యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!

- October 01, 2026 , by Maagulf
యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!

దుబాయ్: యూఏఈలోకి అక్రమంగా తరలిస్తున్న 16.2 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమైన్ (క్రిస్టల్ మెత్)ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వాహనం టైర్‌లో డ్రగ్స్‌ను అత్యంత పకడ్బందీగా దాచిపెట్టి తరలించే ప్రయత్నాన్ని ల్యాండ్ బోర్డర్ క్రాసింగ్ వద్ద అధికారులు భగ్నం చేశారు.  యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ICP)కు చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పోర్ట్స్ సెక్యూరిటీ అధికారులు ఈ అక్రమ రవాణాను గుర్తించారు.

స్కానింగ్‌లో అనుమానాస్పద సంకేతాలు

సరిహద్దు వద్ద అధునాతన స్కానింగ్ పరికరాలతో వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అసాధారణ సంకేతాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో మాన్యువల్ తనిఖీ చేపట్టారు. కస్టమ్స్ అండ్ సెక్యూరిటీ సపోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డ్రగ్ డిటెక్షన్ శిక్షణ పొందిన క9 బృందం సహకారంతో వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ఒక టైర్‌లో క్రిస్టల్ మెత్‌ను ప్రత్యేకంగా దాచినట్లు గుర్తించారు. అధునాతన సాంకేతిక తనిఖీ వ్యవస్థలతో పాటు అధికారుల క్షేత్రస్థాయి అనుభవం, అప్రమత్తత కారణంగానే ఈ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకోగలిగామని ICP తెలిపింది. విధుల్లో సమర్థత, వృత్తి నైపుణ్యం ప్రదర్శించిన అధికారులను అభినందించింది.

2026లో 765 డ్రగ్స్ కేసులు

2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు పోర్ట్స్ సెక్యూరిటీ డైరెక్టరేట్ 765 డ్రగ్స్ స్వాధీనం కేసులను నమోదు చేసినట్లు ICP వెల్లడించింది. ఈ కేసుల్లో సుమారు 390 కిలోల మాదక ద్రవ్యాలు, 50,000 నార్కోటిక్ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం తనిఖీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో పనిచేస్తామని ICP పేర్కొంది.

యూఏఈ ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 30 ఆఫ్ 2021 ప్రకారం నిషేధిత మాదక ద్రవ్యాలను దేశంలోకి తీసుకురావడం నేరం. డ్రగ్స్‌ను అక్రమంగా విక్రయించడం లేదా ప్రచారం చేయాలనే ఉద్దేశం నిర్ధారణ అయితే కొన్ని నేరాలకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష వరకు శిక్షలు ఉండొచ్చని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, జూలైలో మరో కేసులో దుబాయ్ కస్టమ్స్, దుబాయ్ పోలీసులు కలిసి సుమారు 200 కిలోల బరువున్న 2,78,850 ప్రెగాబలిన్ పిల్స్ లను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. తాజా కేసుకు, ఆ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com