దుబాయ్‌లో మరో ఎతిహాద్ రైల్ స్టేషన్.. మెట్రోతో అనుసంధానం
- September 15, 2026
దుబాయ్: దుబాయ్‌లో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలను మరింత విస్తరించే దిశగా కీలక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అలయలాయిస్లో (Al Yalayis) ఒక స్టేషన్ ఉండగా, దుబాయ్‌లో మరో ఎతిహాద్ రైల్ స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) డైరెక్టర్ జనరల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ మట్టర్ అల్ తాయర్ తెలిపారు. అయితే కొత్త స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
ఎతిహాద్ రైల్‌తో పాటు రాబోయే దుబాయ్–అబుదాబి హైస్పీడ్ రైల్ సేవలను దుబాయ్ మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయనున్నట్లు అల్ తాయర్ వెల్లడించారు. రైలు ద్వారా దుబాయ్‌కు చేరుకునే ప్రయాణికులు మెట్రోలోని వివిధ లైన్లను ఉపయోగించి నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా ఈ అనుసంధానం ఉపయోగపడనుంది.
దుబాయ్ రైల్ మాస్టర్ ప్లాన్‌లో వివిధ రవాణా నెట్‌వర్క్‌లను పరస్పరం అనుసంధానించే విధంగా స్పష్టమైన ప్రణాళిక ఉందని అల్ తాయర్ తెలిపారు. ఎతిహాద్ రైల్ స్టేషన్లను మెట్రో మార్గాలతో అనుసంధానం చేయడం ద్వారా నివాస ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు, ఇతర కీలక ప్రాంతాలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని చెప్పారు.
హైస్పీడ్ రైల్‌కు రెండు స్టేషన్లు
దుబాయ్–అబుదాబి మధ్య ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న హైస్పీడ్ రైల్‌కు దుబాయ్‌లో రెండు స్టేషన్లు ఉంటాయని అల్ తాయర్ తెలిపారు. వీటిలో ఒకటి అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద, మరొకటి అల్ జద్దాఫ్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
యూఏఈలోని వివిధ నగరాలను దుబాయ్‌తో అనుసంధానించడంలో ఎతిహాద్ రైల్ కీలక పాత్ర పోషించనుందని అల్ తాయర్ పేర్కొన్నారు. జాతీయ రైల్వే ప్రాజెక్టులకు అనుగుణంగా దుబాయ్ స్థానిక ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు RTA, ఎతిహాద్ రైల్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
రైలు–మెట్రో అనుసంధానం పూర్తయితే ప్రయాణికులు కార్లు, ట్యాక్సీలపై పూర్తిగా ఆధారపడకుండా నగరంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది.
రైల్వే రంగానికి సంబంధించిన RailX Dubai Conference and Exhibition వివరాలను వెల్లడించే విలేకరుల సమావేశంలో అల్ తాయర్ ఈ విషయాలను తెలిపారు. 2027 మే 31 నుంచి జూన్ 2 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఈ సదస్సు, ప్రదర్శన జరగనుంది.
తాజా వార్తలు
- మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!
- అరేబియన్ ట్రావెల్ మార్కెట్ 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్
- UPI ఛార్జీల పై ఈ వారంలో కీలక ప్రకటన!
- తెలంగాణ–ఆగా ఖాన్ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి
- మదీనాలో భారీగా బయటపడ్డ అరుదైన ఖనిజాలు, యురేనియం
- ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్
- దుబాయ్‌లో మరో ఎతిహాద్ రైల్ స్టేషన్.. మెట్రోతో అనుసంధానం
- అక్టోబర్ 14 నుంచి గ్లోబల్ విలేజ్ సీజన్ 31
- భక్తుల కోసం కొత్త AI యాప్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- సౌదీ దక్షిణ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ అలర్ట్‌లు ఎత్తివేత..!!







