వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- October 01, 2026
మనామా: వృద్ధుల సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ కూడా నిర్వహించాలని బహ్రెయిన్ ఎంపీ డాక్టర్ మునీర్ సీరోర్ సూచించారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంటరితనం, సామాజికంగా దూరమవడం వంటి కారణాలతో మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వృద్ధులకు అందించే ప్రాథమిక వైద్య సేవల్లోనే మానసిక ఆరోగ్యాన్ని కూడా చేర్చాలని ఆయన కోరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలో డిప్రెషన్, ఆందోళన (Anxiety), ఇతర మానసిక సమస్యల లక్షణాలను గుర్తించే విధంగా స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు.
వృద్ధుల హక్కులకు సంబంధించిన 2009 నాటి బహ్రెయిన్ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని డాక్టర్ సీరోర్ అన్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి 16 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా నిబంధనలను అప్డేట్ చేయాలని ఆయన కోరారు. వృద్ధుల స్వతంత్రత, గోప్యత, తమ జీవితాలను ప్రభావితం చేసే విధానాలు, నిర్ణయాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
చట్టంలో ఉన్న నిబంధనలు వృద్ధుల జీవితాల్లో, వారి గౌరవంలో, వారికి అందే సంరక్షణ నాణ్యతలో ప్రతిఫలించడమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. చట్టంలో ఉన్న నిబంధనలకు, వాటి అమలుకు మధ్య ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని తొలగించాలని అన్నారు. వృద్ధుల సంరక్షణ సేవలకు సంబంధించి లైసెన్సింగ్, తనిఖీలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం స్పష్టమైన నిబంధనలు ఉండాలని డాక్టర్ సీరోర్ కోరారు.
వృద్ధులను శారీరక, మానసిక వేధింపులు, నిర్లక్ష్యం, విడిచిపెట్టడం, ఆర్థిక దోపిడీ, అలాగే పవర్ ఆఫ్ అటార్నీ దుర్వినియోగం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులపై వేధింపులు లేదా దుర్వినియోగాన్ని సులభంగా నివేదించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఫిర్యాదులను స్వీకరించే సంస్థల బాధ్యతలు, స్పందనకు సంబంధించిన ప్రమాణాలను స్పష్టంగా నిర్ణయించాలని కోరారు.
వృద్ధుల సంరక్షణ అంటే కేవలం వైద్య సేవలు మాత్రమే కాదని డాక్టర్ సీరోర్ అన్నారు. వారి ఆరోగ్యం, సామాజిక అవసరాలు, మానసిక శ్రేయస్సు, స్వతంత్రత, ఆర్థిక భద్రత, సమాజంలో భాగస్వామ్యం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఇలాంటి హక్కులను పరిరక్షించడం ద్వారా వృద్ధుల గౌరవాన్ని కాపాడటంతో పాటు కుటుంబం, సమాజంలో వారు చురుకుగా కొనసాగేందుకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. 2009లో తీసుకొచ్చిన చట్టం ద్వారా వృద్ధుల హక్కులకు, వారి అనుభవం, సేవలు, సమాజానికి వారు అందించిన సహకారానికి అధికారిక గుర్తింపు లభించిందని డాక్టర్ సీరోర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!
- యూఏఈ–భారత్ సాంస్కృతిక సహకారానికి మరింత బలోపేతం
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!







