భక్తుల కోసం కొత్త AI యాప్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

- September 15, 2026 , by Maagulf
భక్తుల కోసం కొత్త AI యాప్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుపతి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరుస సెలవుల కారణంగా పెరిగిన భక్తుల రద్దీ ప్రస్తుతం కాస్త తగ్గడంతో స్వామివారి దర్శనం భక్తులకు సులభంగా మారుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది. అయితే బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ వాహన సేవ రోజున తిరుమలకు భక్తుల రాక భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సీఎం చంద్రబాబు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకోనున్నారు.శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. సాయంత్రం 7:40 గంటల ప్రాంతంలో బేడి ఆంజనేయ స్వామివారి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టువస్త్రాలను ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి అందజేస్తారు. దర్శనానంతరం 2027 టీటీడీ క్యాలెండర్లు, డైరీలతో పాటు భక్తుల సౌకర్యార్థం రెండు కొత్త యాప్‌లను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’, రిలయన్స్ ఈవీ బస్సులను ప్రారంభించి, ఎస్వీ మ్యూజియం వీక్షణ అనంతరం టీటీడీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

వసతి సమస్యలకు చెక్.. భక్తుల కోసం కొత్తగా యాప్
తిరుమలకు వచ్చే భక్తులు వసతి గదులు, కాటేజీలలో ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు టీటీడీ ‘నందకం’ అనే నూతన మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FMS), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ యాప్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం తిరుమలలోని 7,043 వసతి గదులను ఈ యాప్‌కు అనుసంధానించారు. గదుల్లో ఎలాంటి సమస్య ఉన్నా భక్తులు ఫొటోలు, వీడియోలు లేదా ఆడియో ద్వారా యాప్‌లో ఫిర్యాదు చేస్తే, కేవలం రెండు గంటల్లోనే సిబ్బంది ఆ సమస్యను పరిష్కరిస్తారు. భక్తులకు ఇచ్చే గదుల రసీదులపైనే ఈ యాప్ క్యూఆర్ (QR) కోడ్‌ను ముద్రించనున్నారు.

10 వేల మందికి వసతి
తిరుమల భక్తుల సౌకర్యార్థం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో ‘శ్రీపాదం’, ‘అచ్యుతం’ పేరుతో రెండు భారీ వసతి సముదాయాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఒక్కో భవనం తొమ్మిది అంతస్తులతో, మొత్తం 1,064 గదులతో రూపుదిద్దుకుంటోంది. వీటి ద్వారా దాదాపు 10,000 మంది భక్తులకు వసతి లభించనుంది.

ఈ భవనాల్లోని రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, ఉచిత వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు, సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయానికి వీటిని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు టీటీడీ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com