అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!

- October 14, 2026 , by Maagulf
అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!

మస్కట్: ఒమన్‌లోని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాయల్ పైథాన్‌ పాములను అక్రమంగా దేశంలోకి తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. పర్యావరణ సంస్థ (EA), రాయల్ ఒమన్ పోలీస్ (ROP), కస్టమ్స్ డైరెక్టరేట్ జనరల్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పలువురు రాయల్ పైథాన్‌ పాములను అవసరమైన అనుమతులు లేకుండా ఒమన్‌లోకి తీసుకురావడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అంతర్జాతీయ వన్యప్రాణుల వాణిజ్య నిబంధనల ఉల్లంఘన

రాయల్ పైథాన్‌ పాములు అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షజాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్‌ (CITES)లోని అపెండిక్స్‌ II జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న జాతుల అంతర్జాతీయ వాణిజ్యంపై నియంత్రణలు వర్తిస్తాయి. అవసరమైన అనుమతులు లేకుండా ఈ పాములను దిగుమతి చేసుకోవడం ఒమన్ వన్యప్రాణుల వాణిజ్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించడమేనని అధికారులు తెలిపారు.

నిందితుడిపై చట్టపరమైన చర్యలు

ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అక్రమ వన్యప్రాణుల రవాణాను అడ్డుకోవడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com