కువైట్‌లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!

- September 18, 2026 , by Maagulf
కువైట్‌లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!

కువైట్ : మనీలాండరింగ్ (AML), ఉగ్రవాదానికి ఆర్థిక సహకారం (Terrorist Financing) నిరోధక నిబంధనలను సక్రమంగా పాటించలేదన్న కారణంతో కువైట్‌లోని 11 చిన్న, మధ్యతరహా ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్ విధించారు.

కంపెనీలు తమ అంతర్గత వ్యవస్థలు, విధానాలను అప్‌డేట్ చేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆదేశించాయి. ముఖ్యంగా నగదు బదిలీలకు అసలు లబ్ధిదారులు ఎవరో గుర్తించే ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని సూచించాయి. అలాగే సంక్లిష్టమైన, అధిక ప్రమాదం ఉన్న లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్తలతో కస్టమర్ పరిశీలన (Enhanced Due Diligence) చేపట్టాలని ఆదేశించారు.

అనుమానాస్పద నగదు బదిలీలను ముందుగానే గుర్తించేందుకు ఎర్లీ-వార్నింగ్ వ్యవస్థలను మెరుగుపరచాలని నియంత్రణ సంస్థలు సూచించాయి. అంతేకాకుండా ఆస్తుల ఫ్రీజ్‌కు సంబంధించిన ఆదేశాలు జారీ అయిన వ్యక్తులు లేదా సంస్థలకు చెందిన నిధుల విషయంలో ఎలాంటి ఆర్థిక సేవలు అందించకూడదని స్పష్టం చేశారు.

అధిక ప్రమాదం ఉన్న భౌగోళిక ప్రాంతాలు, ఆర్థిక పరిధుల నుంచి కువైట్‌కు వచ్చే, కువైట్ నుంచి వెళ్లే నగదు బదిలీలపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేసే విస్తృత చర్యల్లో భాగంగానే ఈ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహకారం వంటి ఆర్థిక నేరాలను అడ్డుకునేందుకు ఎక్స్ఛేంజ్ కంపెనీలు నిర్దేశిత నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com