ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!

- September 22, 2026 , by Maagulf
ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!

దోహా: ఆకస్మికంగా గగనతలంలో అంతరాయాలు ఏర్పడినా సమర్థంగా స్పందించేందుకు ఖతార్‌ పౌర విమానయాన వ్యవస్థ 24 గంటలూ సిద్ధంగా ఉంటుందని ఖతార్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ (QCAA) అధికారి మహమ్మద్‌ అబ్దుల్‌కాదర్‌ అల్‌ అస్మాఖ్‌ తెలిపారు. నిరంతర శిక్షణ, అత్యవసర పరిస్థితులపై ముందస్తు ప్రణాళికలు, ప్రభుత్వ సంస్థలు, విమానయాన సంస్థలు, పొరుగు దేశాల మధ్య సమన్వయం దేశ విమానయాన భద్రత వ్యవస్థకు ప్రధాన ఆధారమని పేర్కొన్నారు.  QCAA ఎయిర్‌ నావిగేషన్‌ విభాగంలోని ఏరోనాటికల్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ అధిపతి అల్‌ అస్మాఖ్‌.. అత్యవసర పరిస్థితి వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే నిరంతరం సన్నద్ధంగా ఉండటమే తమ విధానమని వివరించారు.

 ఏడాది పొడవునా శిక్షణ, కసరత్తులు

QCAA ఏడాది పొడవునా వివిధ శిక్షణ కార్యక్రమాలు, అత్యవసర ఎక్సర్ సైజులు నిర్వహిస్తుందని తెలిపారు. FIFA వరల్డ్‌ కప్‌ ఖతార్‌ 2022 సందర్భంగా ప్రారంభించిన ‘వతన్‌’ (Watan) జాతీయ సన్నాహాల్లో కూడా QCAA పాల్గొంటోందని చెప్పారు. ఈ సన్నాహాల్లో వాస్తవ అత్యవసర పరిస్థితులను పోలిన సన్నివేశాలను రూపొందించి అధికారులు ముందుగానే స్పందనా విధానాలను పరీక్షిస్తారు. దీంతో నిజమైన ఘటన ఎదురైనప్పుడు తొలి దశలో కలిగే గందరగోళాన్ని తగ్గించవచ్చని అల్‌ అస్మాఖ్‌ తెలిపారు.

24 గంటలూ విమానాల పర్యవేక్షణ

QCAA ఖతార్‌ గగనతలంతో పాటు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను 24 గంటలూ పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. విమానాల రాకపోకల్లో అసాధారణ పరిస్థితి, సాంకేతిక సమస్య లేదా ఇతర అంతరాయం ఏర్పడినప్పుడు ట్రాఫిక్‌ సజావుగా కొనసాగేందుకు QCAA చర్యలు చేపడుతుంది.

గగనతలం మూసివేయాల్సిన పరిస్థితి లేదా విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాల్సి వస్తే రెండు స్థాయిల్లో స్పందన ఉంటుందని వివరించారు. పరిపాలనా బృందాలు భద్రతా సంస్థలు, విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులు, ఇతర గగనతల వినియోగదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతాయి. మరోవైపు ఆపరేషనల్‌ బృందాలు విమానాల స్థానాలు, విమానాల రద్దీ, అందుబాటులో ఉన్న గగనతలం, సురక్షిత ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తాయని వివరించారు.  అవసరాన్ని బట్టి ఖతార్‌ పొరుగు దేశాలు, ఇతర దేశాలతోనూ సమన్వయం చేస్తామని తెలిపారు.

ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యం

“విమాన ప్రయాణికుల భద్రత, విమాన రాకపోకల భద్రతే మొదటి ప్రమాణం” అని అల్‌ అస్మాఖ్‌ పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా భద్రతకే మొదటి, రెండో, మూడో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.  ఖతార్‌ ప్రపంచంలోని ప్రధాన అంతర్జాతీయ విమానయాన కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com