సినిమా రివ్యూ: ‘ది ప్యారడైజ్’

- September 24, 2026 , by Maagulf
సినిమా రివ్యూ: ‘ది ప్యారడైజ్’

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతవరకూ పక్కింటబ్బాయ్‌లా ప్రొజెక్ట్ అయిన నాని ఇమేజ్‌ని మార్చేసిన సినిమా ఇది. ఇప్పుడిదే కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘ది ప్యారడైజ్’. ట్రైలర్ లేకుండానే సినిమాని రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజైంది. మరి, ఆ అంచనాల్ని రిలీజ్ తర్వాత సినిమా అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.!

కథ:
ఇండియాకి స్వాతంత్య్రం వచ్చినా హైద్రాబాద్‌లోని ప్యారడైజ్ అనే ప్రాంతం మాత్రం శిఖంజా మాలిక్ (మోహన్ బాబు) ఆధీనంలో వుంటుంది. 2000 కిలోమీటర్ల దూరం నుంచి కాలి నడకన వచ్చి అక్కడ స్థిరపడిన సవారీలు అనే జాతికి భారతీయులుగా గుర్తింపు వుండదు. తరాల తరబడి పోరాటం చేస్తూనే వుంటారు ఈ వేల మంది జనం తమ గుర్తింపు కోసం. అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ జాతికి చెందిన సమ్మక్క (సోనాలి కులకర్ణి)కి పుట్టిన సంతానమే జడల్ (నాని). చిన్నతనం నుంచీ తల్లిని ద్వేషిస్తుంటాడు. కానీ, తన కొడుకే తన జాతిని కాపాడే నాయకుడు అని సమ్మక్క నమ్ముతుంది. అసలు తల్లంటేనే ఇష్టం లేని జడల్ చిన్నతనంలోనే జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.? తన జాతిని కాపాడుకునేలా ఎలాంటి పోరాటం చేశాడు.? తన పోరాటంలో జాతికి గుర్తింపు తేగలిగాడా.? జడల్ లైఫ్‌లో సుబ్బు (కాయదు లోహర్) పాత్రేంటీ.? ఈ విషయాలన్నీ తెలియాలంటే ‘ది ప్యారడైజ్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
మరో సారి నాని విశ్వరూపం చూస్తారు ఆడియన్స్ ఈ సినిమాలో. జడల్‌గా, ‘షేర్’ గా రెండు డిఫరెంట్ వేరియేషన్లు తన పాత్రలో చూపించాడు. తన వరకూ తాను ఈ  పాత్రలో వందకు వంద మార్కులేయించుకున్నాడు నాని. హీరోయిన్ అవ్వాలని కలలు కనే సుబ్బు, అది కుదరక బీ గ్రేడ్ హీరోయిన్‌గా వచ్చిన ఛాన్సులే వినియోగించుకోవల్సి వస్తుంది. ఆ పాత్రలో కయాదు కాకుండా సుబ్బు పాత్రకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. బిరియానీ పాత్రలో సంపూర్ణేష్ బాబుకు మంచి స్కోపు, పర్‌ఫామెన్స్ దక్కింది. తల్లి పాత్రలో సోనాలి కులకర్ణికి పవర్ ఫుల్ రోల్ దక్కింది. కేసీయార్ పాత్రను తలపించేలా డిజైన్ చేసిన ఎమ్మెల్యే శంకర్ పాత్రలో ప్రియదర్శి చాలా చక్కగా కుదిరాడు. ఆయన పాత్ర తెరపై కనిపించినప్పుడు ఆడయన్స్ నుంచి సూపర్బ్ రె్స్పాన్స్ వచ్చింది. మరో ముఖ్య పాత్రధారి ఈ సినిమాకి మెయిన్ అస్సెట్ విలన్ రోల్ పోషించిన మాలిక్.. మోహన్ బాబు. కర్కసమైన విలనిజాన్ని ప్రదర్శించారు. వింటేజ్ లుక్స్‌లో కనిపిస్తూనే, కథకు తగ్గ విలన్ రోల్‌ని సక్సెస్‌ఫుల్‌గా పోషించారాయన. అయితే, ప్రధమార్ధంలో వున్న ఆయన పాత్ర ప్రాధాన్యత ద్వితీయార్ధానికి వచ్చేసరికి కాస్త పేలవమైపోతుంది. ఈశ్వరీ రావు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. 

సాంకేతిక వర్గం పనితీరు:
శ్రీకాంత్ ఓదెల ‘దసరా’ సినిమాకి రచన, స్క్రీన్‌ప్లేలో చక్కని నైపుణ్యం ప్రదర్శించాడు. అయితే, ఈ సినిమాకి వచ్చేసరికి ఆ రెండింటినీ హ్యాండిల్ చేయడంలో కాస్త వీక్ అయ్యాడు. కథ పాతదే, కథనాన్ని అయినా కొత్తగా నడిపించాల్సి వుంది. కానీ ఒక తరాన్ని అణచివేత.. అనే నేపథ్యంతో గతంలోనే అనేక చిత్రాలు చూశాం. ఆయా సినిమాల రిఫరెన్సులు ఈ సినిమాలో కనిపిస్తాయ్. చాలా చోట్ల కాపీ సన్నివేశాలు అనిపిస్తాయ్. కానీ, ధియేటర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ థ్రిల్ ఫీలయ్యేలా కొన్ని సన్నివేశాల్ని డిజైన్ చేశాడు. అవి మాత్రం సినిమాలో పర్ఫెక్ట్ ప్లేస్ అయ్యాయ్. అయితే, అనుకున్న విధంగా భావోద్వేగాలు పండలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. తల్లి సెంటిమెంట్‌తో సహా. తొలి అర్ధ బాగంలోని మొదటి అరగంట సినిమా బాగుంటుంది. ఆ తర్వాత ఢీలా పడిపోతుంది. మళ్లీ ఇంటర్వెల్‌కి కొద్ది నిమిషాల ముందు వచ్చే సన్నివేశాలు, సెకండాఫ్‌పై ఆసక్తి పెంచేలా వుంటాయ్. కానీ, సెకండాఫ‌లో ఆశించదగ్గ అంచనాలేమీ కనిపించవ్. పూర్తిగా రక్తపాతంతో నింపేశారు. విచ్చలవిడిగా తలలు తెగిపడుతుంటాయ్. మొండాలు వేరవుతుంటాయ్. గన్నులు పేలుతుంటాయ్. పదునైన కత్తుల వాడకంతో రక్తం ఏరుల్లా పారుతుంటుంది. మధ్య మధ్యలో కథానాయకుడి అరుపులు.. అనిరుధ్ రవిచంద్రన్ ఇచ్చిన మ్యూజిక్‌లో ‘ఏష నాగుల.. ఆగయా షేర్’ పాటలు తెరపై బాగుంటాయ్. కానీ, బీజీఎమ్ కొన్ని చోట్ల ఇరిటేట్ చేస్తుంది. డైలాగులు కూడా అర్ధం కానంత ఇరిటేషన్ కొన్ని సన్నివేశాల్లో అయితే. సినిమాటోగ్రఫీ ఓకే. ప్యారడైజ్ వరల్డ్‌ని  చక్కగా చూపించారు. కొన్ని చోట్ల డ్రమటిక్ అనిపిస్తుందనుకోండి. డైలాగుల్లోనూ కొన్ని చోట్ల జుగుప్స కలిగిస్తుంది. సెన్సార్ కట్స్ వున్నాయనుకోండి. ఇక, నిర్మాణ విలువలు సినిమాకి చాలా ప్లస్. కథకి తగ్గట్లుగా ఎక్కడా రాజీ పడకుండా.. చాలా రిచ్ యాంబియెన్స్ అందించారు బడ్జెట్ పరంగా. 

ప్లస్ పాయింట్స్:
నాని పర్‌ఫామెన్స్, కీర్తి సురేష్ ఏష నాగుల స్పెషల్ సాంగ్, ఎలివేషన్ యాక్షన్ ఎపిసోడ్స్ మొదలైనవి.

మైనస్ పాయింట్స్:
ద్వితీయార్ధం.. పాత కథ, కొత్తదనం లేని కథనం.. జుగుప్స కలిగించే రక్తపాతం.. 

చివరిగా:
‘ది ప్యారడైజ్’ ఈ బిరియానీ టేస్ట్‌లో కాస్త ఎక్కువే ఫ్లేవర్ మిస్సయ్యింది.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com