UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!

- November 20, 2026 , by Maagulf
UNO సూచీలో ఒమన్‌కు మెరుగైన ర్యాంకు..!!

మస్కట్: డిజిటల్ పాలన, ప్రభుత్వ సేవల ఆధునికీకరణలో ఒమన్ గణనీయమైన పురోగతి సాధించింది. ఐక్యరాజ్యసమితి (UNO)విడుదల చేసిన ఈ-గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ (EGDI) 2026లో ఒమన్ ప్రపంచవ్యాప్తంగా 33వ స్థానాన్ని దక్కించుకుంది. 2024లో 41వ స్థానంలో ఉన్న ఒమన్ తాజాగా 8 స్థానాలు మెరుగుపరుచుకుంది. మొత్తం 194 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో ప్రభుత్వ డిజిటల్ సేవలు, సాంకేతిక మౌలిక సదుపాయాలు, పరిపాలనా సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ-సేవల విభాగంలో ఒమన్ మరింత మెరుగైన ప్రగతి సాధించింది. 2024లో 48వ స్థానంలో ఉండగా, 2026లో 26వ స్థానానికి చేరుకుంది. ఈ-పార్టిసిపేషన్ సూచీలోనూ 61వ స్థానం నుంచి 58వ స్థానానికి ఎగబాకింది.

ఒమన్ విజన్ 2040 లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తున్న నేషనల్ డిజిటల్ ఎకానమీ ప్రోగ్రామ్, నేషనల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఈ పురోగతికి దోహదపడ్డాయి. ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, సుస్థిర అభివృద్ధికి డిజిటల్ వ్యవస్థలను వినియోగించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కార్యక్రమాల అమలులో 58 ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. సమగ్ర డిజిటల్ సేవల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, పటిష్టమైన చట్టపరమైన వ్యవస్థ ఈ విజయానికి తోడ్పడ్డాయి. రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ ఉప మంత్రి డాక్టర్ అలీ బిన్ అమెర్ అల్ షిధానీ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం, జాతీయ డిజిటల్ పరివర్తన కార్యక్రమం లక్ష్యాల అమలు వల్లే ఈ పురోగతి సాధ్యమైందని తెలిపారు.

అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో స్థానం మెరుగుపడటమే కాకుండా, ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందించే సేవల నాణ్యతలోనూ వాస్తవమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. తదుపరి దశలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధానిత సేవలను విస్తరించడం, స్థానిక డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. ఈ పురోగతితో అంతర్జాతీయంగా ఒమన్ పోటీతత్వం పెరగడంతో పాటు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం బలపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com