గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

- October 08, 2026 , by Maagulf
గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

హైదరాబాద్‌: గ్రామీణ కళాకారులు, చేనేత కార్మికుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ కల్పించి, వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా చూడాలని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో చేనేత, హస్తకళలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

యెల్లారెడ్డిగూడలోని కమ్మ సంఘం హాల్‌లో నాబార్డ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రామీణ భారత్‌ మహోత్సవ్‌–తెలంగాణ 2026’ చేనేత, హస్తకళల ప్రదర్శన–విక్రయ కార్యక్రమాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. 

చేనేత, హస్తకళల స్టాల్ లను గవర్నర్  సందర్శించారు ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా 64 లక్షలకు పైగా కళాకారులు, చేనేత కార్మికులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారని, వారిలో 65–70 శాతం మహిళల భాగస్వామ్యం ఉండటం విశేషమన్నారు. వస్త్ర ఉత్పత్తిలో చేనేత రంగం 15 శాతం వాటా కలిగి ఉండగా, రూ.33 వేల కోట్లకు పైగా హస్తకళల ఎగుమతులు జరుగుతున్నాయని తెలిపారు.

ఒక చీర తయారీకి నెలల తరబడి శ్రమించే కళాకారుడికి ఉత్పత్తి ధరలో తగిన వాటా దక్కాలని గవర్నర్‌ అన్నారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా కళాకారులకు నేరుగా మార్కెట్‌ అవకాశాలు కల్పించాలని సూచించారు. నాణ్యత, ఆధునిక డిజైన్లు, మార్కెటింగ్‌ను మెరుగుపర్చడం ద్వారా చేనేత, హస్తకళలకు మరింత ఆదరణ తీసుకురావచ్చన్నారు. స్థానిక, చేతితో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు కళాకారులకు అండగా నిలవాలని కోరారు.

పోచంపల్లి ఇకత్‌, గద్వాల్‌, నారాయణపేట, గొల్లభామ చీరలు, నిర్మల్‌ కళ, పెంబర్తి లోహ కళ, చేర్యాల చిత్రకళ, ఆదిలాబాద్‌ డోక్రా వంటి తెలంగాణ సంప్రదాయ కళలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 59 వేల మందికి పైగా చేనేత కార్మికులు, కళాకారులు ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉత్పత్తి, మార్కెటింగ్‌, ఆదాయ అవకాశాలు పెరుగుతున్నాయని, గ్రామీణ మహిళలను చిన్నతరహా వ్యాపారాలతో అనుసంధానించడం ద్వారా ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని గవర్నర్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కళాకారుల బృందాలు, స్వయం సహాయక సంఘాలను మార్కెట్‌తో అనుసంధానిస్తున్న నాబార్డ్‌ కృషిని అభినందించారు.

మహోత్సవంలో 35 జీఐ ఉత్పత్తులను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. తెలంగాణకు చెందిన మరికొన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు కోసం జరుగుతున్న ప్రయత్నాలు గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడతాయని చెప్పారు. గ్రామీణ కళాకారులు అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములైనప్పుడే ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం సాకారమవుతుందని, స్థానిక ఉత్పత్తులకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నాబార్డ్‌ తెలంగాణ CGM బి.ఉదయ భాస్కర్‌, నాబార్డ్‌ తెలంగాణ GM పి. రామలక్ష్మి; నాబార్డ్‌ ప్రతినిధులు, కళాకారులు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామీణ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com