ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!

- October 01, 2026 , by Maagulf
ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!

మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్‌లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 మూడో ఎడిషన్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్ 11 నుంచి 18 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ను యూరోపియన్ యూనియన్ మిషన్, ఒమన్‌లోని ఈయూ సభ్య దేశాల రాయబార కార్యాలయాలు, ఒమన్ సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ, ఒమన్ ఫిల్మ్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫౌండేషన్ ఆఫ్ ఒమన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. యూరోపియన్ సినిమాను, దాని వైవిధ్యాన్ని ఒమన్ ప్రేక్షకులకు పరిచయం చేయడంతో పాటు.. ఒమన్, యూరప్ మధ్య సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహనను పెంపొందించడం ఈ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

9 దేశాల నుంచి 20 సినిమాలు

ఫెస్టివల్‌లో ఆస్ట్రియా, సైప్రస్, ఫ్రాన్స్, జర్మనీ, హంగేరీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా, స్పెయిన్ దేశాలకు చెందిన మొత్తం 20 చిత్రాలను ప్రదర్శించనున్నారు. సమకాలీన యూరోపియన్ సినిమా వైవిధ్యాన్ని ఈ చిత్రాలు ప్రతిబింబించనున్నాయి. ఒమన్‌లో యూరోపియన్ సినిమా పరిచయాన్ని పెంచడంతో పాటు స్థానిక ప్రతిభావంతులైన దర్శకులు, చిత్ర నిర్మాతలకు ప్రోత్సాహం కల్పించడం, సినిమా రంగంలో సృజనాత్మకత, అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం ఫెస్టివల్ లక్ష్యాల్లో భాగమని నిర్వాహకులు తెలిపారు.

ఒమన్ యువ ఫిల్మ్ మేకర్లకు ప్రత్యేక అవకాశం

ఈ ఏడాది ఫెస్టివల్‌లో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ, ఒమన్ ఫిల్మ్ సొసైటీ సహకారంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఒమన్‌లోని కొత్తగా ఎదుగుతున్న, ఇప్పటికే స్థిరపడిన ఫిల్మ్ మేకర్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక కథలు, సృజనాత్మకతను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ఈ పోటీ వేదికగా ఉపయోగపడనుంది.

షార్ట్‌లిస్ట్ అయిన చిత్రాలను అక్టోబర్ 12 నుంచి 14 వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉచితంగా ప్రజలకు ప్రదర్శించనున్నారు. యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ క్రిస్టోఫ్ ఫర్నాడ్ మాట్లాడుతూ.. ఒమన్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కొనసాగడం రెండు ప్రాంతాల మధ్య సాంస్కృతిక బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఒమన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండర్‌సెక్రటరీ సయ్యద్ సయీద్ బిన్ సుల్తాన్ అల్ బుసైదీ మాట్లాడుతూ.. ప్రజలు, సంస్కృతులను దగ్గర చేయడంలో సినిమా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ ఫెస్టివల్ ద్వారా ఒమన్‌లో అభివృద్ధి చెందుతున్న సినిమా రంగానికి కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com