టాన్సిల్స్ కు సహజసిధ్ధ ఆయుర్వేద చికిత్స
- August 25, 2016ఏదైనా తినాలంటే గుటక వేయలేకపోవటం, గొంతు ప్రదేశంలో వాచి చెప్పలేనంత నొప్పి రావటం.. ఇవే టాన్సిల్స్, అడినాయిడ్స్ గొంతులో వేర్వేరు ప్రదేశాల్లో ఎక్కడైనా రావచ్చు. ఇవి రెండూ ఒకే రకానికి చెందినవే అని చెప్పవచ్చు. అయితే టాన్సిల్స్ జీవితాంతం అలాగే ఉంటాయి. వయస్సు పరిణామ క్రమంలో వీటి సైజు కొంత వరకూ తగ్గే అవకాశం ఉండొచ్చు అని చేప్పవచ్చు. కానీ పూర్తిగా తగ్గిపోతాయని రూఢీగా చేప్పలేము.
టాన్సిల్స్
టాన్సిల్స్ విషయానికొస్తే సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ ఇది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలు స్కూళ్లల్లోనో కలిసి ఆడుతున్నప్పుడు ఒకరి నుంచి ఒకరికి బాక్టీరియా, వైరస్‌ల వంటివి సులభంగా సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదేవిధంగా ‘స్రెప్టోకాకస్’ అనే బాక్టీరియా వల్ల గొంతు నొప్పితో ఈ సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా టాన్సిల్స్‌కు ఇన్ఫ్‌క్షన్లు వస్తే, ఆ ఇన్ఫెక్షన్ గొంతు నుండి శరీరంలోని ఇతర భాగాలకూ సోకే ప్రమాదం ఉంది. అందుకే టాన్సిల్స్‌ను నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు.
అడినాయిడ్స్
అడినాయిడ్స్ విషయానికి వస్తే చిన్న వయస్సులో మొదలయ్యి, 12-13 ఏళ్ల వయసు వచ్చేసరికి మెల్లమెల్లగా కుంచించుకుపోతాయి. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా అదృశ్యమైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అడినాయిడ్స్ సమస్య చిన్న పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడినాయిడ్స్ వాపు వల్ల ముక్కు నుంచి చెవి వరకూ ఉండే గొట్టం మూసుకుపోయి వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కర్ణబేరి వెనుక నీరు చేరి, చెవి ఇన్ఫెక్షన్స్, వినికిడి లోపం వంటి పెద్ద సమస్యలు చెలరేగుతాయి. ఎదిగే వయస్సులో పిల్లలకూ తరచూ ఈ చెవి ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వారికి మాటలు రావడం కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సమస్య మరింత ఎక్కువగా బాధిస్తుంటే తగిన వైద్య సలహా మేరకు సర్జరీ ద్వారా తొలగించడమే మంచిదని తాజా అధ్యయనాల వెల్లడిస్తున్నాయి.
టాన్సిలైటిస్ గొంతునొప్పి ముఖ్యం
టాన్సిల్స్ వాపులో తీవ్రమైన గొంతునొప్పి, గుటక మింగుతుంటే నొప్పి రావచ్చు. టాన్సిల్స్ ఎర్రగా వాచి కనబడతుంటాయి. జ్వరం ఉండొచ్చు.‘టాన్సిలైటిస్’ ఇన్‌ఫెక్షన్ తీవ్రమైతే మెడ దగ్గర-దవడల కింద ఉండే లింఫ్ గ్రంథుల వాచి బిళ్లకట్టినట్టు ఉండొచ్చు. ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా గొంతు మారే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ ముదిరితే టాన్సిల్స్ మీద, కొండనాలుక మీద చీము తెల్లగా కనబడుతుంటుంది. చాలాసార్లు టాన్సిల్స్‌తో పాటు అడినాయిడ్స్ కూడా ప్రభావితం కావచ్చు. రెండూ విడివిడిగా కూడా రావచ్చు.
టాన్సిల్స్ను గుర్తించేదెలా?
1. టాన్సిల్స్ వాపు, ఇన్ఫెక్షన్ బాహాటంగా కనబడుతుంది కాబట్టి వైద్యులు లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారు. మరీ తరచూ వేధిస్తుంటే గొంతు నుంచి దూదిపుల్లతో స్రావాలను సేకరించి, కల్చర్ పరీక్ష ద్వారా ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటన్నదీ గుర్తిస్తారు.
2. అడినాయిడ్స్ బయటకు కనిపించదు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్‌ఫెక్షన్ సోకినట్టు అనిపిస్తే ముఖాన్ని పక్కకు ఉంచి ఎక్స్‌రే తీస్తారు. అడినాయిడ్ ఉబ్బితే.. ముక్కు వెనక ఉండే శ్వాసమార్గం మూసుకున్నట్టు కనిపిస్తుంది. లేదా అద్దంలోగానీ, ముక్కు ద్వారా పంపే వీడియో ఎండోస్కోపీ ద్వారాగానీ అడినాయిడ్స్‌ను చూడొచ్చు.
టాన్సిల్స్ కు సహజసిధ్ధ ఆయుర్వేద చికిత్స
చింత విత్తనం
మనకు చింతపండులో వుండే చింత విత్తనం దీనిపై అద్భుతంగా పనిచేస్తుంది. చింత విత్తనాన్ని బండ, లేదా సానరాయి మీద గంధం వచ్చేలా అరగదీయాలి. వచ్చిన గంధాన్ని గొతుక్రింద టాంసిల్స్ వాసి చేతికి తగిలే భాగమ్లో పట్టీలాగా వేయాలి. అలాగే ఒక పుల్లకు దూదిచుట్టి ,దానితో గంధాన్ని తీసుకుని నోరుతెరవమని చెప్పి టాంసిల్స్ కు తగిలేలా పూయాలి. ఇలా రోజుకు నాలుగైదుసారులు టాంసిల్స్ కు పూయాలి . వారము రోజులు చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. రోజురోజుకు ఫలితాలు మనకు తెలుస్తుంటాయికనుక మరికొన్ని రోజులు పట్టినా విడవకుండా వాడాలి. మనపెద్దలిచ్చిన వైద్యమిది. దీనివల్ల ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు.
అల్లోపతి చికిత్స?
టాన్సిల్స్, అడినాయిడ్స్ వాచి ఇన్‌ఫెక్షన్‌కు గురైన వెంటనే యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదు. ముందు 2-3 రోజుల పాటు విశ్రాంతితో పాటు జ్వరం, గొంతునొప్పి తగ్గేందుకు పారాసిటమాల్ వంటివి వైద్యులు ఇస్తారు. చాలాసార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా మరింత తీవ్రం అవుతుంటే పెన్సిలిన్, అమాక్సిసిసిలిన్, కోఅమాక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటితో 5-6 రోజుల్లోనే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వీటితో తగ్గుతున్నా,ఇదే సమస్య మళ్లీమళ్లీ పురావృతం అయ్యి వేధిస్తుంటే మాత్రం సర్జరీ అవసరమేమో వైద్యులు పరిశీలిస్తారు.
సర్జరీ ఎవరికి అవసరం?
1. తరచూ టాన్సిల్స్, అడినాయిడ్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడేవారికి సర్జరీ అవసరమవుతుంది.ఏడాదికి మూడు సార్ల కంటే ఎక్కువగా దీంతో బాధపడుతుంటే సర్జరీ చెయ్యొచ్చని అమెరికా చెవిముక్కుగొంతు వైద్యుల సంఘం చెబుతోంది.
2. ఏడాదికి ఐదు, అంతకంటే ఎక్కువసార్లు వస్తుంటే సర్జరీ చెయ్యొచ్చని బ్రిటీషు వైద్యుల సంఘం సూచిస్తోంది.
3. ఏడాదికి 3-5 కంటే ఎక్కువసార్లు ఇన్‌ఫెక్షన్ వచ్చేవారికి టాన్సిల్స్ తొలగించే ఆపరేషన్ టాన్సిలెక్టమీ చెయ్యటం మేలు. తరచుగా జలుబు, ముక్కుదిబ్బడ, గురక, నిద్రలో అవరోధం వంటి అడినాయిడ్స్ వాపు లక్షణాలుంటే అడినాయిడ్‌తో పాటు టాన్సిల్స్‌ను కూడా తొలగిస్తారు. అలాగే ఏడాదికి 2-3 సార్లే అయినా బాధలు మరీ తీవ్రంగా వేధిస్తున్న వారికీ సర్జరీ చెయ్యాల్సి రావచ్చని వైద్యులు చేబుతున్నారు.
సంప్రదాయ పద్ధతి
టాన్సిల్స్‌ను తొలగించటానికి సంప్రదాయంగా ‘డైసెక్షన్ అండ్ స్నేర్’ పద్ధతి అనుసరిస్తారు. దీనిలో సాధారణ పరికరాలతోనే (కోల్డ్ స్టీల్) టాన్సిల్స్‌ను తొలగిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్, కోబ్లేషన్, డిబ్రైడర్ వంటి రకరకాల పరికరాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో నొప్పి-రక్తస్రావం వంటివి తక్కువని చెబుతుంటారు. కానీ వాస్తవానికి వైద్యపరమైన అధ్యయనాల్లో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతుల్లో చేసే సర్జరీనే మెరుగ్గా ఉంటోందని గుర్తించారు.
సంప్రదాయ పరికరాలతో చేసే సర్జరీకి అయ్యే ఖర్చు తక్కువ, నొప్పి తక్కువ, మత్తు ఎక్కువసేపు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా కొందరిలో సర్జరీ తర్వాత 5-7 రోజుల్లో రక్తస్రావమయ్యే అవకాశముంటుంది. సర్జరీ తర్వాత సమస్యలూ తక్కువగానే ఉంటున్నాయి. అడినాయిడ్స్ సర్జరీ కూడా- కోబ్లేషన్, మైక్రోడిబ్రైడర్, లేజర్ ప్రక్రియల ద్వారా చెయ్యొచ్చు. కానీ సంప్రదాయ పరికరాలతో (అడినాయిడ్ క్యూరెట్) చేసే పద్ధతే మెరుగని గుర్తించటం జరిగింది. దీంతో సర్జరీ చాలా కొద్ది సమయంలో పూర్తయిపోతుంది.
టాన్సిల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారపదార్ధలు
1. ఆకుకూర
ఉడికించిన గ్రీన్ ఫీలీవెజిటెబుల్స్, ఆకుకూరలు వంటివి థ్రోట్ ఇన్ఫెక్షన్ నివారించడానికి సహాయపడుతాయి. ఆకుకూరలు బాగా ఉడికించి ఆరసంలో పెప్పర్ పౌడర్ వేసి గోరువెచ్చగా త్రాగడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు గొంతునొప్పిని నివారిస్తుంది.
2.బంగాళదుంప
గొంతు నొప్పి నివారణకు చక్కగా పని చేసే వాటిలో ఇది మరొక ఆరోగ్యకరమైన పదార్ధం. బంగాళదుంపలను బాగా ఉడికించి పొట్టు తీసి, గరిటతో మెత్తగా చిదిమితే సరిపోతుంది.
3.అల్లం
టాన్సిల్స్ తగ్గించడానికి, గొంతు ఇన్ఫెక్షన్ కు ఇది మంచి గృహ చిట్క. గొంతునొప్పికి తక్షణ ఉపశమనం పొందడానికి కొద్దిగా తేనెలో అల్లం పౌడర్ లేదా అల్లం చూర్ణాన్ని కలుపుకొని సేవించాలి.
4. తేనె, నిమ్మ
టాన్సిల్ తగ్గించడానికి మరో మంచి గృహ చిట్క. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో, తగినంత తేనె, నిమ్మరసాన్ని కలుపుకుని త్రాగాలి.
5. ఇడ్లీ
సాధారణంగా ఉన్న ఇడ్లీ చాలా ఆరోగ్యకరం. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు మెత్తగా ఉండే ఇడ్లీని తినవచ్చు. సాంబార్, పచ్చడి వంటివి వాడకపోవడమే చాలా మంచిది.
6. పెరుగు
టాన్సిల్స్ ఉన్నప్పుడు చాలా మంది పెరుగు తినకూడదని దురాభిప్రాయం ఉంది. పెరుగు సాఫ్ట్ పుడ్ మ్రింగడానికి చాలా సులభంగా ఉంటుంది. గొంతునొప్పి మరియు దురద, గొంతు వాపు వంటివి నివారించడానికి అతి చల్లగా ఉండే పెరుగును తీసుకోకూడదు.
7. ఉడికించిన అన్నం
ఉడికించిన అన్నం మెత్తగా ఉండటమే కాకుండా మ్రింగడానికి సులభంగా ఉంటుంది. స్పైసీ రైస్ ప్రిపేర్ చేయడం కంటే ప్లెయిన్ రైస్ తినడం మంచిది. మరీ ప్లెయిన్ గా తినడం ఎలా అనుకొంటే టాన్సిల్స్ నివారణకు ఉపయోగపడే మసాలా దినుసులు(చెక్క, లవంగం వంటివి)కలుపుకోవచ్చు.
టాన్సిల్స్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. పాలు, పసుపు
రాత్రి పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటూ తీసుకుంటే టాన్సిల్స్ తగ్గుతాయి.
2. ఉప్పు
టాన్సిల్స్ వల్ల వచ్చే నొప్పిని నియంత్రించటానికి ఉప్పు చక్కటి ఔషధం. కప్పు వేడి నీళ్లలో ఉప్పు వేసి కలపాలి. గోరువెచ్చగా అయిన తర్వాత గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతులో చేరిన బ్యాక్టీరియా నశిస్తుంది. నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.
3. పసుపు
టాన్సిల్స్ సమస్యను తగ్గించడంలో పసుపు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపు కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
4. చెక్క
ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో చెంచా దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి రోజూ రెండు లేదా మూడు పూటలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. గొంతులో వేధించే నొప్పి, వాపు కూడా తగ్గిపోతాయి.
5. నిమ్మరసం
టాన్సిల్స్ వాపుతో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ విటమిన్ సి లభించే నిమ్మరసం మాత్రం టాన్సిల్స్ సమస్యకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు.. చక్కగా పనిచేస్తాయి. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి, చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
6. మిరియాలు
ఒక స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల తేనె తీసుకుని నాలుగు స్పూన్ల వేడినీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు ఒక స్పూన్ తీసుకుంటే టాన్సిల్స్ తగ్గుతాయి.
7. తులసి
తులసి ఒక యాంటి ఇంఫ్లమటరీ గుణాలు ఉన్నది. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని తులసి ఆకులు వేశాక 10 నిమిషాలు మరగనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ ద్రావణాన్ని వడగట్టి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. అవసరమైతే ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా మూడు రోజుల పాటు మూడు సార్లు తీసుకుంటే టాన్సిల్స్ తగ్గి మంచి ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- IIFA ఉత్సవం.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం..
- జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం.. అథారిటీ కీలక అప్డేట్ జారీ..!!
- ఖతార్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2024-2030 ప్రారంభం..!
- రియాద్ లైట్ ఫెస్టివల్ 2024.. నవంబర్ 28న ప్రారంభం..!!
- కువైట్ లో రాబోయే రోజుల్లో వర్షాలు..!
- ప్రధాని మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన
- చరిత్ర సృష్టించిన టీమిండియా, ఆసియా హాకీ ట్రోఫీ విజేతగా భారత్
- ప్రపంచంలో రాత్రిళ్ళు లేని దేశాల గురించి తెలుసా..?