యూఏఈలో ఆరోగ్య రంగ ప్రముఖులకు ఘన సత్కారం

- October 28, 2026 , by Maagulf
యూఏఈలో ఆరోగ్య రంగ ప్రముఖులకు ఘన సత్కారం

ఆరో వార్షిక హెల్త్ అవార్డ్స్ 2026లో అవార్డులు ప్రదానం చేసిన షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్

దుబాయ్: యూఏఈలో వైద్య, ఆరోగ్య రంగాల్లో విశేష సేవలందిస్తున్న వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, పరిశోధకులు, ఆరోగ్య సంస్థలను ఘనంగా సత్కరించారు. దుబాయ్‌లోని గ్రాండ్ హయత్ హోటల్‌లో నిర్వహించిన ఆరో వార్షిక హెల్త్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో యూఏఈ క్యాబినెట్ సభ్యుడు, సహనం మరియు సహజీవన శాఖ మంత్రి గౌరవనీయులు షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు సహా సుమారు 1,000 మంది హాజరయ్యారు.

ఈ ఏడాది అవార్డుల్లో వైద్య సేవల్లో అత్యుత్తమ ప్రతిభ, శస్త్రచికిత్సల్లో నూతన ఆవిష్కరణలు, ప్రజారోగ్యం, వెల్‌నెస్, వైద్య విద్య, పరిశోధన, రోగుల సంరక్షణ తదితర విభాగాల్లో 50కి పైగా కేటగిరీలలో ప్రతిభావంతులను గుర్తించి సత్కరించారు. అదేవిధంగా యూఏఈ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న 15 మంది ఎమిరాతీ జాతీయులను ప్రత్యేక అవార్డులతో గౌరవించారు.

ఆరోగ్య రంగంలో సేవలు అభినందనీయం

ఈ సందర్భంగా షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ.. ఆరో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ అవార్డులు వైద్య రంగంలో నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకితభావంతో సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవిస్తున్నాయని తెలిపారు. ఆరోగ్య రంగంలో సాధించే ప్రతి పురోగతి వెనుక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, సమాజ శ్రేయస్సును పెంపొందించేందుకు నిరంతరం కృషి చేసే వ్యక్తులు, సంస్థలు ఉంటాయని పేర్కొన్నారు.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దార్శనిక నాయకత్వంలో ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు దేశం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. అత్యుత్తమ ప్రమాణాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రతి వ్యక్తి పట్ల శ్రద్ధతో కూడిన ఆరోగ్య వ్యవస్థను యూఏఈ అభివృద్ధి చేసిందన్నారు.

దుబాయ్ రూలర్, యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాయకత్వంలో వైద్య రంగంలో నాణ్యత, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.

రోగుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

వైద్య సేవల్లో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవీయ విలువలు కూడా ఎంతో ముఖ్యమని షేక్ నహ్యాన్ స్పష్టం చేశారు. వైద్య పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, కరుణ, మానవ గౌరవం కలిసిన ఆరోగ్య వ్యవస్థను నిర్మించడమే యూఏఈ లక్ష్యమని పేర్కొన్నారు.

అవార్డులు అందుకున్న వైద్య నిపుణులు తమ నైపుణ్యం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు, అంకితభావంతో రోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారని ప్రశంసించారు.

యూఏఈలో వివిధ దేశాలకు చెందిన వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. భిన్నమైన భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ రోగుల ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు అనే ఒకే లక్ష్యంతో వారంతా ముందుకు సాగుతున్నారని చెప్పారు.

వైద్య రంగంలో సహనం, సహజీవనం అనేవి కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదని, ప్రతి రోగిని గౌరవంగా చూడటం, వివిధ సంస్కృతులకు చెందిన కుటుంబాలకు సేవలందించడం, విభిన్న జాతీయతలకు చెందిన సిబ్బంది సమన్వయంతో పనిచేయడం ద్వారా అవి ప్రతిరోజూ ఆచరణలో కనిపిస్తున్నాయని వివరించారు.

ఎమిరాతీ యువత వైద్య రంగంలోకి రావాలి

ప్రత్యేక అవార్డులు అందుకున్న 15 మంది ఎమిరాతీ జాతీయులను అభినందించిన షేక్ నహ్యాన్.. వైద్య రంగంలో స్థానిక ప్రతిభావంతులు సాధిస్తున్న విజయాలు దేశ ఆరోగ్య వ్యవస్థకు గర్వకారణమని అన్నారు.

వైద్యం, ఆరోగ్య శాస్త్రాల్లో యువ ఎమిరాతీలు అధిక సంఖ్యలో కెరీర్‌ను ఎంచుకుని, అవార్డు గ్రహీతలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వారి విజయాల వెనుక ఉన్న కుటుంబాలు, గురువులు, శిక్షణనిచ్చిన సంస్థల కృషిని కూడా గుర్తించాలని పేర్కొన్నారు.

కుటుంబాల పాత్ర కీలకం

యూఏఈలో 2026 సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ'గా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణలో కుటుంబాల పాత్రను షేక్ నహ్యాన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పించడం, వృద్ధులను సంరక్షించడం, అనారోగ్య సమయంలో కుటుంబ సభ్యులకు అండగా నిలవడం వంటి అంశాలు ఇంటి నుంచే ప్రారంభమవుతాయని తెలిపారు. వైద్యులు, నర్సులు సుదీర్ఘ పని గంటలు, రాత్రి షిఫ్టులు, కుటుంబ వేడుకలకు దూరంగా ఉంటూ సేవలందించేందుకు వారి కుటుంబాలు అందించే సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

అవార్డు గ్రహీతల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. వారి ప్రోత్సాహం, సహకారం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు.

వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు కీలక మార్పులకు దోహదపడుతున్నాయని షేక్ నహ్యాన్ పేర్కొన్నారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, వైద్య పరిశోధనలకు సహకరించడం, మెరుగైన చికిత్సా అవకాశాలను అభివృద్ధి చేయడంలో ఏఐ ఉపయోగపడుతోందని తెలిపారు.

అయితే సాంకేతిక పరిజ్ఞానం వైద్యుల నైపుణ్యాన్ని పెంపొందించగలదే తప్ప, కరుణ, నైతిక నిర్ణయాలు, జవాబుదారీతనం, వైద్యులు-రోగుల మధ్య నమ్మకాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మానవీయ విలువలు అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

తుంభే గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహణ

ఈ కార్యక్రమాన్ని తుంభే గ్రూప్‌కు చెందిన థంబే మీడియా ప్రధాన ప్రచురణ అయిన 'హెల్త్ మ్యాగజైన్' నిర్వహించింది. 1999లో ప్రారంభమైన హెల్త్ మ్యాగజైన్ నుంచి ఈ అవార్డుల ప్రస్థానం ప్రారంభమైందని తుంబే గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు, హెల్త్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, ప్రచురణకర్త డాక్టర్ తుంబే మొయిదీన్ తెలిపారు.

నార్తర్న్ ఎమిరేట్స్‌లో తుంబే మీడియా పలు మ్యాగజైన్లను ప్రచురిస్తోందని పేర్కొంటూ, అవార్డులకు నిరంతర ప్రోత్సాహం అందిస్తున్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.

ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది. సీనియర్ వైద్యులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రముఖులతో కూడిన జ్యూరీ సహకారంతో ప్రతి నామినేషన్‌ను స్వతంత్రంగా, ఆడిట్ చేయబడిన, ప్రతిభ ఆధారిత విధానంలో పరిశీలించారు.

'హెల్త్ అవార్డును కొనుగోలు చేయలేరు, ప్రభావితం చేయలేరు.. దానిని తమ ప్రతిభతో సంపాదించుకోవాలి' అనే సూత్రం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అవార్డు విజేతలకు తుంబే మీడియా ప్రింట్, డిజిటల్, టెలివిజన్, సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి మోడ్రన్ ఫార్మసీ, ఎంపీసీ (మోడ్రన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ), థంబే ఫార్మసీ, తుంబే, సిటీ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించగా, నైట్ ఫ్రాంక్ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది.

యూఏఈతో పాటు విస్తృత గల్ఫ్ ప్రాంతంలో వైద్య ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న వైద్యులు, నర్సులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ నిర్వాహకులు, సంస్థల సేవలను గుర్తించి గౌరవించడం ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com