వీల్‌చైర్‌ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!

- September 27, 2026 , by Maagulf
వీల్‌చైర్‌ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!

బహ్రెయిన్: వీల్‌చైర్‌ వినియోగదారులు, దృష్టిలోపం ఉన్నవారు, నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ప్రజా వాక్‌వేలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రతిపాదన ముందుకొచ్చింది. సదరన్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్ లతీఫ్ ఈ ప్రతిపాదన చేశారు. ప్రస్తుత పేవింగ్ బ్లాక్స్‌కు బదులుగా రబ్బరైజ్డ్, ఆస్ఫాల్ట్‌ ఉపరితలాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వీల్‌చైర్‌ల కోసం ప్రత్యేక మార్గాలు, దృష్టిలోపం ఉన్నవారి కోసం టాక్టైల్ పేవింగ్, బ్రెయిల్ సూచికలు, ర్యాంపులు, నీడనిచ్చే విశ్రాంతి ప్రాంతాలు, ఎక్కువ దూరం నడవలేని వారి కోసం సీటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.

‘ఆలి వాక్‌వే’ను ఆదర్శంగా తీసుకోవాలి

ఇటీవల ‘ఆలి వాక్‌వే’లో చేపట్టిన పనులు ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయడానికి ఉపయోగపడతాయని అబ్దుల్ లతీఫ్ తెలిపారు. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ మిస్ట్ కూలింగ్ సిస్టమ్‌ను ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్‌లో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి చల్లదనం అందించే వ్యవస్థలను ఇతర వాక్‌వేలలోనూ ఏర్పాటు చేయాలని సూచించారు.

2024లో ప్రారంభమైన సల్మానియా గార్డెన్‌లోని ప్రత్యేక అవసరాలున్న పిల్లల ప్లే ఏరియాను కూడా ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. సుమారు 650 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో వివిధ వైకల్యాలు ఉన్న పిల్లలకు అనుకూలమైన ఆట పరికరాలు, రబ్బర్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా బహ్రెయిన్‌లోని పార్కులు, వాక్‌వేలలో విస్తృతంగా అమలు కావాలని అబ్దుల్ లతీఫ్ పేర్కొన్నారు.

దృష్టిలోపం ఉన్నవారికి ప్రత్యేక సూచనలు

దృష్టిలోపం లేదా తక్కువ చూపు ఉన్నవారి కోసం క్రాసింగ్‌లు, జంక్షన్లు, ప్రవేశ మార్గాలు, ప్రమాదకర ప్రాంతాల్లో టాక్టైల్ పేవింగ్ ఏర్పాటు చేయాలని అబ్దుల్ లతీఫ్ ప్రతిపాదించారు. సైన్‌బోర్డుల్లో పెద్ద అక్షరాలు, సులభంగా చదవగల ఫాంట్లు, స్పష్టమైన కాంట్రాస్ట్ రంగులు ఉపయోగించాలని, ప్రవేశ ద్వారాలు, మరుగుదొడ్లు, మార్గ సూచిక మ్యాప్‌ల వద్ద బ్రెయిల్ మరియు టాక్టైల్ సైన్లు ఏర్పాటు చేయాలని కోరారు.దృష్టిలోపం ఉన్నవారు రోడ్లు సురక్షితంగా దాటేందుకు ఆడియో, టాక్టైల్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలో వృద్ధులు, ఎక్కువ దూరం నడవలేని వ్యక్తులకు అవసరమైన సౌకర్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com