దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు

- October 08, 2026 , by Maagulf
దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు

దుబాయ్: దుబాయ్‌లో ప్రాంతాలను సులభంగా గుర్తించేందుకు కొత్త తరహా స్ట్రీట్ సూచికలు, ప్రాంతాల పేర్లు, ఇళ్ల నంబర్ ప్లేట్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రాంతాల ప్రత్యేకతకు అనుగుణంగా రంగులను ఉపయోగించే ఈ కొత్త విధానం 2026 నాలుగో త్రైమాసికం నుంచి దశలవారీగా అమలు కానుంది. 2030 నాటికి ఎమిరేట్‌లోని 186 ప్రాంతాలకు ఈ కొత్త వ్యవస్థను విస్తరించనున్నారు.

మొదటి దశలో 2,000కు పైగా సూచికలను ఏర్పాటు చేయడం లేదా ప్రస్తుత సూచికలను మార్చడం జరుగుతుంది. జాబీల్ 1, జాబీల్ 2, నాద్ అల్ షెబా, అల్ ఖవానీజ్ 1, నజ్వా ప్రాంతాల్లో తొలి దశ పనులు చేపట్టనున్నారు.

కొత్త సూచికల్లో ప్రాంతాల స్వభావాన్ని ప్రతిబింబించేలా ఐదు రంగులను ఉపయోగించనున్నారు. ఉదాహరణకు సముద్రానికి సమీపంలోని ప్రాంతాలకు నీలం రంగును, ఎడారి ప్రాంతాలకు బంగారు రంగును కేటాయించనున్నారు.

సుప్రీం కమిటీ ఫర్ అర్బన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA), దుబాయ్ మునిసిపాలిటీ సమన్వయంతో ఈ కొత్త అడ్రెస్సింగ్ వ్యవస్థను రూపొందించారు. ఇందులో ప్రాంతాలు, సెక్టార్లను సూచించే బోర్డులు, వీధి పేర్ల సూచికలు, ఇళ్ల నంబర్ ప్లేట్లు ఉంటాయి.

కొత్త డిజైన్‌ల ద్వారా నివాసితులు, పర్యాటకులు దుబాయ్‌లోని ప్రాంతాలను సులభంగా గుర్తించడంతో పాటు తమ గమ్యస్థానాలకు చేరుకోవడం మరింత సులభం అవుతుందని RTA తెలిపింది.

ఇళ్ల నంబర్ ప్లేట్లపై ప్రతి ఆస్తికి సంబంధించిన మకానీ (Makani) నంబర్‌తో పాటు QR కోడ్ కూడా ఉంటుంది. QR కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత ప్రాంతం, సెక్టార్, వీధి పేర్లు, సమీపంలోని ప్రముఖ ప్రదేశాలు తదితర సమాచారాన్ని పొందవచ్చు.

భవిష్యత్తులో ఇదే కొత్త గుర్తింపు విధానాన్ని బస్ స్టాప్‌లు, మొబైల్ అప్లికేషన్లు, ప్రాంతాల మ్యాప్ బోర్డులకు కూడా విస్తరించనున్నట్లు RTA వెల్లడించింది.

ఈ కొత్త అడ్రెస్సింగ్ వ్యవస్థను 2026 నాలుగో త్రైమాసికం నుంచి 2030 వరకు దశలవారీగా అమలు చేయనున్నారు. జనాభా సాంద్రత, జనాభా వృద్ధి, నివాస మరియు పర్యాటక ప్రాంతాల ఉనికి, అధికారిక చిరునామాలు లేని వీధుల సంఖ్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రాంతాలకు ప్రాధాన్యత కేటాయించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com