ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- October 02, 2026
మస్కట్: ఒమన్‌లో 2026–2027 కొత్త జ్యుడీషియల్ ఇయర్ ప్రారంభమైంది. కొత్త సంవత్సరంతో న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తొలిదశలో వివిధ కోర్టుల్లో వారసత్వం, వారసత్వ ఆస్తులు, అనాథల నిధుల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను డిజిటల్ విధానంలోకి తీసుకురానున్నారు.
కొత్త జ్యుడీషియల్ ఇయర్ ప్రారంభానికి ముందు ఒమన్‌లోని కోర్టులు జనరల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి న్యాయ విభాగాల ఏర్పాటు, సిబ్బంది, మౌలిక వసతులు, పరిపాలనా మరియు సాంకేతిక సన్నద్ధతను పూర్తి చేశాయి. దీని ద్వారా న్యాయ సేవలను పొందే వ్యక్తులకు ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు కేసుల పరిష్కార వేగాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ సయ్యద్ మహమ్మద్ సుల్తాన్ అల్ బుసైది మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ఆధునికంగా మార్చడంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కీలకంగా మారిందన్నారు. ఆధునిక సాంకేతికత వినియోగాన్ని విస్తరించడం ద్వారా న్యాయ సేవల నాణ్యత, పని సామర్థ్యం, కేసుల పరిష్కార వేగం మెరుగుపడుతున్నట్లు తెలిపారు.
గత జ్యుడీషియల్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వాణిజ్య, పెట్టుబడి వివాదాలకు ప్రత్యేక న్యాయ వేదికను అందించడం, పెట్టుబడుల రక్షణ, వివాదాల వేగవంతమైన పరిష్కారం, వ్యాపార వాతావరణానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
2025–2026 జ్యుడీషియల్ ఇయర్లో ఒమన్ కోర్టుల్లో మొత్తం 177,356 కేసులు పెండింగ్/పరిశీలనలో ఉండగా, వాటిలో 126,487 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. మొత్తం కేసుల పరిష్కార రేటు 71 శాతంగా నమోదైంది. ఒక్కో న్యాయమూర్తికి సగటున 411 కేసులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి.
సుప్రీంకోర్టులో 6,650 కేసుల్లో 5,803 కేసులు పరిష్కరించడంతో 87 శాతం పరిష్కార రేటు నమోదైంది. అప్పీల్ కోర్టుల్లో 44,189 కేసులు నమోదవగా, 28,678 తీర్పులు వెలువడ్డాయి. దీంతో అక్కడ పరిష్కార రేటు 65 శాతంగా ఉంది. ప్రైమరీ కోర్టుల్లో 88,458 కేసులు నమోదవగా, 69,208 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. ఈ కోర్టుల పరిష్కార రేటు 78 శాతంగా నమోదైంది.
ఇదిలా ఉండగా.. డిజిటల్ న్యాయ సేవల్లో భాగంగా ‘Qadha’ పోర్టల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య 137,000 దాటింది. ఎలక్ట్రానిక్‌గా నమోదు చేసిన కేసుల సంఖ్య 760,000కు పైగా ఉంది. అలాగే 29,000కు పైగా ఎగ్జిక్యూషన్ అభ్యర్థనలు ఆన్లైన్లో ప్రాసెస్ చేశారు. 600,000కు పైగా న్యాయ ఫైళ్లను ఎలక్ట్రానిక్‌గా ఆర్కైవ్ చేశారని నివేదికలో వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







