హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- October 03, 2026
యూఏఈ: హత్య కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు సీజ్ చేసిన అపార్ట్మెంట్లోకి అక్రమంగా ప్రవేశించి, అక్కడి వస్తువులను తొలగించిన వ్యక్తికి యూఏఈ ఫెడరల్ సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. అతడిపై విధించిన బహిష్కరణ (డిపోర్టేషన్) ఉత్తర్వులను కోర్టు తుది అప్పీల్‌లోనూ సమర్థించింది.
కోర్టు రికార్డుల ప్రకారం.. హత్య కేసులో ప్రమేయం ఉన్న మరో వ్యక్తితో కలిసి నిందితుడు ఆ అపార్ట్మెంట్లో నివసించేవాడు. హత్యకు సంబంధించిన ఆధారాలు దెబ్బతినకుండా అధికారులు ఆ ఇంటిని మూసివేసి, జ్యుడీషియల్ కంట్రోల్లో ఉంచారు.
అయితే ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ నిందితుడు తాళం పగులగొట్టి అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. అనంతరం అక్కడ ఉన్న ఫర్నిచర్‌తో పాటు ఇతర వస్తువులను బయటకు తీసుకెళ్లాడు. దీంతో అధికారులు భద్రపరిచిన నేర స్థల పరిస్థితి మారిపోయిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
కోర్టులో నిందితుడి వాదన
కింది కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి, ఒక ఏడాది జైలు శిక్షకు బదులుగా బహిష్కరణ విధించింది. అప్పీలేట్ కోర్టు కూడా ఈ తీర్పును సమర్థించడంతో అతడు ఫెడరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
తాను చట్టబద్ధమైన అద్దె ఒప్పందంతో ఆ అపార్ట్మెంట్లో నివసించానని, లీజ్ ముగిసిన తర్వాత తన వ్యక్తిగత వస్తువులను తీసుకెళ్లేందుకే ఇంట్లోకి వెళ్లానని నిందితుడు వాదించాడు. అంతేకాకుండా అధికారులు అక్కడికి వెళ్లకుండా నిషేధం విధించిన విషయం తనకు తెలియదని పేర్కొన్నాడు.
సాక్ష్యాలను పరిశీలించిన సుప్రీంకోర్టు
అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీ, దర్యాప్తు సమయంలో నిందితుడు ఇచ్చిన ప్రకటనలను కోర్టు పరిశీలించింది. అపార్ట్‌మెంట్‌ను ఎందుకు మూసివేశారని నిందితుడు గతంలో ప్రాసిక్యూషన్ అధికారులను సంప్రదించినట్లు ఆధారాలు వెల్లడించాయి. దీంతో ఆ ఇల్లు హత్య కేసుతో సంబంధం కలిగి ఉందని, అక్కడికి వెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయని అతడికి ముందే తెలుసని కోర్టు పేర్కొంది.
దర్యాప్తు గురించి తెలిసినప్పటికీ అపార్ట్మెంట్లోకి బలవంతంగా ప్రవేశించి, అక్కడి వస్తువులను తొలగించడం ద్వారా నేరానికి సంబంధించిన ఆధారాలను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది. దీంతో అతడి అప్పీల్‌ను ఫెడరల్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దోష నిర్ధారణతో పాటు డిపోర్టేషన్ ఉత్తర్వులు కూడా తుది నిర్ణయంగా మారాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!
- కువైట్ విమానాశ్రయంలో డ్రగ్స్ రవాణా యత్నాలు భగ్నం..!!
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!







