యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- October 10, 2026
దుబాయ్: యూఏఈలో హత్య కేసులకు సంబంధించిన శిక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. బాధితుడి వారసులు కిసాస్ (ప్రతీకార శిక్ష) హక్కును వదులుకున్న సందర్భాల్లో నిందితులకు విధించే కనీస జైలు శిక్షను 7 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచింది. గరిష్ఠ శిక్షను కూడా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచుతూ చట్ట సవరణలు చేసింది.
అక్టోబర్ 8న ప్రకటించిన UAE Crimes and Penalties Law సవరణలో భాగంగా ఈ మార్పులు తీసుకొచ్చారు. ఫెడరల్ డిక్రీ-లా ఆర్టికల్ 384(3)లో చేసిన సవరణ ప్రకారం, న్యాయ ప్రక్రియలో ఏ దశలోనైనా లేదా శిక్ష అమలు చేయడానికి ముందే బాధితుడి చట్టబద్ధ వారసులు కిసాస్ హక్కును వదులుకుంటే 15 నుంచి 20 ఏళ్ల మధ్య జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
క్షమాభిక్షతో నేర బాధ్యత ముగియదు
న్యాయ నిపుణుడు డా. హసన్ ఎల్హైస్ వివరాల ప్రకారం, గత చట్టంలో కిసాస్ హక్కును బాధితుడి వారసులు వదులుకున్నప్పుడు కనీసం ఏడేళ్ల తాత్కాలిక జైలు శిక్ష ఉండేది. తాజా సవరణతో శిక్షా పరిమితిని 15 నుంచి 20 ఏళ్లకు నిర్ణయించారు.
బాధితుడి వారసులు కిసాస్ను మాఫీ చేసినప్పటికీ నిందితుడి క్రిమినల్ బాధ్యత పూర్తిగా తొలగిపోదని ఆయన తెలిపారు.కిసాస్ మినహాయింపు అనేది బాధితుడి వారసుల ప్రతీకార హక్కుకు సంబంధించినదే తప్ప, సమాజం పట్ల నిందితుడి బాధ్యతను తొలగించదని వివరించారు.
కిసాస్ అంటే ఏమిటి?
ఇస్లామిక్ చట్టంలో గుర్తింపు పొందిన ప్రతీకార న్యాయ విధానాన్ని కిసాస్గా పేర్కొంటారు. ఉద్దేశపూర్వక హత్య కేసుల్లో, చట్టపరమైన నిబంధనలు మరియు కోర్టు తీర్పుకు లోబడి కిసాస్ కింద మరణశిక్ష విధించే అవకాశం ఉంటుంది.
అయితే బాధితుడి చట్టబద్ధ వారసులకు కిసాస్ను మాఫీ చేసే హక్కు ఉంటుంది. ఈ మినహాయింపు క్రిమినల్ కేసును పూర్తిగా ముగించదు. సమాజంలో ప్రాణాల రక్షణ, తీవ్రమైన నేరాలను నిరోధించేందుకు ప్రత్యేక శిక్షను చట్టం కొనసాగిస్తుంది.
కుటుంబం క్షమించినా మరణశిక్ష అవకాశం ఉంటుందా?
కిసాస్ను చట్టబద్ధంగా మాఫీ చేసినప్పుడు వారసుల ప్రతీకార హక్కు తొలగుతుంది. అయితే వేరే నేరానికి సంబంధించి చట్టం ప్రకారం మరణశిక్షకు అవకాశం ఉంటే, కిసాస్ మాఫీ చేసినంత మాత్రాన ఆ అవకాశం పూర్తిగా తొలగిపోదని డా. ఎల్హైస్ తెలిపారు.
అలాగే, 15 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పరిధిలో నిందితుడికి ఎంత శిక్ష విధించాలన్నది నేర పరిస్థితులు, వర్తించే శిక్షా నిబంధనలను పరిశీలించి కోర్టు నిర్ణయిస్తుంది.
ఆత్మహత్యాయత్నాన్ని ఇక నేరంగా పరిగణించరు
కొత్త చట్ట సవరణల్లో మరికొన్ని కీలక మార్పులు కూడా ఉన్నాయి. ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించే నిబంధనను తొలగించారు. శిక్ష విధించడం కంటే నివారణ, చికిత్స, సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ మార్పు ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
అదే సమయంలో ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా సహాయం చేయడంపై పరిస్థితులను బట్టి గ్రాడ్యుయేటెడ్ పెనాల్టీలు ప్రవేశపెట్టారు. ప్రేరేపించడం లేదా సహాయం చేయడం వల్ల మరణం సంభవిస్తే 5 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







