KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!

- November 20, 2026 , by Maagulf
KAFD పై దాడులను తీవ్రంగా ఖండించిన GCC..!!

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (KAFD)లోని ఓ టవర్‌పై హౌతీ మిలీషియా జరిపిన దాడిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ప్రధాన కార్యదర్శి జాసెమ్ అల్ బుదైవీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి సౌదీ అరేబియా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రాంతీయ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమని పేర్కొన్నారు. ఈ ఘటనపై విడుదల చేసిన ప్రకటనలో అల్ బుదైవీ మాట్లాడుతూ.. హౌతీల చర్యలు పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఈ దాడిపై అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. హౌతీ మిలీషియా చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు బాధ్యులను గుర్తించి, వారిపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందన్నారు. పౌరులు, పౌర ఆస్తులపై జరుగుతున్న దాడులను కఠినంగా అడ్డుకోకపోతే హౌతీలు మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనివల్ల ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ భద్రతకు కూడా ముప్పు పెరుగుతుందని పేర్కొన్నారు.

సౌదీ అరేబియాకు గల్ఫ్ దేశాల సంపూర్ణ మద్దతు ఉంటుందని అల్ బుదైవీ పునరుద్ఘాటించారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సౌదీ ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు GCC దేశాలు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు. అలాగే సౌదీ పౌరులు, నివాసితుల భద్రతకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com