందుబాటులో ఉండే ఈ డేటాను ప్రయాణికులు తమ పరికరం నుంచి **యాప్ సెట్టింగ్స్ ద్వారా ఎప్పుడైనా తొలగించుకోవచ్చు. ప్రయాణికుల గోప్యత, డేటా రక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగానే ఫాస్ట్ పాస్ సేవను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ దక్షిణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఎత్తివేత..!!
- డిసెంబర్ 10 నుంచి రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!
- దోహా ఎయిర్‌పోర్టులో ‘ఫాస్ట్ పాస్’.. అర్హత? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- ఒమన్‌లో అధిక బరువు లేదా ఊబకాయం డేంజర్ బెల్స్..!!
- ఏడు ఎమిరేట్లను కలుపుతూ యూఏఈ గ్రాండ్ టూర్..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో 5 నిమిషాల్లో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..!!
- బహ్రెయిన్‌లో ఆరు డ్రగ్స్ కేసులు.. 10 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో 500 కిలోల పాడైన చేపలు సీజ్.. 16 మంది అరెస్ట్..!!
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్







