యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!

- October 01, 2026 , by Maagulf
యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!

దుబాయ్: దుబాయ్–అబుదాబి మధ్య రోజువారీగా ప్రయాణించే యూఏఈ నివాసితులకు ఎతిహాద్ రైలు కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా మారుతోంది. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమైన ప్యాసింజర్ రైలు సేవలను తొలిసారిగా వినియోగించిన ప్రయాణికులు.. రోడ్డు మార్గంతో పోలిస్తే సమయం, డబ్బు ఆదా అవుతుందని చెబుతున్నారు. దుబాయ్–అబుదాబి మధ్య రైలు ప్రయాణం సుమారు 64 నిమిషాలు పడుతోంది. రెండు ఎమిరేట్ల మధ్య రోజుకు 10 సర్వీసులు నడుస్తున్నాయి.

టాక్సీతో పోలిస్తే భారీగా ఆదా

అబుదాబిలో పనిచేస్తున్న ఇంజినీర్ వాసిఫ్ కు గతంలో ఒకవైపు టాక్సీ ప్రయాణానికే Dh350కు పైగా ఖర్చయ్యేదట.  తాజాగా స్టేషన్ వరకు టాక్సీ, రైలు టికెట్ కలిపి మొత్తం Dh173 మాత్రమే ఖర్చయిందని పేర్కొన్నారు. గతంలో ఒకవైపు టాక్సీకి ఖర్చయ్యే మొత్తంతో పోలిస్తే Dh177 ఆదా అయిందన్నారు. 

ఇక ఇలాంటి వారి కోసం స్టేషన్ నుంచి వాళ్ల గమ్యస్థానానికి వెళ్లేందుకు షటిల్ బస్సులు, టాక్సీలు, కార్ రెంటల్ వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వీటి ఖర్చు Dh10 నుంచి ప్రారంభమవుతుంది. రైలు ప్రయాణం మరింత సౌకర్యంగా ఉందని వాసిఫ్ తెలిపారు. ఇకపై ప్రతి వారం రైలులోనే ప్రయాణించే అవకాశం ఉందని చెప్పారు.

ట్రాఫిక్ సమయం నుంచి ఉపశమనం

భారతీయ ప్రవాసి అభిషేక్  కూడా రైలు ద్వారా డబ్బు కంటే సమయం ఆదా కావడం ముఖ్యమైందని తెలిపారు. ప్రస్తుతం మిర్డిఫ్ నుంచి అబుదాబికి ప్రతిరోజూ కారులో ప్రయాణించేందుకు  సాధారణంగా 1.5 గంటలు, తిరిగి ఇంటికి రావడానికి షార్జా వైపు ట్రాఫిక్ కారణంగా 2.5 గంటల వరకు పడుతుందని ఆయన తెలిపారు. స్టేషన్‌కు చేరుకోవడం సులభంగా ఉందని, కార్యాలయం వరకు కూడా ఇదే విధంగా సౌకర్యవంతంగా ప్రయాణించగలిగితే ప్రతిరోజూ రైలును ఉపయోగించే అవకాశం ఉందని అభిషేక్ చెప్పారు.

రోజుకు 5 డైరెక్ట్ రైళ్లు

ప్రస్తుతం దుబాయ్ నుంచి అబుదాబికి రోజుకు 5 డైరెక్ట్ రైళ్లు నడుస్తున్నాయి.  కంఫర్ట్ క్లాస్ టికెట్లు Dh39 నుంచి, ప్రీమియం క్లాస్ టికెట్లు Dh109 నుంచి ప్రారంభమవుతున్నాయి.

అబుదాబి నివాసితులు హరి కృష్ణన్, అక్షయ్ పి. విశ్వం ఉద్యోగ శిక్షణ కోసం దుబాయ్‌కు రైల్లో ప్రయాణించారు. సాధారణంగా బస్సులో వచ్చే వీరు ఎతిహాద్ రైలు ప్రారంభమైన విషయం తెలుసుకుని రైలు ప్రయాణాన్ని ప్రయత్నించారు. బనియాస్‌లోని తమ నివాసం నుంచి మొహమ్మద్ బిన్ జాయెద్ సిటీ స్టేషన్‌కు టాక్సీలో సుమారు 15 నిమిషాల్లో చేరుకున్నారు. అక్కడి నుంచి తొలి రైలులో దుబాయ్ చేరుకుని, అనంతరం మెట్రో ద్వారా డైరాకు వెళ్లారు.

దుబాయ్ మెట్రోతో సులభమైన కనెక్షన్

ఎతిహాద్ రైలు సేవకు మరో ముఖ్యమైన సౌకర్యం దుబాయ్ మెట్రోతో ఉన్న అనుసంధానం. అల్ యలాయిస్ స్టేషన్ నుంచి జుమైరా గోల్ఫ్ ఎస్టేట్స్ మెట్రో స్టేషన్‌కు ప్రత్యేక ఫుట్‌బ్రిడ్జ్ ద్వారా చేరుకోవచ్చు. దీంతో రైలు దిగిన తర్వాత కారును ఉపయోగించకుండానే మెట్రో ద్వారా దుబాయ్‌లోని ఇతర ప్రాంతాలకు ప్రయాణించే అవకాశం ఉంది. రోజువారీగా దుబాయ్–అబుదాబి మధ్య ప్రయాణించే ఉద్యోగులకు రైలు ప్రయాణం సమయం, ప్రయాణ ఖర్చులను తగ్గించుకునే మరో మార్గంగా అందుబాటులోకి వచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com