నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

- October 05, 2026 , by Maagulf
నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా "గురజాడ నాటక శిక్షణ" పేరిట ప్రత్యేక నాటక శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో ఆర్టీ నంబర్ 1933) జారీ చేసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ.. అర్హత కలిగిన నాటక సమాజాలు, నాటక పరిషత్తులు, గుర్తింపు పొందిన నాటక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర తగిన భాగస్వామ్య సంస్థల సహకారంతో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించబడతాయని తెలిపారు. ఇందుకోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 20 లక్షల వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ శిక్షణల ద్వారా బాలల నాటక శిక్షణ, యువజన నాటక శిక్షణ, నాటక రచయితలు,దర్శకుల శిక్షణ, మేకప్ అలాగే సాంకేతిక రంగాలలో నిపుణుల ద్వారా శిక్షణ అందించబడుతుందని, ఫ్యాకల్టీ గౌరవ వేతనాలు మరియు ఇతర ఖర్చుల వివరాలను జీవోలో స్పష్టంగా పొందుపరిచామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఎఫ్ డీసీ ఎంతో చురుగ్గా పనిచేస్తోందన్నారు. బోర్డు ఏర్పాటైన అనతికాలంలోనే ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన నంది ఫిల్మ్, టీవీ అవార్డులు, నంది నాటకోత్సవాలు,కందుకూరి పురస్కారాలను ప్రకటించామని గుర్తుచేశారు. డిసెంబర్‌లో అమరావతి లేదా విజయవాడ వేదికగా నంది చలనచిత్ర పురస్కారాలు, తిరుపతి వేదికగా నంది టీవీ అవార్డులను అందజేస్తామని, అలాగే జనవరి నెలలో నంది నాటకోత్సవాలు,కందుకూరి పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు మరోమారు స్పష్టం చేశారు.

కళాకారులను అత్యుత్తమ ప్రమాణాలతో నాటకోత్సవాలకు సన్నద్ధం చేసేందుకు ఈ శిక్షణా శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగు నాటక రంగానికి మహాకవి గురజాడ వెంకట అప్పారావు అందించిన అమూల్యమైన సేవలను స్మరించుకుంటూ, ఆయన 164వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ శిక్షణా కార్యక్రమాలను ఆయన పేరు మీదే నిర్వహించాలని ఎఫ్.డి.సి అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఈ శిబిరాల విజయవంతానికి తగిన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అంతరించిపోతున్న కళలను పరిరక్షించడమే ప్రభుత్వ బాధ్యత అని,  సాంకేతికంగా ఎన్ని డిజిటల్ యుగాలు మారినా సజీవ కళల గొప్పతనం ఎప్పటికీ శాశ్వతమే అని మంత్రి దుర్గేష్ తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com