కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!

- October 10, 2026 , by Maagulf
కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!

కువైట్ : రోడ్డుపై వ్యర్థాలను పారబోసి పరిసరాలను అపరిశుభ్రం చేసిన బంగ్లాదేశ్‌కు చెందిన ట్రక్ డ్రైవర్‌ను కువైట్ ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, సంబంధిత వాహనాన్ని నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ట్రక్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై కేసులు నమోదు చేసి, దేశ బహిష్కరణ ప్రక్రియకు సిద్ధమవుతున్నారు.

ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన

కువైట్‌లోని జబ్రియా ప్రాంతంలో ఓ ట్రక్ డ్రైవర్ రోడ్డుపై వ్యర్థాలను పారబోసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో ట్రాఫిక్ రెగ్యులేషన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ కంట్రోల్ విభాగం అధికారులు విచారణ చేపట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు రవాణా వాహనాన్ని నడిపేందుకు అవసరమైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నట్లు గుర్తించారు.

వాహనం స్వాధీనం.. దేశ బహిష్కరణకు చర్యలు

రోడ్డును అపరిశుభ్రం చేసేలా వ్యర్థాలను పారబోసినందుకు, సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు అతడిపై ట్రాఫిక్ ఉల్లంఘనల కింద చర్యలు తీసుకున్నారు. అనంతరం అతడిని ట్రాఫిక్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. దేశ బహిష్కరణకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనల ప్రకారం ట్రక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రోడ్డు భద్రతను కాపాడటంతో పాటు ప్రజా ప్రదేశాల్లో పరిశుభ్రతను నిర్వహించేందుకు ఇలాంటి ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు కొనసాగిస్తామని కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com