తొలి డీఎస్పీ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు

- October 12, 2026 , by Maagulf
తొలి డీఎస్పీ బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు

హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ అకాడమీ (TGPA)లో 112 మంది డీఎస్పీ ఆఫీసర్‌ ట్రైనీలు శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.వీరి పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు తెలంగాణ డీజీపీ సి.వి.ఆనంద్‌, ఐపీఎస్‌ హాజరై అధికారులకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ ద్వారా నియామకమైన తొలి బ్యాచ్‌గా, శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వస్తున్న తొలి డీఎస్పీ బ్యాచ్‌గా ఈ బృందం ప్రత్యేకతను సంతరించుకుంది. మొత్తం 44 వారాల పాటు నిర్వహించిన కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఈ అధికారులు త్వరలో జిల్లాల్లో క్షేత్రస్థాయి శిక్షణ పొందనున్నారు.

ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలి: డీజీపీ సి.వి.ఆనంద్‌
తెలంగాణ జనాభాలో కేవలం 0.3 శాతం మందికి మాత్రమే పోలీస్‌ యూనిఫాం ధరించే అవకాశం లభిస్తుందని డీజీపీ సి.వి.ఆనంద్‌ పేర్కొన్నారు. ఈ గౌరవాన్ని బాధ్యతగా భావిస్తూ నాయకత్వ లక్షణాలు, నిజాయితీ, ప్రజాసేవ అనే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పోలీస్‌ శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లపై డీజీపీ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్‌ రద్దీ, ఆహార కల్తీ, వ్యవస్థీకృత నేర ముఠాల కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సవాళ్లను అరికట్టేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ చేపడుతున్న ప్రత్యేక చర్యలను వివరించారు.

పదవీ విరమణ వరకు ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి
పోలీసు అధికారుల వృత్తి జీవితంలో శారీరక దృఢత్వం, ఆరోగ్యం కీలకమని డీజీపీ స్పష్టం చేశారు. శిక్షణ సమయంలో అలవర్చుకున్న ఫిట్‌నెస్‌ను ఉద్యోగ జీవితమంతా కొనసాగించాలని సూచించారు.

“ఈ రోజు మీ బెల్టును ఏ రంధ్రానికి పెట్టుకుంటున్నారో.. పదవీ విరమణ చేసే రోజు కూడా అదే రంధ్రానికి పెట్టుకునేంత ఫిట్‌నెస్‌ను కొనసాగించాలి” అని డీజీపీ ఆకాంక్షించారు.
శిక్షణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ట్రోఫీలు అందజేసిన ఆయన, కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న డీఎస్పీలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com