అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- October 02, 2026
మనామా: ప్రాంతీయంగా ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించేందుకు బహ్రెయిన్‌లో కీలక సమావేశాలు జరిగాయి. GCC ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ క్రిస్టలినా జార్జీవా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
బహ్రెయిన్ ఆర్థిక, జాతీయ ఆర్థిక వ్యవహారాల మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా నేతృత్వంలో సంయుక్త GCC-IMF సమావేశంతో పాటు 126వ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరఫున ప్రతినిధులకు స్వాగతం పలికారు.
గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు ‘రెసిలియెన్స్’
సమావేశాల్లో ప్రధానంగా ఆర్థిక స్థిరత్వం, సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యంపై చర్చ జరిగింది. GCC దేశాలపై ఇరాన్ దాడులు, సముద్ర భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసిరాయని షేక్ సల్మాన్ పేర్కొన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ గల్ఫ్ దేశాలు ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని కొనసాగించగలిగాయని తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు కీలకమైన హార్ముజ్ జలసంధి, బాబ్ ఎల్-మందెబ్ మార్గాలను సురక్షితంగా, తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి అత్యంత కీలకమని అన్నారు.
బహ్రెయిన్‌లో 86 శాతానికి పైగా నాన్-ఆయిల్ రంగం
బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థలో వైవిధ్యీకరణ ఫలితాలను మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో 86 శాతానికి పైగా నాన్-ఆయిల్ కార్యకలాపాల నుంచే వస్తున్నాయని తెలిపారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక వైవిధ్యీకరణ విధానాల వల్ల చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం సాధ్యమైందని పేర్కొన్నారు.
AI, డిజిటల్ ఆస్తులపై దృష్టి
భవిష్యత్‌లో కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ఆస్తులు గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించనున్నాయని షేక్ సల్మాన్ అన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, తగిన నియంత్రణ వ్యవస్థల్లో GCC దేశాలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. అదే సమయంలో వేగంగా అనుసంధానమవుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
UKతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై పురోగతి
వాణిజ్య రంగంలో యునైటెడ్ కింగ్డమ్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాంకేతిక స్థాయిలో తుది దశకు చేరుకోవడాన్ని బహ్రెయిన్ స్వాగతించింది. యూరోపియన్ యూనియన్‌తో చర్చలను కూడా వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా GCC కస్టమ్స్ యూనియన్, కామన్ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించిన పనులను కొనసాగించాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
సౌదీ, యూఏఈతో ఆర్థిక సహకారం
గల్ఫ్ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంలో సౌదీ అరేబియా అందించిన లాజిస్టికల్ సహాయాన్ని బహ్రెయిన్ ప్రశంసించింది. అలాగే యూఏఈతో ఇటీవల కుదిరిన కరెన్సీ స్వాప్ ఒప్పందం గల్ఫ్ దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక, ఆర్థిక సమీకరణకు సూచికగా పేర్కొంది.
GCC ఆర్థిక పరిస్థితులపై IMF నివేదిక
IMF చీఫ్ క్రిస్టలినా జార్జీవా 2026 GCC Economic Surveillance Report వివరాలను మంత్రులకు వివరించారు. IMF మిడిలిస్టు, మధ్య ఆసియా విభాగం డైరెక్టర్ డాక్టర్ జిహాద్ అజూర్ కూడా భౌగోళిక-రాజకీయ సవాళ్ల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన విధాన ప్రాధాన్యతలపై వివరించారు. ఇటీవల ప్రాంతీయంగా నెలకొన్న సవాళ్ల మధ్య గల్ఫ్ దేశాల ఆర్థిక సహకారం, స్థిరత్వం, భవిష్యత్ ప్రణాళికలపై జరిగిన ఈ సమావేశాలతో బహ్రెయిన్ గల్ఫ్ ఆర్థిక దౌత్యంలో కీలక వేదికగా నిలిచిందని ప్రశంసలు కురిపింపించింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







