మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్

- September 28, 2026 , by Maagulf
మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్

విజయవాడ: రాష్ట్ర పర్యాటక వైభవానికి శుభారంభం.. మన కళలు, సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్ అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. 'సొసైటీ ఫర్ వైబ్రాంట్ విజయవాడ' ఆధ్వర్యంలో జరగనున్న 'విజయవాడ ఉత్సవ్' సీజన్-2 కర్టెన్ రైజర్ కార్యక్రమం  సోమవారం ఘనంగా ప్రారంభమైంది . ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఈ వేడుకకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా హాజరవగా, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని),  ఎమ్మెల్సీ వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్ పర్సన్ తేజస్వి పొడపాటి, నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ  తదితరులు పాల్గొని 'మేక్ అవర్ సిటీ షైన్' - 'వన్ సిటీ, వన్ సెలబ్రేషన్' నినాదంతో జరిగే విజయవాడ ఉత్సవ్ పోస్టర్, 'విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది'గీతాన్ని , ట్రైలర్‌ను మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా  ఆవిష్కరింపజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ...గత ఏడాది నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ విజయవంతమైన స్ఫూర్తితో, ఈ ఏడాది  పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, సొసైటీ ఫర్ వైబ్రాంట్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో  పున్నమి ఘాట్, బసవపున్నయ్య స్టేడియం, సిద్ధార్థ కాలేజ్ ప్రాంగణాల్లో అక్టోబర్ 11 నుండి 20 వరకు 9 రోజుల పాటు మరింత వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బెజవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటే  ఈ ఉత్సవానికి  9 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించామని, జాతీయ స్థాయి కల్చరల్ అవుట్‌రీచ్‌గా దీన్ని మారుస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు సరస్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామన్నారు. ఇలాంటి ఉత్సవాల నిర్వహణ ద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, స్థానిక వ్యాపారులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు, కళాకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా స్థానిక ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.కనుమరుగవుతున్న జానపద కళలు, స్థానిక ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ఉత్సవాలు వేదికవుతాయని, రాష్ట్రంలోని యువతలో కళల పట్ల అభిరుచి పెంపొంది సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.  విజయవాడ ఉత్సవ్ తరహాలోనే విశాఖ ఉత్సవ్, అనకాపల్లి, అరకు, అమరావతి ఆవకాయ్, గండికోట, ఫ్లెమింగో ఫెస్టివల్ తదితర ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని, భవిష్యత్తులో ఇలాంటి ఉత్సవాలను రాష్ట్రం నలుమూలలా విస్తరించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సుపరిపాలనలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరింత జోరుగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.నాటి కాలంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించి స్వాతంత్ర్య సమపార్జనకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఎంతగానో కృషి చేశారని గుర్తుచేస్తూ, ప్రస్తుత ఉత్సవాలు కూడా అలాంటి సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు...కొన్ని ఉత్సవాలు కేవలం సాధారణంగా జరుగుతాయి, కానీ కొన్ని ఉత్సవాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. ఈ విజయవాడ ఉత్సవ్-2 అలాంటి అరుదైన మైలురాయిగా నిలవనుందని అన్నారు.విజయవాడ నగరమే ఒక పెద్ద ఉత్సవంగా మారబోతోందని, తమ ప్రతిభను ప్రదర్శించేందుకు తగిన వేదిక లేక ఎదురుచూస్తున్న ప్రతి ఒక్క టాలెంటెడ్ ఆర్టిస్టుకు ఈ ఉత్సవం గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు.. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కృష్ణా తీరాన్ని నిరంతర ఉత్సవాల సమూహారంగా మారుస్తున్న నిర్వాహకులకు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు.ఈ వేడుకలను ప్రజలకు మరింత ఆకర్షణీయంగా, అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో 'శ్రేయాస్ మీడియా' కీలక పాత్ర పోషిస్తోందని, వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com