తెలంగాణ–ఆగా ఖాన్‌ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి

- September 15, 2026 , by Maagulf
తెలంగాణ–ఆగా ఖాన్‌ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి

-ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ Vతో భేటీలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
-ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ V లోక్ భవన్  ఘన స్వాగతం 

హైదరాబాద్‌: తెలంగాణ–ఆగా ఖాన్‌ అభివృద్ధి సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ Vతో నిర్వహించిన  భేటీలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పేర్కొన్నారు. 

గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను ఇస్మాయిలీ ముస్లింల 50వ వారసత్వ ఇమామ్‌, ఆగా ఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ (AKDN) చైర్మన్‌ హిజ్‌ ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ V సోమవారం లోక్‌భవన్‌ కు వచ్చారు. 

ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్‌, తెలంగాణకు ఆయన చేసిన తొలి అధికారిక పర్యటన సందర్భంగా గవర్నర్‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం లోక్ భవన్ లో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ..హైదరాబాద్‌, తెలంగాణకు ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ V రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దివంగత ఆగా ఖాన్‌ IV సేవలను స్మరించుకున్నారు .  భారతదేశ అభివృద్ధికి, ఆగా ఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ ద్వారా సమాజ సంక్షేమానికి దివంగత ఆగా ఖాన్‌ IV అందించిన సేవలను గవర్నర్‌ కొనియాడారు. 2015లో ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారం లభించిందని, దేశ ప్రజలు ఆయనను ఎంతో గౌరవంగా స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు ఆగా ఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌తో ఉన్న చిరకాల అనుబంధాన్ని గవర్నర్‌ ప్రస్తావించారు. 2024 జూలైలో పునరుద్ధరించిన కుతుబ్‌షాహీ సముదాయాన్ని ప్రారంభించేందుకు ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ V హైదరాబాద్‌కు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పరిసరాల అభివృద్ధిలో ఆగా ఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

తెలంగాణలో ఆగా ఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ చేపడుతున్న బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్‌ ప్రశంసించారు. విద్య, పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన తదితర రంగాల్లో సంస్థ చేస్తున్న కృషి స్థానిక సమాజాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సమీపంలోని ఆగా ఖాన్‌ అకాడమీ ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలతో భవిష్యత్‌ తరాల నాయకులను తీర్చిదిద్దుతున్న సంస్థగా నిలుస్తోందని అన్నారు.

ఆగా ఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ సమాజానికి మేలు చేసే శక్తిగా ఉంది. తెలంగాణ–ఏకేడీఎన్‌ మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలి అని గవర్నర్‌ అన్నారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మానవాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను  ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా తెలంగాణలో పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సంరక్షణ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో ఏకేడీఎన్‌ చేస్తున్న కృషిని ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ V వివరించారు.ఈ కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ–ఏకేడీఎన్‌ మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని భవిష్యత్తులో మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ–ఏకేడీఎన్‌ మధ్య చిరకాల అనుబంధం భవిష్యత్తులో మరింత బలోపేతమై సమ్మిళిత, సుస్థిర, ప్రజాకేంద్రిత అభివృద్ధికి దోహదపడుతుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ కళా వైభవానికి ప్రతీకగా గవర్నర్‌.. గ్రామీణ తెలంగాణ జీవనశైలిని ప్రతిబింబించే చేర్యాల నకాషీ చిత్రాన్ని, హంస ఆకృతితో రూపొందించిన కరీంనగర్‌ వెండి ఫిలిగ్రీ వీణను ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ Vకు అందజేశారు.భేటీ ముగింపులో ప్రిన్స్‌ రహీమ్‌ ఆగా ఖాన్‌ V లోక్‌భవన్‌ సందర్శకుల రిజిస్టర్‌లో తన అభిప్రాయాలను నమోదు చేశారు.తనకు అందించిన ఆత్మీయ స్వాగతానికి, చిరకాల స్నేహం,సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో ఏకేడీఎన్‌ ప్రతినిధి బృందం సభ్యులతో పాటు గవర్నర్‌ సంయుక్త కార్యదర్శి  శశికిరణ్‌ కొమండూర్‌, ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి మాధవ్‌ ఆర్‌.సుల్ఫులే పాల్గొన్నారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com