బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!

- October 14, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!

మనామా: బహ్రెయిన్ పౌరులకు ట్రాఫిక్ సేవలపై వసూలు చేసే ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పార్లమెంటరీ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నిర్ణయం అమలు చేస్తే ప్రభుత్వ బడ్జెట్‌పై అదనపు భారం పడుతుందని, ఆర్థిక సమతుల్యతపై ప్రభావం పడటంతో పాటు చమురేతర ఆదాయాల స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది.

పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అలీ మాజిద్ అల్ నుఐమీ ఈ ప్రతిపాదనను సమర్పించారు. దీనికి ప్రతినిధుల మండలి ఆమోదం కూడా తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అందించే అన్ని సేవలపై బహ్రెయిన్ పౌరులకు ఫీజుల మినహాయింపు కల్పించాలని ప్రతిపాదించారు.

ట్రాఫిక్ సేవల కోసం అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పౌరులకు ఉపశమనం కల్పించడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని డాక్టర్ అలీ మాజిద్ అల్ నుఐమీ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సులు పొందడం, ట్రాఫిక్ నిబంధనలు, ఇతర అధికారిక ప్రక్రియలకు సంబంధించిన సేవలను సులభంగా వినియోగించుకునేందుకు ఈ మినహాయింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను కాపాడటంతో పాటు ట్రాఫిక్ చట్టాల అమలును ప్రోత్సహించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించారు.

ట్రాఫిక్ సేవలపై వసూలు చేసే ఫీజులు ప్రభుత్వానికి లాభాలు సమకూర్చే ఉద్దేశంతో విధించినవి కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులకు సేవలు అందించడానికి అయ్యే ఖర్చులను భర్తీ చేసేందుకే వీటిని వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఫీజులను పూర్తిగా రద్దు చేస్తే ఆ ఖర్చులన్నీ ప్రభుత్వ బడ్జెట్‌పై పడతాయని వివరించింది. 

ప్రభుత్వం ప్రతినిధుల మండలికి సమర్పించిన లిఖితపూర్వక వివరణలో, వ్యక్తులకు అందించే నిర్దిష్ట సేవలకు సంబంధించి ప్రభుత్వ ఫీజులు వసూలు చేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీటిలో పత్రాల తయారీ, తనిఖీలు, లైసెన్సుల జారీ వంటి పరిపాలనా ప్రక్రియలు ఉన్నాయని తెలిపింది.

2014 ట్రాఫిక్ చట్టాన్ని ప్రస్తావించిన ప్రభుత్వం

ట్రాఫిక్ సేవలు, వాటికి వర్తించే ఫీజులు, మినహాయింపులు మంజూరు చేసే పరిస్థితులను ట్రాఫిక్ చట్టం నంబర్ 23 ఆఫ్ 2014 నిర్దేశిస్తోందని ప్రభుత్వం గుర్తుచేసింది. సేవలను అందించడానికి వాస్తవంగా అయ్యే ఖర్చులకు అనుగుణంగానే ఫీజులను నిర్ణయిస్తున్నట్లు వివరించింది. ఫీజుల మినహాయింపు ప్రతిపాదన వల్ల పౌరులకు ఆర్థిక ఉపశమనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com