వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..

- October 02, 2026 , by Maagulf
వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..

న్యూ ఢిల్లీ: రోడ్డు పై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, పడిన ఈ-చలాన్లను ‘తర్వాత చూసుకుందాంలే’ అని నిర్లక్ష్యం చేసే వాహనదారులకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా జారీ అయిన చలాన్లలో దాదాపు 47 శాతం వరకు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంపై జస్టిస్ జె.బి. పార్డీవాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం(Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై అకస్మాత్తుగా తనిఖీలు చేసి అలాంటి వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ కట్.. పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్:
చలాన్లు కట్టకపోతే ఎదురయ్యే పరిణామాలు ఇకపై అత్యంత తీవ్రంగా ఉండనున్నాయి. బకాయిలు క్లియర్ చేసేవరకు సదరు వాహనాలకు ఆర్‌సీ రెన్యూవల్, డూప్లికేట్ ఆర్‌సీ జారీ, అడ్రస్ మార్పు, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను పూర్తిగా నిలిపివేస్తారు. వాహనాలను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా, కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ కూడా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తరచూ రూల్స్ అతిక్రమించే డ్రైవర్ల లైసెన్సులను సస్పెండ్ చేయాలని సూచించింది.

రూ.23 వేల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు.. రాష్ట్రాలకు ఘాటు హెచ్చరికలు:
దేశవ్యాప్తంగా దాదాపు రూ.49,194 కోట్ల చలాన్లు పడగా, అందులో కేవలం రూ.26,175 కోట్లు మాత్రమే వసూలయ్యాయని, మిగతా రూ.23,000 కోట్లకు పైగా సొమ్ము పెండింగ్‌లోనే ఉండిపోయిందని కోర్టు తెలిపింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరించి వసూలు చేయాలని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు వెంటనే తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను తనిఖీ చేసుకుని క్లియర్ చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com