జనరేషన్-జెడ్‌లో సోషల్ మీడియా వినియోగంతో మానసిక, శారీరక సమస్యలు..!!
- October 07, 2026
మస్కట్: ఒమన్‌లో యువత అధికంగా సోషల్ మీడియాను వినియోగించడం వల్ల మానసిక, సామాజిక, శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, నిద్ర సమస్యలు, కళ్లపై ఒత్తిడి, శారీరక చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు సోషల్ మీడియా అధిక వినియోగంతో సంబంధం కలిగి ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. ‘ఒమన్ సుల్తానేట్‌లో జనరేషన్-జెడ్ ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావాలు’ పేరుతో ఈ అధ్యయనాన్ని అరబ్ ఓపెన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రహ్మణియన్ ముత్తురామన్ నేతృత్వంలో నిర్వహించారు.
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అథారిటీ బ్లాక్ ఫండింగ్ ప్రోగ్రామ్ ద్వారా పరిశోధనకు నిధులు అందించారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న యువతలో సోషల్ మీడియా వినియోగ అలవాట్లు, భాగస్వామ్యం, వినోదం, సానుకూల–ప్రతికూల ప్రభావాలు, ప్రవర్తనా మార్పులను పరిశోధకులు విశ్లేషించారు. మొత్తం 138 మంది యాక్టివ్ సోషల్ మీడియా వినియోగదారులను అధ్యయనంలో భాగంగా తీసుకున్నారు.
ఆరు అంశాలపై పరిశీలన
వినియోగ అలవాట్లు, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్, వినోదం, సానుకూల ప్రభావాలు, ప్రతికూల ప్రభావాలు, ప్రవర్తనా ప్రభావం అనే ఆరు అంశాలను పరిశోధకులు పరిశీలించారు. విశ్లేషణలో ఈ ఆరు అంశాలూ సోషల్ మీడియా మొత్తం ప్రభావాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. యువత రోజువారీ జీవితంలో సోషల్ మీడియా కీలక భాగంగా మారిందని అధ్యయనం పేర్కొంది. చాలా మంది ప్రతిరోజూ సోషల్ మీడియాను వినియోగిస్తుండగా, పలువురు రోజులో కొన్ని గంటలు వివిధ ప్లాట్‌ఫారమ్‌లపై గడుపుతున్నట్లు వెల్లడైంది. సోషల్ మీడియా కమ్యూనికేషన్, పరస్పర అనుసంధానాన్ని పెంచుతున్నప్పటికీ.. ఇతరులతో పోల్చుకోవడం, తోటి వారి ఒత్తిడి, ముఖాముఖి సంబంధాల్లో మార్పులకు కూడా దారితీస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
అధికంగా సోషల్ మీడియాను వినియోగించే యువతలో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, మూడ్‌లో మార్పులు, ఏకాగ్రత తగ్గడం వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కనిపించినట్లు డాక్టర్ సుబ్రహ్మణియన్ తెలిపారు. అలాగే సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉన్న వారిలో నిద్ర నాణ్యత తగ్గినట్లు అధ్యయనం వెల్లడించింది. కొంతమందిలో డిజిటల్ అలసట, సోషల్ మీడియాను పదేపదే చెక్ చేయాలనే తప్పనిసరి అలవాటు, ఆన్లైన్ నుంచి దూరంగా ఉండటంలో ఇబ్బంది వంటి ప్రవర్తనా లక్షణాలు కూడా గుర్తించారు.
శారీరక ఆరోగ్య సమస్యలు
అధిక సోషల్ డియా వినియోగంతో కళ్లపై ఒత్తిడి, తలనొప్పులు, నిద్ర వేళల్లో అసమతుల్యత, శారీరక చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు కూడా సంబంధం కలిగి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. యువత ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను అలవరచుకోవాల్సిన అవసరం ఉందని, ఆన్లైన్ కార్యకలాపాలు తమ మానసిక లేదా శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయా అనే విషయాన్ని గుర్తించాలని పరిశోధకులు సూచించారు. సోషల్ మీడియా అధిక వినియోగంతో ముడిపడి ఉన్న మానసిక, శారీరక ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు డిజిటల్ వెల్బీయింగ్ మార్గదర్శకాలు, అవగాహన కార్యక్రమాలు రూపొందించాలని పరిశోధక బృందం సూచించింది.
తాజా వార్తలు
- పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ
- దసరా పండక్కి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్..
- ఇరాన్ హోం మంత్రితో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి భేటీ..!!
- సహెల్ యాప్‌లో పీఏసీఐకి చెందిన 34 సేవలు..!!
- యూఏఈలో ఆహార పదార్థాలకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే Dh500,000 వరకు ఫైన్..!!
- సౌదీ అరేబియా, బహ్రెయిన్ మధ్య చారిత్రక, బలమైన బంధం..!!
- జనరేషన్-జెడ్‌లో సోషల్ మీడియా వినియోగంతో మానసిక, శారీరక సమస్యలు..!!
- సౌదీ అరేబియాకు ఈజిప్ట్, జోర్డాన్ సంఘీభావం..!!
- భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష







