కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!

- October 02, 2026 , by Maagulf
కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!

సల్మియా: ఆరోగ్య, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఓ రెస్టారెంట్‌, ఫుడ్‌ గోడౌన్‌పై కువైట్‌ అధికారులు చర్యలు తీసుకున్నారు. సల్మియా ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్‌, ఆహార నిల్వ గోడౌన్‌ను అధికారులు సీజ్‌ చేశారు. హవల్లి గవర్నరేట్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌, సల్మియా ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌కు చెందిన అధికారులు.. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ (PAFN) అధికారులతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.

ఆహార పదార్థాలను అనుమతించిన ఆరోగ్య ప్రమాణాలకు విరుద్ధంగా నిల్వ చేసి, వినియోగదారులకు విక్రయిస్తున్నారనే సమాచారం అధికారులకు అందింది. దీంతో సమాచారం నిజమని నిర్ధారించుకున్న అనంతరం అధికారులు సంబంధిత ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సదరు రెస్టారెంట్‌ను గతంలో PAFN అధికారులు మూసివేసినప్పటికీ, తిరిగి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు.

అధికారులు పలు ఉల్లంఘనలను గుర్తించారు. వాటిలో రద్దు చేసిన లేదా గడువు ముగిసిన లైసెన్స్‌తో వ్యాపారం నిర్వహించడం, ఆరోగ్య లైసెన్స్‌ లేకుండానే ఫెసిలిటీని తెరవడం, అనుమతించిన స్థలానికి మించి ప్రాంతాలను ఉపయోగించడం, సాంకేతిక, ఆరోగ్య ప్రమాణాలను పాటించకపోవడం,  కల్తీ, తెలియని మూలాల నుంచి వచ్చిన ఆహార పదార్థాలను విక్రయించడం వంటి ఉల్లంఘనలు ఉన్నాయి.

11 మంది కార్మికులపై ఉల్లంఘనలు

రెస్టారెంట్‌, గోడౌన్‌లో పనిచేస్తున్న వారిలో 11 మంది కార్మికులు నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 8 మంది ఆహార పదార్థాలను నిర్వహించేందుకు అవసరమైన ఆరోగ్య ధ్రువపత్రాలు లేకుండా పనిచేస్తున్నట్లు తేలింది. తనిఖీల్లో గుర్తించిన కల్తీ ఆహార పదార్థాల్లో 114 కేజీలను పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ అధికారులు ధ్వంసం చేశారు. అలాగే గుర్తించిన ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 18 కేసులు/ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయడం, చట్టాలను ఉల్లంఘించే కార్యకలాపాలను అడ్డుకోవడంలో భాగంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతున్నాయని కువైట్‌ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com