డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- October 19, 2026
అబుదాబి: యూఏఈలో ప్రసిద్ధి చెందిన ఎడారి వినోద, సాహస క్రీడల వేడుక ‘లివా ఫెస్టివల్–2026’ మరోసారి సందడి చేయనుంది. డిసెంబర్ 11 నుంచి 2027 జనవరి 2 వరకు అల్ ధఫ్రా ప్రాంతంలోని లివా ఎడారిలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. 300 మీటర్లకు పైగా ఎత్తున్న యూఏఈలోనే అత్యంత ఎత్తైన ఇసుక దిబ్బగా పేరొందిన తల్ మోరీబ్ వద్ద ఈ వేడుకలు జరగనున్నాయి. ఈసారి ఫెస్టివల్లో కొత్త వినోద కార్యక్రమాలు, మోటార్‌స్పోర్ట్స్ పోటీలు, సంప్రదాయ ఎమిరేటీ సంస్కృతిని పరిచయం చేసే ప్రత్యేక కార్యక్రమాలు, కుటుంబాలతో కలిసి ఆనందించే వినోద కార్యకలాపాలు ఏర్పాటు చేయనున్నారు.
తొలిసారిగా అధికారిక యాప్
లివా ఫెస్టివల్ చరిత్రలో తొలిసారిగా అధికారిక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా సందర్శకులు కార్యక్రమాల షెడ్యూల్‌ను తెలుసుకోవచ్చు. తాజా ప్రకటనలను వీక్షించడంతో పాటు క్యాంపింగ్ స్థలాలు, ఆర్వీ (RV) వాహనాల పార్కింగ్ స్థలాలను ఎంపిక చేసుకుని బుక్ చేసుకోవచ్చు. వాణిజ్య భాగస్వామ్య అవకాశాల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
సగానికి పైగా కొత్త ఆకర్షణలు
ఈ ఏడాది ఫెస్టివల్లో సగానికి పైగా రైడ్లు, వినోద ఆకర్షణలను కొత్తగా ఏర్పాటు చేయడం లేదా సరికొత్త రూపంలో అందించడం ప్రత్యేకతగా నిలవనుంది.
- కొత్త రైడ్లు: సర్కస్ స్వింగర్, టగాడా, స్పేస్ టవర్.
- సాహస కార్యక్రమాలు: నింజా ఛాలెంజ్, పిక్సెల్ రన్, డెజర్ట్ హీస్ట్, డ్రిఫ్ట్ ట్రైక్, టార్గెట్ షూటింగ్, క్లైంబ్ క్వెస్ట్.
- కొత్త ఆకర్షణ: బంగీ జంపింగ్ తొలిసారిగా ప్రారంభం కానుంది.
- కొనసాగనున్న వినోదాలు: ఫెర్రిస్ వీల్, బంపర్ కార్లు, స్లింగ్షాట్, బూస్టర్, గో వాటర్ కార్ట్, హౌస్ ఆఫ్ హారర్, మేజ్ అడ్వెంచర్, 4x4 ట్రాక్ తదితరాలు.
డిసెంబర్ 19, 20 తేదీల్లో నైట్రో సర్కస్ ప్రదర్శనలు
అంతర్జాతీయ వినోద బృందం ‘నైట్రో సర్కస్’ ఈ ఫెస్టివల్లో తొలిసారిగా పాల్గొననుంది. డిసెంబర్ 19, 20 తేదీల్లో మూడు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఫ్రీస్టైల్ మోటోక్రాస్, బీఎంఎక్స్ సైక్లింగ్, సమన్వయంతో కూడిన విన్యాసాలు, పైరోటెక్నిక్ ప్రదర్శనలతో సందర్శకులను అలరించనున్నారు. 15 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు.
మోటార్‌స్పోర్ట్స్ పోటీలతో ఉత్సాహం
లివా స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎడారి క్రీడలు, మోటార్‌స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ 11–12 ఫ్రీస్టైల్ డిస్ప్లే
డిసెంబర్ 13 మోటార్‌బైక్ డ్రాగ్ రేస్
డిసెంబర్ 14–16 ఫాల్కన్ రేస్
డిసెంబర్ 18–19 శాండ్ ఫ్రీస్టైల్ డిస్ప్లే
డిసెంబర్ 20 లివా యూటీవీ ట్రాక్
డిసెంబర్ 21 సైక్లింగ్ రేస్
డిసెంబర్ 22–23 సంప్రదాయ పావురాల పందెం
డిసెంబర్ 24 లివా బర్నౌట్ ఛాలెంజ్
డిసెంబర్ 25–26 లివా డ్రిఫ్ట్ పోటీలు
డిసెంబర్ 27–28 శాండ్ ఫ్రీస్టైల్ డిస్ప్లే
డిసెంబర్ 30 – జనవరి 2 తల్ మోరీబ్ కార్ ఛాంపియన్షిప్ ఫైనల్
ఇవే కాకుండా డిసెంబర్ 19న లివా సైన్ క్లైంబ్ ఛాలెంజ్, డిసెంబర్ 23న కమ్యూనిటీ రన్, డిసెంబర్ 24–25 తేదీల్లో పాడెల్ టోర్నమెంట్, డిసెంబర్ 29న ఫిట్నెస్ టూర్ నిర్వహించనున్నారు.
ఎమిరేటీ సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం
ఈసారి లివా విలేజ్‌ను సరికొత్త రూపంలో తీర్చిదిద్దనున్నారు. సంప్రదాయ ఎమిరేటీ నివాస ప్రాంతమైన ‘అల్ ఫరీజ్’ నమూనాలో హెరిటేజ్ విలేజ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో స్థానిక జీవనశైలి, ఆచారాలు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాలు కల్పిస్తారు.
- పోయేంట్రీ వేదిక: ‘హౌస్ ఆఫ్ పోయెట్రీ అండ్ పోయెట్స్’ ద్వారా నబాతీ కవిత్వాన్ని పరిచయం చేస్తారు.
- ఫాల్కన్రీ టెంట్: గద్దల పెంపకం, శిక్షణ, సంరక్షణ విధానాలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తారు. పిల్లల కోసం గద్దల తలపై ధరించే ప్రత్యేక హుడ్ల నమూనాల తయారీ వర్క్‌షాప్‌లు ఉంటాయి.
- ట్రెడిషనల్ గేమ్స్: తీలాహ్, కరాబీ, తాడులాగుడు, ఒంటె స్వారీ, తాటి చెట్టు ఎక్కే అనుభవాన్ని అందించే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
- కళలు: తాటి ఆకులతో వస్తువుల తయారీ, అల్లిక వంటి కళలను నేర్పిస్తారు.
- ఎమిరేటీ మజ్లిస్: అతిథులను ఆహ్వానించడం, పలకరించడం, కూర్చోబెట్టడం, గౌరవించడం వంటి సంప్రదాయాలను వివరించే కార్యక్రమాలు ఉంటాయి.
- అరబిక్ కాఫీ ఆతిథ్యం: ఎమిరేటీ గహ్వా తయారీ, వడ్డించే పద్ధతులు, ఆతిథ్య మర్యాదలపై ప్రత్యక్ష వర్క్‌షాప్ నిర్వహిస్తారు.
గత ఏడాది 7 లక్షల మందికి పైగా సందర్శన
గత ఏడాది 23 రోజుల పాటు నిర్వహించిన లివా ఫెస్టివల్‌కు 7 లక్షల మందికి పైగా సందర్శకులు వచ్చారు. 2026 మిడిల్ ఈస్ట్ ఈవెంట్స్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం కూడా లభించింది. ఈసారి ప్రధాన ఫెస్టివల్ ప్రాంగణంతో పాటు అల్ ధఫ్రా ప్రాంతంలోని పలు ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లివా సైన్ ల్యాండ్‌మార్క్, ధఫీర్, అల్ మీల్, అల్ యబానా కోటల వద్ద షాపింగ్, ఆహార విక్రయాలు, ఖనూర్ కోటలో సంప్రదాయ హస్తకళలు, మెజైరా కోటలో చారిత్రక, సాంస్కృతిక అనుభవాలు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







