దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!

- September 24, 2026 , by Maagulf
దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!

దుక్మ్: ఒమాన్‌లోని దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZAD)లో కుదిరిన మొత్తం పెట్టుబడుల విలువ గత జూన్ నాటికి OMR8.818 బిలియన్లకు చేరుకుంది. 2021లో నమోదైన OMR3.650 బిలియన్లతో పోలిస్తే ఇది 141 శాతం వృద్ధి అని అధికారులు వెల్లడించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ ఫ్రీ జోన్స్ (OPAZ) చైర్మన్ ఖైస్ బిన్ మహమ్మద్ అల్ యూసుఫ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టుబడి వాతావరణం గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన చర్యలు, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సౌకర్యాలు ఈ వృద్ధికి దోహదపడ్డాయని వివరించారు. దుక్మ్ పోర్టులో కంటైనర్లు, రోల్-ఆన్/రోల్-ఆఫ్ కార్గో, చమురు-గ్యాస్ రంగానికి సంబంధించిన పైపులైన్లు, ఆర్థిక మండలిలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు అవసరమైన వివిధ రకాల సరుకుల రవాణా పెరిగిందని చెప్పారు.

దుక్మ్ పోర్టులోనూ వృద్ధి

2021 నుంచి 2025 మధ్య కాలంలో దుక్మ్ పోర్టులో మొత్తం కార్గో నిర్వహణ 5.66 శాతం పెరిగిందని అల్ యూసుఫ్ తెలిపారు. డ్రై బల్క్ కార్గో నిర్వహణ 3.88 శాతం, రోల్-ఆన్/రోల్-ఆఫ్ కార్గో నిర్వహణ 8.2 శాతం పెరిగిందని వెల్లడించారు. దుక్మ్ రిఫైనరీ రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.55 లక్షల బ్యారెళ్లకు పెంచుకుందని తెలిపారు. అలాగే డ్రై డాక్ 2020 నుంచి గత ఏడాది చివరి వరకు సుమారు 1,340 ప్రాజెక్టులను పూర్తి చేసిందని పేర్కొన్నారు.

గ్రీన్ హైడ్రోజన్, కొత్త ప్రాజెక్టులపై దృష్టి

ఒమాన్ నెట్-జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాలకు అనుగుణంగా.. దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో మరిన్ని ప్రాజెక్టులను స్థానికీకరించేందుకు OPAZ కృషి చేస్తోందని అల్ యూసుఫ్ తెలిపారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పర్యాటకం, వాణిజ్యం, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంతో పాటు.. ఉద్యోగుల స్థిరత్వానికి అవసరమైన విద్య, వైద్య సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

ఈ ఏడాది తొలి విద్యా సంవత్సరం ప్రారంభించిన దుక్మ్ యూనివర్సిటీ కాలేజ్ ఈ ప్రాంతంలోని విద్యా రంగానికి కొత్త ఊతమని తెలిపారు.సామాజిక సేవల రంగంలో భాగంగా దుక్మ్‌లో 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించిన ఎడ్యుకేషనల్ కమ్యూనిటీ కల్చరల్ సెంటర్ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో పెట్టుబడులు, ఆర్థిక ప్రాజెక్టుల పరిమాణం పెరిగే నేపథ్యంలో అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, సేవలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com