సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్

- September 23, 2026 , by Maagulf
సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్

రియాద్: సౌదీ అరేబియాలో నివసిస్తున్న తెలుగు ప్రవాసులు దేశంలోనే కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంతంలో అత్యంత చురుకైన, ఉత్సాహభరితమైన ప్రవాస సమూహాల్లో ఒకటని సౌదీ అరేబియాలో భారత రాయబారి విపుల్ అన్నారు.

రియాద్‌లో తెలుగు ప్రవాసుల సంస్థ SATA ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక తెలుగు దినోత్సవం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన అనంతరం ఆయన తెలుగు ఎన్నారై సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

సంస్కృతిని కాపాడుకోవడం అభినందనీయం

విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు ప్రవాసులు తమ సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడంతో పాటు తోటి భారతీయుల పట్ల సామాజిక బాధ్యతను చాటుతున్నారని రాయబారి విపుల్ ప్రశంసించారు.

SATAలో తెలుగు మహిళలు సాధిస్తున్న సాధికారతను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు ప్రవాస సమాజం ఐక్యతతో, సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న తీరు ప్రశంసనీయమన్నారు.

విపుల్ గతంలో ఖతార్, దుబాయ్‌లలో పనిచేశారు. అలాగే న్యూఢిల్లీలో పనిచేసిన సమయంలో గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన వ్యవహారాలను కూడా ఆయన పర్యవేక్షించారు.

“దేశమంటే మనుషులోయ” అంటూ ప్రశంస

తెలుగు ప్రవాసుల సేవా స్ఫూర్తిని అభినందిస్తూ రాయబారి విపుల్ ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అనే పంక్తులను తెలుగులో ఉటంకించారు.

ఈ సందర్భంగా SATA నాయకులు రంజిత్ చెట్లూరి, ముజమ్మిల్ షేక్, జానీ బాషా, సుచరిత, చేతన, యాకూబ్ ఖాన్, ఎర్రన్న, సత్తిబాబు, నాగరాజు తదితరులు ప్రసంగించారు.

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

తెలుగు దినోత్సవంలో చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో నిర్వహించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలు, తెలుగు ప్రజల వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా చిన్నారుల ప్రదర్శనలు సాగాయి.

చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com