‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- October 19, 2026
దుబాయ్: సమాజంలో నిరుపేదలకు అండగా నిలుస్తూ, సేవా కార్యక్రమాలతో ప్రజల జీవితాల్లో ఆశలు నింపుతున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించి ప్రోత్సహించేందుకు యూఏఈ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అరబ్ హోప్ మేకర్స్’ (Arab Hope Makers) ఏడో ఎడిషన్‌ను ప్రారంభించినట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విజేతకు Dh1మిలియన్ నగదు బహుమతి అందించనున్నారు. అరబ్ ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒకటిగా పేరొందిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సేవా బృందాలు, లాభాపేక్షలేని సంస్థలను గుర్తించి గౌరవించనున్నారు.
అరబ్ దేశాల్లో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులను నామినేట్ చేయాలని షేక్ మహమ్మద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇతరుల జీవితాలను మెరుగుపరచేందుకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న వారు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (MBRGI) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా లాభాపేక్ష లేకుండా పనిచేసే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, బృందాలు ఇందులో పాల్గొనవచ్చు.
- నిరుపేదలు, బాధితులకు సహాయం అందించే సేవా కార్యక్రమాలు.
- విద్య, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రాజెక్టులు.
- సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు.
- స్థానిక సమస్యలకు పరిష్కారాలు చూపే వినూత్న ఆలోచనలు, ప్రచార కార్యక్రమాలు.
- ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం అందించేందుకు కృషి చేసే సేవా సంస్థలు.
అర్హులైన వారు స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఇతరులు వారి పేర్లను నామినేట్ చేయవచ్చు. దరఖాస్తులు, నామినేషన్ల కోసం అధికారిక వెబ్సైట్ [arabhopemakers.com]ను సందర్శించవచ్చు.
2017లో ప్రారంభమైన కార్యక్రమం
షేక్ మహమ్మద్ 2017లో సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలోనే 65 వేలకుపైగా దరఖాస్తులు రావడం విశేషం. నిర్వాహకులు తొలుత 20 వేల దరఖాస్తులను లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆరు ఎడిషన్లలో కలిపి 3.35 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరో ఎడిషన్‌కు 15,800 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
2025 విజేత
2025లో జరిగిన ఆరో ఎడిషన్‌లో మొరాకోకు చెందిన ఫౌజియా జబారా మహ్మూదీ విజేతగా నిలిచారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే సమస్యలకు శస్త్రచికిత్సలు అందించే ‘ఆపరేషన్ స్మైల్’ సంస్థ ద్వారా ఆమె సేవలందించారు. ఈ కార్యక్రమం ద్వారా 19 వేలకుపైగా శస్త్రచికిత్సలకు సహకారం అందించినట్లు కథనంలో పేర్కొన్నారు. కువైట్‌కు చెందిన హెండ్ అల్హజ్రీ టాంజానియాలో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే ‘ఫాతిమా హౌస్’ను స్థాపించారు. మొరాకోకు చెందిన అబ్దెర్రహ్మాన్ రైస్ వితంతువులు, అవసరంలో ఉన్న మహిళలకు సహాయం అందించే మానవతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీరిద్దరూ గత ఎడిషన్‌లో చివరి దశకు చేరిన అభ్యర్థులుగా నిలిచారు. దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆదేశాల మేరకు ముగ్గురు ఫైనలిస్టులకు ఒక్కొక్కరికి Dh1 మిలియన్ చొప్పున అందించారు. దీంతో గత ఎడిషన్‌లో మొత్తం బహుమతి మొత్తం Dh3 మిలియన్లకు చేరింది.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







