ఏషియన్ గేమ్స్‌లో అదరగొట్టిన షూటర్లు.. భారత్‌కు మరో రజతం

- September 21, 2026 , by Maagulf
ఏషియన్ గేమ్స్‌లో అదరగొట్టిన షూటర్లు.. భారత్‌కు మరో రజతం

ఆసియా క్రీడలలో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ మరో పతకాన్ని దేశానికి అందించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో హిమాంశు ధిల్లాన్‌, పార్థ్‌ మానే, రుద్రాంక్ష్‌ పాటిల్‌లతో కూడిన భారత జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతసాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రీడలలో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య మూడుకు చేరింది. విశేషమేమిటంటే, ఈ మూడు పతకాలు కూడా షూటింగ్ విభాగంలోనే రావడం గమనార్హం.

రికార్డు స్కోర్లతో హోరాహోరీ పోరు
క్వాలిఫికేషన్‌లో భాగంగా జరిగిన 60 షాట్ల పోటీలో భారత షూటర్లు అద్భుతమైన మార్కులు సాధించారు. రుద్రాంక్ష్‌ పాటిల్ 631.8 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, హిమాంశు ధిల్లాన్‌ 630 పాయింట్లతో ఏడో స్థానాన్ని, పార్థ్‌ మానే 628.3 పాయింట్లను సాధించారు. ముగ్గురి స్కోర్లు కలిపి మొత్తం 1890.1 పాయింట్లు నమోదు కావడంతో భారత్‌కు రజత పతకం దక్కింది. ఇక ఈ విభాగంలో చైనా 1899.0 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్గ పతకం సాధించగా, దక్షిణ కొరియా 1884.2 పాయింట్లతో కాంస్యం దక్కించుకుంది.

రుద్రాంక్ష్‌ రెండో పతకం.. ఎలవెనిల్‌ వలరివన్‌ అద్భుత ప్రదర్శన
ఆసియా క్రీడలలో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రుద్రాంక్ష్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం. గతంలో జరిగిన హాంగ్‌జౌ క్రీడల్లోనూ అతడు ఇదే విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. తాజా పోటీలలో రుద్రాంక్ష్‌తో పాటు హిమాంశు కూడా వ్యక్తిగత విభాగం ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు, ఆదివారం జరిగిన పోటీలలో భారత మహిళా షూటర్‌ ఎలవెనిల్‌ వలరివన్‌ రెండు రజత పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్ మరియు వ్యక్తిగత విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. ఎలవెనిల్‌కు వ్యక్తిగత విభాగంలో ఆసియా క్రీడల్లో ఇది తొలి పతకం కావడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com