అబుదాబి నుంచి అమృత్‌సర్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు.. గోవాకు తిరిగి సర్వీసులు
- October 27, 2026
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి నుంచి భారత్‌కు విమాన కనెక్టివిటీ మరింత విస్తరించింది. అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH) నుంచి అమృత్‌సర్‌కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించడంతో పాటు, గోవాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తిరిగి ప్రారంభించింది. ఈ రెండు మార్గాల్లోనూ అక్టోబర్ 25 నుంచి విమానాలు అందుబాటులోకి వచ్చాయి. వారానికి మూడు సార్లు ఈ సర్వీసులు నడవనున్నాయి.
17 భారతీయ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు
గత 12 నెలలుగా అబుదాబి నుంచి భారతదేశానికి తన విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ గణనీయంగా విస్తరిస్తోంది. 2025 నుంచి గువాహటి, ఇండోర్, హైదరాబాద్, లక్నో, నవీ ముంబై, పుణె నగరాలకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించింది.
తాజాగా అమృత్‌సర్‌కు కొత్త సర్వీసులను ప్రారంభించడంతో పాటు గోవాకు విమానాలను పునరుద్ధరించింది. ప్రస్తుతం అబుదాబి నుంచి భారత్‌లోని 17 నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నేరుగా విమానాలను నడుపుతోంది. వారానికి సుమారు 160 విమాన సర్వీసులు అబుదాబి-భారత్ మధ్య ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.
బెంగళూరు, ఢిల్లీ, కన్నూర్, కొచ్చి, కోజికోడ్, మంగళూరు, ముంబై, తిరువనంతపురం, తిరుచిరాపల్లి తదితర నగరాలకు ఇప్పటికే నేరుగా విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
పర్యాటకం, వ్యాపారానికి మరింత ప్రోత్సాహం
పంజాబ్‌లోని అమృత్‌సర్‌ను స్వర్ణ నగరంగా పిలుస్తారు. ఇది ప్రముఖ సాంస్కృతిక, వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. మరోవైపు, గోవా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈ రెండు నగరాలకు విమాన సర్వీసుల విస్తరణతో యూఏఈ, భారత్ మధ్య పర్యాటకం, వ్యాపార ప్రయాణాలు, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలుసుకునే ప్రయాణాలకు మరింత సౌలభ్యం కలగనుంది.
భారత్‌తో అనుసంధానం మరింత బలోపేతం
అబుదాబి ఎయిర్‌పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కార్స్టెన్ నార్లాండ్ మాట్లాడుతూ.. అబుదాబికి భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటని పేర్కొన్నారు. అమృత్‌సర్‌కు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించడం, గోవాకు విమానాలను తిరిగి నడపడం ద్వారా భారత్-యూఏఈ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో భాగస్వామ్యాన్ని మరింత విస్తరిస్తున్నామని వెల్లడించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఛైర్మన్, ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. అమృత్‌సర్‌కు కొత్త విమాన సర్వీసులు, గోవాకు విమానాల పునఃప్రారంభంతో తమ అంతర్జాతీయ నెట్‌వర్క్ మరింత విస్తరిస్తోందన్నారు. గత ఏడాది కాలంలో అబుదాబి నుంచి ఆరు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించామని తెలిపారు.
భారత్, యూఏఈ మధ్య ప్రయాణాలను మరింత సులభతరం చేయడంతో పాటు, రెండు దేశాల మధ్య సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి అమృత్‌సర్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు.. గోవాకు తిరిగి సర్వీసులు
- విశాఖలో BRICS క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- నవంబర్ 1 నుంచి కొత్త GST నిబంధనలు
- పెన్షన్ వ్యవస్థలో ఖతార్‌కు మెరుగైన ర్యాంకింగ్..!!
- సౌదీలో స్పోర్ట్స్ టికెట్ల విక్రయాలకు కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2026 మీడియా ఎక్సలెన్స్ విజేతలకు సత్కారం..!!
- డిసెంబర్లో అబుదాబిలో అరుదైన లగ్జరీ కార్ల వేలం..!
- కువైట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..!!
- బహ్రెయిన్‌లో గృహ రుణాల పరిమితి పెంపుపై ప్రభుత్వ అభ్యంతరం..!!
- సల్మానియాలో ప్రత్యేక బ్రెస్ట్ హెల్త్ యూనిట్ ప్రారంభం..!







