విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!

- October 01, 2026 , by Maagulf
విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!

దోహా: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ అవేర్‌నెస్ కమ్యూనిటీ టీమ్ (SACT) కాంపిటీషన్ ఐదో ఎడిషన్‌ను ఖతార్ విద్యాశాఖ ప్రారంభించింది. ఇందులో 106 ప్రభుత్వ ప్రిపరేటరీ, సెకండరీ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారు.  పోటీల విధివిధానాలు, లక్ష్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు వివిధ దశల్లో పాల్గొనేందుకు సిద్ధం చేయడానికి సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు విద్యాశాఖ శాశ్వత ప్రధాన కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది తొలిసారిగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పైలట్ ఎడిషన్‌ను కూడా ప్రారంభించారు.

పబ్లిక్ స్పీకింగ్‌పై శిక్షణ
శిక్షణ కార్యక్రమంలో సైద్ధాంతిక, ప్రాక్టికల్ సెషన్ల ద్వారా విద్యార్థుల్లో ప్రసంగ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టారు. నిర్మాణాత్మక పౌర సంభాషణలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా, సమస్యల్లో భాగం కాకుండా పరిష్కారాల్లో భాగస్వాములు అయ్యేలా శిక్షణ అందించారు. శిక్షణలో భాగంగా పలు ఉప అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాటిలో కౌమారదశలో ఎదురయ్యే ఒత్తిళ్లు, కనిపించని సవాళ్లు, ఘర్షణలు, సంక్షోభాలకు అనుగుణంగా మారుతూ మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడం, ఏఐ మరియు సమాజాల భవిష్యత్తుపై దాని ప్రభావం, సుస్థిర అభివృద్ధిలో యువత నాయకత్వ పాత్ర అనే అంశాలు ఉన్నాయి.  

ఈ పోటీలను విద్యాశాఖలోని ఎడ్యుకేషనల్ గైడెన్స్ విభాగం ఇంగ్లిష్ లాంగ్వేజ్ సెక్షన్ పర్యవేక్షిస్తోంది. ఇంగ్లిష్ భాషా ఉపాధ్యాయుల బృందం విద్యార్థులకు ప్రేక్షకుల ముందు మాట్లాడటం, కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్, నాయకత్వ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తోంది.తుది దశకు అర్హత సాధించిన విద్యార్థుల వివరాలను జనవరి 2027లో ప్రకటించనున్నారు. ముగింపు, అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నారు. వివిధ కేటగిరీల్లో మూడు స్థానాల్లో నిలిచిన విజేతలను సత్కరించడంతో పాటు, అర్హత సాధించిన విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్టు విద్యాశాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com