ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!

- September 22, 2026 , by Maagulf
ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!

మస్కట్‌: నీటి కొరత, భూమిలో ఉప్పు శాతం అధికంగా ఉండటం వంటి సమస్యలకు పరిష్కారంగా గాలి నుంచి నీటిని సేకరించి (Atmospheric Water Harvesting) సౌరశక్తి, గ్రీన్‌హౌస్‌, హైడ్రోపోనిక్‌ వ్యవసాయంతో అనుసంధానించే అవకాశాలపై ఒమన్‌లో పరిశోధన నిర్వహించారు. రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ అథారిటీకి చెందిన స్ట్రాటజిక్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌, వ్యవసాయం–మత్స్య–జల వనరుల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. “Feasibility Study to Extract Water from Air and Utilize it in Salt-Affected Lands” పేరుతో సాగిన ఈ పరిశోధనకు సుల్తాన్‌ ఖాబూస్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ మెరైన్‌ సైన్సెస్‌కు చెందిన డాక్టర్‌ అహ్మద్‌ అల్‌ బుసైదీ నేతృత్వం వహించారు.

రోజుకు 100 లీటర్ల వరకు నీరు

వాతావరణంలోని తేమను నీటిగా మార్చే  అట్మస్ఫియరిక్ వాటర్ హార్వెస్టింగ్ (AWH) టెక్నాలజీని హైడ్రోపోనిక్‌ వ్యవసాయం, సౌరశక్తితో కలిపి ఉపయోగించవచ్చా అనే అంశాన్ని పరిశోధకులు పరిశీలించారు. ఒమన్‌లోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన పరిశోధక బృందం.. దక్షిణ ఒమన్‌లో యెమెన్‌, సౌదీ అరేబియా సరిహద్దులకు సమీపంలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర తీర ప్రాంతాలు, మధ్య ఒమన్‌లోని కొన్ని ప్రాంతాలు గాలి నుంచి నీటిని సేకరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఇక ప్రాంతాన్ని బట్టి సేకరించిన నీటిని వినియోగించే విధానం మారుతుందని పరిశోధకులు తెలిపారు. ఉత్తర తీరంలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించవచ్చని, దక్షిణ ప్రాంతాల్లో వ్యవసాయానికి వినియోగించే అవకాశం ఎక్కువగా ఉందని వివరించారు. మధ్య, మారుమూల ప్రాంతాల్లో తాగునీరు, వ్యవసాయ అవసరాలకు రెండింటికీ ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, మెషినరీ సామర్థ్యాన్ని బట్టి రోజుకు 40 నుంచి 100 లీటర్ల వరకు నీటిని ఉత్పత్తి చేయగలిగినట్లు పరిశోధనలో తేలింది.

సౌరశక్తితో గ్రీన్‌హౌస్‌ ఏర్పాటు

పరిశోధనలో భాగంగా గాలి నుంచి నీటిని సేకరించే యంత్రాలను సౌరశక్తి, హైడ్రోపోనిక్‌ వ్యవసాయ వ్యవస్థతో అనుసంధానించారు. గాలి నుంచి నేరుగా సేకరించిన నీరు, పునరుత్పాదక ఇంధనంతో పంటలను పండించే విధానాన్ని పరీక్షించేందుకు ప్రత్యేక గ్రీన్‌హౌస్‌ను నిర్మించారు. గ్రీన్‌హౌస్‌లో నియంత్రిత పరిస్థితుల్లో పెంచిన పంటలు, బహిరంగ ప్రదేశాల్లో పెంచిన పంటల మధ్య గణనీయమైన తేడాలు కనిపించాయని డాక్టర్‌ అల్‌ బుసైదీ తెలిపారు.

టమాటా మొక్కల పెరుగుదలలో భారీ తేడా

గ్రీన్‌హౌస్‌లో పెంచిన టమాటా మొక్కల్లో సగటు క్లోరోఫిల్‌ స్థాయి 25.5గా ఉండగా, మొక్కల సగటు ఎత్తు 186 సెంటీమీటర్లుగా నమోదైంది. అదే బహిరంగ ప్రదేశాల్లో పెంచిన టమాటా మొక్కల్లో క్లోరోఫిల్‌ స్థాయి 8.23, సగటు ఎత్తు 76.5 సెంటీమీటర్లుగా నమోదైంది. నియంత్రిత గ్రీన్‌హౌస్‌ వాతావరణంలో పెంచిన లెట్యూస్‌ మొక్కల్లోనూ అధిక క్లోరోఫిల్‌ స్థాయితో పాటు పెద్ద ఆకులు అభివృద్ధి చెందినట్లు పరిశోధనలో వెల్లడైంది.

ఏడాది పొడవునా పంటల సాగుకు అవకాశం

ఈ సమీకృత వ్యవస్థ ఆర్థికంగా, పర్యావరణపరంగా ప్రయోజనాలను అందించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. గ్రీన్‌హౌస్‌లలో ఏడాది పొడవునా పంటలను సాగు చేయడం ద్వారా సీజన్‌పై ఆధారపడటం తగ్గుతుందని, రైతులకు మరింత స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సౌరశక్తిని వినియోగించడం ద్వారా సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటం, నిర్వహణ ఖర్చులు తగ్గించవచ్చని తెలిపారు. అదనంగా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉందని వివరించారు.

నీటి కొరతకు చెక్

నీటి కొరత, భూమిలో అధిక ఉప్పుతనం, సాగుకు అనువైన భూమి పరిమితంగా ఉండటం, కఠినమైన వాతావరణ పరిస్థితులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఎడారి ప్రాంతాలకు ఇలాంటి సుస్థిర గ్రీన్‌హౌస్‌ వ్యవస్థలు ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధన పేర్కొంది. అధిక విలువ కలిగిన పంటలను సాగు చేయడం, వ్యవసాయ ఉత్పత్తులను విభిన్నీకరించడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో ఇవి సహాయపడవచ్చని తెలిపింది. అయితే హైడ్రోపోనిక్‌ వ్యవస్థల్లో పోషకాల స్థాయిలు, pHలో మార్పులను సమర్థంగా నిర్వహించడం వంటి అంశాల్లో మరింత అభివృద్ధి అవసరమని పరిశోధకులు గుర్తించారు.

వ్యవసాయంలో AI వినియోగానికి సూచన

నీరు, పోషకాలు, గ్రీన్‌హౌస్‌ వాతావరణ పరిస్థితులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), ఆటోమేషన్‌ టెక్నాలజీల్లో పెట్టుబడులు పెంచాలని డాక్టర్‌ అల్‌ బుసైదీ సూచించారు. AI ఆధారిత సెన్సర్లు, కనెక్టెడ్‌ టెక్నాలజీల ద్వారా పంట అవసరాలకు అనుగుణంగా నీరు, పోషకాలు, ఉష్ణోగ్రత వంటి అంశాలను రియల్‌టైమ్‌లో సర్దుబాటు చేయవచ్చని తెలిపారు. దీనివల్ల వనరుల వృథాను తగ్గించి సామర్థ్యాన్ని పెంచవచ్చని పేర్కొన్నారు.

అలాగే ఔషధ మొక్కలు, అరుదైన పండ్లు వంటి మరిన్ని అధిక విలువ కలిగిన పంటలను సాగులోకి తీసుకురావడం, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను మరింతగా అనుసంధానించడం, రైతులకు సాంకేతిక శిక్షణ, ప్రజల్లో అవగాహన, తగిన ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలు అవసరమని సూచించారు. ఇలాంటి సుస్థిర గ్రీన్‌హౌస్‌లను పరిశోధన, విద్య, ఎకో-టూరిజం కోసం కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com