ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- October 05, 2026
దోహా: పిల్లలు ఆన్‌లైన్‌లో గడిపే సమయం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, డిజిటల్ టెక్నాలజీ వల్ల ఎదురయ్యే ప్రమాదాల నుంచి వారిని రక్షించేందుకు కుటుంబాల పాత్ర ఎంతో కీలకమని ఖతార్ ఫౌండేషన్ నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పిల్లలు, కుటుంబాలు, డిజిటల్ వెల్‌బీయింగ్‌పై నిర్వహించిన పరిశోధనల ఆధారంగా ఖతార్ ఫౌండేషన్.. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డిజిటల్ అవేర్ ఫ్యామిలీ ప్రచారానికి తన పరిశోధనా ఆధారాలు, నిపుణుల సూచనలను అందిస్తోంది.
ఖతార్ సామాజిక అభివృద్ధి, కుటుంబ మంత్రిత్వ శాఖ ఈ 14 వారాల జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. పిల్లలను సురక్షితంగా, బాధ్యతాయుతంగా టెక్నాలజీ వినియోగించేలా కుటుంబాలు మార్గనిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతున్న ఈ ప్రచారంలో 120కి పైగా విద్యా కార్యక్రమాలు, వీడియోలు, గైడ్లు, మీడియా కంటెంట్, వర్క్‌షాపులు, ఉపన్యాసాలు, పాఠశాల సందర్శనలు, తల్లిదండ్రులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రోజుకు 4.5 గంటలు ఆన్‌లైన్‌లో..
ఖతార్ ఫౌండేషన్‌కు చెందిన దోహా ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్ (DIFI), ఖతార్ యూనివర్సిటీతో కలిసి 2024లో నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1,607 మంది ఖతారీ తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి సేకరించిన సమాచార ప్రకారం.. 81% మంది పిల్లలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. వారు రోజుకు సగటున 4.5 గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. ఇంటర్నెట్ వల్ల సమాచారం పొందడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, సామాజిక సంబంధాలను కొనసాగించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. అయితే 41% మంది తల్లిదండ్రులు తమ పిల్లల నిద్ర విధానాలపై ఇంటర్నెట్ వినియోగం ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.
సోషల్ మీడియాతో కుటుంబ సంబంధాలపై ప్రభావం
2026లో DIFI, వర్సిటీతో కలిసి నిర్వహించిన మరో అధ్యయనంలో 1,017 మంది ఖతారీ పౌరులను పరిశీలించారు. ఈ సర్వేలో 76% మంది కుటుంబ సభ్యులు సోషల్ మీడియా కారణంగా పరధ్యానానికి గురవుతున్నారని చెప్పారు. అలాగే 71% మంది చిన్న వయసు కుటుంబ సభ్యులు పెద్దల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలిపారు. అయితే కేవలం 54% కుటుంబాల్లో మాత్రమే సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి నియమాలు ఉన్నట్లు వెల్లడైంది.
టీనేజర్లలో మరింత ఎక్కువ వినియోగం
2023లో DIFI నిర్వహించిన మరో అధ్యయనంలో 10 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లలు, వారి తల్లిదండ్రుల డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. సగటు విద్యా ప్రదర్శన ఉన్న టీనేజర్లు వారంలో పని దినాల్లో రోజుకు సుమారు 10 గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. మంచి విద్యా ప్రదర్శన ఉన్న విద్యార్థులు సుమారు 7 గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. అదే సమయంలో 30% మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను చాలా అరుదుగా మాత్రమే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
స్క్రీన్ టైమ్ తగ్గించడం ఒక్కటే పరిష్కారం కాదు
డిజిటల్ భద్రత అంటే కేవలం పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం లేదా వారి మొబైల్ ఫోన్లను పర్యవేక్షించడం మాత్రమే కాదని DIFI నిపుణులు చెబుతున్నారు. కుటుంబాలకు సరైన సమాచారం, డిజిటల్ పరిజ్ఞానం, నమ్మకం, ఆచరణాత్మక సాధనాలు అందించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా 98.28% మంది తల్లిదండ్రులు అధిక ఇంటర్నెట్ వినియోగాన్ని ఎదుర్కోవడంలో సహాయపడే స్థానిక సేవల గురించి తమకు తెలియదని సర్వేలో వెల్లడైంది. దీంతో పిల్లలు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా ఒక రకమైన సపోర్ట్ గ్యాప్ ను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
కుటుంబాలే డిజిటల్ భద్రతకు కేంద్రబిందువు
DIFI 2026 అధ్యయనం ప్రకారం, ఖతార్ కుటుంబాల్లో బలమైన అనుబంధం కొనసాగుతోంది. 99% మంది కుటుంబంతో తమకు బలమైన అనుబంధం ఉందని, 98% మంది కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఆదరిస్తూ, శ్రద్ధ చూపుతారని, 97% మంది కష్టకాలంలో కుటుంబం తమకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ బలమైన కుటుంబ వ్యవస్థను డిజిటల్ భద్రతకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల డిజిటల్ భద్రత బాధ్యత కేవలం ప్రభుత్వాలు లేదా పాఠశాలలపై మాత్రమే ఉండకూడదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ రంగం, కమ్యూనిటీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు
పిల్లలు, యువతను టెక్నాలజీ వల్ల వచ్చే కొత్త సవాళ్ల నుంచి రక్షించేందుకు ఖతార్‌లో చిల్డ్రన్ మరియు యూత్ డిజిటల్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొత్త డిజిటల్ ప్రమాదాలను పరిశీలించడం, విధానాల రూపకల్పనకు సహకరించడం, అవసరమైన చట్టపరమైన, సాంకేతిక చర్యలపై సిఫారసులు చేయడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇక eSafety.qa పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఖతార్ సామాజిక అభివృద్ధి, కుటుంబ మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ భద్రతపై కుటుంబాలకు నమ్మకమైన సమాచారం, మార్గదర్శకాలు, సహాయాన్ని అందించడం దీని ఉద్దేశ్యమరి తెలిపారు.
తాజా వార్తలు
- UAE Floating Hospital receives 12 new patients from Gaza under Operation Chivalrous Knight 3
- UAE, Moldova explore new opportunities to deepen economic, investment partnership
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్







