యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?

- October 03, 2026 , by Maagulf
యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?

దుబాయ్: యూఏఈలో అక్టోబర్ 1 నుంచి ఇంధన ధరలు పెరగడంతో రవాణాపై ఆధారపడే వ్యాపారాలు తమ ఖర్చులను సమీక్షించుకుంటున్నాయి. ముఖ్యంగా ఇల్లు మారే సేవలు, కార్ రికవరీ, ఫుడ్ డెలివరీ రంగాల్లో ఇంధన ధరల పెంపు ప్రభావాన్ని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నుంచి డీజిల్ ధర లీటరుకు 50 ఫిల్స్ పెరిగి Dh4.80కు చేరింది. స్పెషల్ 95 పెట్రోల్ ధర 59 ఫిల్స్ పెరిగి Dh4.28కు చేరింది.

ఇల్లు మారే సేవలపై ప్రభావం

షార్జా నుంచి దుబాయ్‌కు ఫర్నిచర్ తరలించే సమయంలో ట్రక్కులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి ఉంటుంది. దీంతో ఒక ట్రిప్ మొత్తం దూరం 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాహనం మైలేజీని బట్టి ఈ అదనపు డీజిల్ ధరతో ఒక్క రౌండ్ ట్రిప్‌కు సుమారు Dh7 నుంచి Dh17 వరకు అదనపు ఖర్చు అవుతుందని మూవింగ్ సర్వీస్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ మొత్తాన్ని కస్టమర్లపై వేయడం లేదని కొందరు మూవర్స్ తెలిపారు. నెలవారీ ఖర్చు Dh200కు మించి పెరిగితే, కొంత భాగాన్ని కస్టమర్ల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఖర్చును తగ్గించేందుకు ఒకే దిశలో వెళ్లే రెండు లేదా మూడు కస్టమర్ల సామానును ఒకే ట్రిప్‌లో తరలించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కార్ రికవరీ ఖర్చులపైనా ప్రభావం

రికవరీ ట్రక్కులు ప్రమాదానికి గురైన లేదా నిలిచిపోయిన వాహనం వద్దకు వెళ్లి, దాన్ని గ్యారేజీకి తరలించిన తర్వాత తిరిగి తమ బేస్‌కు రావాల్సి ఉంటుంది. 100 నుంచి 150 కిలోమీటర్ల రికవరీ ట్రిప్‌కు ట్రక్ మైలేజీని బట్టి పెరిగిన డీజిల్ ధర కారణంగా సుమారు Dh8 నుంచి Dh25 వరకు అదనపు ఖర్చు రావచ్చని రికవరీ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కస్టమర్ల బిల్లుల్లో ఛార్జీలు పెంచలేదని వారు తెలిపారు. ఇక ఎడారి, కొండ ప్రాంతాలకు వెళ్లే వాహనాల సంఖ్య పెరిగితే, దూర ప్రయాణాల కారణంగా ఇంధన ఖర్చులు మరింత పెరగవచ్చని పేర్కొన్నారు.

ఫుడ్ డెలివరీపై ప్రభావం తక్కువే

రెస్టారెంట్ల ప్రకారం.. ఎక్కువగా సమీప ప్రాంతాల్లోనే ఫుడ్ డెలివరీలు జరుగుతుండటంతో ఇంధన ధరల పెంపు ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. డెలివరీ బైక్‌లకు మెరుగైన ఇంధన సామర్థ్యం ఉండటం కూడా ఇందుకు కారణంగా పేర్కొన్నారు.

40 కిలోమీటర్ల మైలేజీగా లెక్కిస్తే 10 కిలోమీటర్ల డెలివరీపై పెరిగిన ఇంధన ఖర్చు సుమారు 15 ఫిల్స్ మాత్రమే అవుతుంది. వారానికి 12 నుంచి 14 లీటర్ల ఇంధనం నింపే బైక్‌కు గత నెలతో పోలిస్తే సుమారు Dh7 నుంచి Dh8 వరకు అదనపు ఖర్చు అవుతుంది.

ప్రస్తుతం మూవింగ్, కార్ రికవరీ, ఫుడ్ డెలివరీ సేవలపై వెంటనే ఛార్జీలు పెంచే ఆలోచన లేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇంధన ధరలు ఎక్కువగానే కొనసాగితే, దూర ప్రయాణాలు పెరిగితే భవిష్యత్తులో సేవల ధరలను సమీక్షించే అవకాశం ఉందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com