ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- October 02, 2026
దుబాయ్: సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటనలో గాయపడిన పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భావోద్వేగంగా మాట్లాడారు. విమానంలో జరిగిన ఘటన సమయంలో తాను ప్రాణాల కోసం పోరాడుతున్నప్పటికీ, విమానంలోని వంద మందికి పైగా ప్రయాణికులను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన తెలిపారు.
ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో జరిగిన ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చార్ కీలక పాత్ర పోషించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన ఆయనను పలువురు ‘హీరో’గా ప్రశంసిస్తున్నారు.
హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మచ్చార్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా విమానంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను పైలట్ వివరించారు. గాయాలతో బాధపడుతున్నప్పటికీ తాను కాక్‌పిట్ తలుపు తెరిచినట్లు చెప్పారు. అనంతరం నేలపై పడిపోయిన తనకు ప్రాణాలపై ఆందోళన కలిగిందని, అయితే ‘‘అందరినీ చనిపోనివ్వలేను’’ అనే ఆలోచనతో ముందుకు సాగానని తెలిపారు.
హాస్పిటల్ బెడ్‌పై నుంచి మోదీతో మాట్లాడుతున్న సమయంలో మచ్చార్ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘సారీ.. మీ ముందు ఏడుస్తున్నాను’’ అని ఆయన అన్నారు. అందుకు ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘‘ఎక్కడ భావోద్వేగానికి గురికావాలి? నా ముందు కాకపోతే ఇంకెక్కడ?’’ అంటూ ధైర్యం చెప్పారు.
మచ్చార్‌కు అందుతున్న వైద్య చికిత్సపై మోదీ, పైలట్ ఇద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. గాయపడిన భారతీయ పైలట్‌కు వైద్య సహాయం అందిస్తున్న యూఏఈ, సౌదీ అరేబియా అధికారులకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మొత్తం భారతదేశం మీకు అండగా ఉంది’’ అని మచ్చార్‌కు భరోసా ఇచ్చారు.
ఇంతకుముందు యూఏఈలో భారత రాయబారి దీపక్ మిట్టల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చార్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. భారత దౌత్య కార్యాలయాలు యూఏఈ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, స్థానిక అధికారులు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా కెప్టెన్ మచ్చార్ ధైర్యసాహసాలను ప్రశంసించారు. గాయపడినప్పటికీ ఆయన ప్రతిఘటించి, విమానంలో భారీ ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానంలో ఏం జరిగింది?
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన FZ1073 విమానంలో కాక్‌పిట్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఈ ఘటనలో కెప్టెన్‌తో పాటు కో-పైలట్ కూడా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
ఈ ఘటనపై యూఏఈ అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ ఘటనకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందా, ముందస్తు ప్రణాళిక లేదా ఎవరైనా ఆదేశాలు ఉన్నాయా అనే అంశాలను కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు.
ఘటన అనంతరం ఫ్లైదుబాయ్ ఇజ్రాయెల్‌కు, అక్కడి నుంచి నడిపే విమానాలను తదుపరి నోటీసు వరకు నిలిపివేసింది. అలాగే ఎమిరేట్స్ కూడా ఫ్లైదుబాయ్‌తో కలిసి టెల్ అవీవ్‌కు నిర్వహిస్తున్న కోడ్‌షేర్ సేవలను తక్షణమే నిలిపివేసింది.
తాజా వార్తలు
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..







