డుక్మ్ స్పేస్‌పోర్ట్‌.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!

- October 03, 2026 , by Maagulf
డుక్మ్ స్పేస్‌పోర్ట్‌.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!

డుక్మ్: ఒమన్‌లోని డుక్మ్ స్పేస్‌పోర్ట్‌ నుంచి ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. కర్మాన్ X1 స్పేస్ మిషన్ లో భాగంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 4.3 మీటర్ల పొడవు, 26 కిలోల బరువు ఉన్న రాకెట్‌ను డుక్మ్‌లోని ‘ఇట్లాక్’ స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించారు. రాకెట్ పైకి స్థిరమైన మార్గంలో ప్రయాణించడంతో పాటు, ప్రయాణానికి సంబంధించిన డేటాను మిషన్ కంట్రోల్ సెంటర్‌కు ఖచ్చితంగా ప్రసారం చేసింది. నిర్ణయించిన పరీక్షా ఎత్తుకు రాకెట్ విజయవంతంగా చేరుకుంది.

అంతరిక్షంలోకి వెళ్లేందుకు కాదు..

ఈ ప్రయోగం రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించినది కాదని అధికారులు తెలిపారు. ప్రయోగ ప్రక్రియ, రాకెట్ ప్రయాణ సమయంలో పనితీరు, మిషన్‌లో ఉపయోగించిన సాంకేతికతలు, వ్యవస్థలను పరీక్షించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. కర్మాన్ X1.. డుక్మ్ స్పేస్‌పోర్ట్‌ నుంచి విజయవంతమైన రెండో ప్రయోగం. 2024 డిసెంబర్‌లో నిర్వహించిన డుక్మ్-1 ప్రయోగం తర్వాత ఈ విజయాన్ని సాధించారు.

అంతర్జాతీయ భాగస్వామ్యాలకు వేదికగా డుక్మ్

ప్రయోగ స్థలాన్ని సిద్ధం చేయడం, రాకెట్ భాగాల అనుసంధానానికి సహకరించడం, ప్రయోగ ప్రాంతంలో భద్రతా చర్యలను నిర్వహించడం వంటి బాధ్యతలను ఒమన్ స్పేస్‌పోర్ట్ బృందం చేపట్టింది. 2024లో లాంచ్ సంస్థ ఏర్పాటు చేసిన ‘ఫార్మేషన్’ కార్యక్రమంలో భాగంగా ఈ మిషన్‌ను నిర్వహించారు. సబ్‌ఆర్బిటల్, ప్రయోగాత్మక రాకెట్ ప్రయోగాలను వేగంగా, సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

కర్మాన్ X1 మిషన్‌లో ఒమన్‌కు చెందిన లాంచ్ ఆపరేటర్ స్టెల్లార్ కైనటిక్స్ MCT, సింగపూర్‌కు చెందిన OculloSpace, ఆస్ట్రేలియాకు చెందిన Orbit2Orbit సంస్థలు కలిసి పనిచేశాయని డుక్మ్ స్పేస్‌పోర్ట్‌ సీఈఓ హెచ్‌హెచ్ సయ్యద్ అజ్జాన్ బిన్ ఖైస్ అల్ సయీద్ తెలిపారు. వివిధ దేశాలకు చెందిన సంస్థలను ఒకే మిషన్‌లో భాగస్వామ్యం చేయగల సామర్థ్యాన్ని ఈ ప్రయోగం చూపించిందన్నారు. వరుస మిషన్ల ద్వారా ఒమన్‌లో ప్రయోగ కార్యకలాపాలపై నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

ఒమన్ అంతరిక్ష రంగానికి ఊతం

ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో డుక్మ్ స్పేస్‌పోర్ట్ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందుతోంది. దేశంలో పెట్టుబడులను ఆకర్షించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం, అంతరిక్ష రంగంలో సాంకేతికతను స్థానికంగా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com